నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2023-06-02T23:04:57+05:30 IST

మైదుకూరు మండలం లంకమల అటవీ ప్రాం తం నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా నరికి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

ఏడు దుంగలు, కారు, బైకు, సెల్‌ఫోన్లు స్వాధీనం

నిందితుల వివరాలు వెల్లడించిన ఎస్పీ

కడప (క్రైం), జూన్‌ 2: మైదుకూరు మండలం లంకమల అటవీ ప్రాం తం నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా నరికి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీ సు కార్యాలయంలోని పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం ఏఎస్పీ తుషార్‌డూడి, కడప డీఎస్పీ ఎస్‌ఎండీ షరీఫ్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ నాగభూషణం, మైదుకూరు సీఐ చలపతి, ఎస్‌ఐ ఘనమద్దిలేటితో కలిసి విలేకరులకు నిందితుల వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా ముస్నాపేరు వాసి వెన్ను ముత్తు తంగరాజు, తమిళనాడు రాష్ట్రం కోలూరు తాలుకా బల్కురు గ్రామస్తుడు ఎల్లుగన్‌, సాందర్‌శంకర్‌, వల్లూరు మండలం పెద్దలేబాక చెందిన పెరికల రాజశేఖర్‌, ఖాజీపేట మండలం ముత్తలూరుపాడు వాసి రామసుబ్బారెడ్డి కలిసి మైదుకూరు మండలం కాకర్లపాలెం వద్ద తెలుగుగంగ రిజర్వాయరు వద్ద నలుగురు కలిసి ఎర్రచందనం దుంగలు కారులో లోడింగ్‌ చేస్తున్న సమాచారం వచ్చిందన్నారు.

ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మైదుకూరు పోలీసులు సంయుక్తంగా స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులపై రాళ్లు రువ్వి పరారీ అయ్యేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో సిబ్బంది వారి నుంచి తప్పించుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఫారెస్టు బీట్‌ ఆఫీసరు అయిన రామసుబ్బారెడ్డి సహా పెద్దలేబాక చెందిన రాజశేఖర్‌ (2004 నుంచి 2013 వరకుఫారెస్టు గార్డు) ఎర్రచందనం స్మగ్లింగుకు సహకరించడంతో అతనిపై కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇతనిపై పెనుగొండలో ఒక కేసు ఉన్నట్లు తెలిపారు. గంజికుంట సెక్షన్‌లో పనిచేస్తున్న రామసుబ్బారెడ్డి గతంలో ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించేవాడని తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి ఏడు ఎర్రచందనం దుంగలు, కారు, ద్విచక్ర వా హనం, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

Updated Date - 2023-06-02T23:04:57+05:30 IST