ముచ్చటగా మూడోసారీ..!

ABN , First Publish Date - 2023-03-25T23:08:46+05:30 IST

పేదింటి కలను సాకారం చేసే దిశగా ఉగాదికి సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామన్న ప్రభుత్వ, అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి.

ముచ్చటగా మూడోసారీ..!
మదనపల్లె మండలం కోళ్లబైలు జగనన్న కాలనీలో పునాది దశలో ఇంటి నిర్మాణాలు

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అంటూ..

గృహ ప్రవేశాలు వాయిదా

లక్ష్యాలు చేరుకోక.. బిల్లుల చెల్లింపులు లేక...

ఆందోళనలో లబ్ధిదారులు

మదనపల్లె, మార్చి 25: పేదింటి కలను సాకారం చేసే దిశగా ఉగాదికి సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామన్న ప్రభుత్వ, అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి. పేదలకు ఇళ్లు కాదు..ఊళ్లే కడుతున్నామని సీఎం జగన్‌ నుంచి అమాత్యుల వరకూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. నవరత్నాల్లో పేదలందరికీ పక్కా ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నట్లు ప్రగల్భాలు పలికారు. 2020 డిసెంబరు 25వ తేది గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అదిగో, ఇదిగో జగనన్న ఇళ్ల గృహప్రవేశం అంటూ ఇప్పటికే రెండుసార్లు ప్రకటించగా, ముచ్చటగా మూడోసారి కూడా ఉగాది ప్రవేశం వాయిదా పడింది. జిల్లాలోనే కాదు..రాష్ట్ర స్థాయిలో గృహ నిర్మాణాలు నిర్దేశిత లక్ష్యం చేరుకోలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కాకపోతే ఈ నెల 26వ తేది వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, అందుకే ప్రభుత్వం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మరికొందరు చెబుతున్నారు. అయితే ఏప్రిల్‌ 14వ తేది అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని గృహప్రవేశాలు చేయాలని, అప్పటికైనా టార్గెట్‌ పూర్తి చేయాలని జిల్లా అధికారులు.. గృహనిర్మాణ, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ మేరకు ఎవరి స్థాయిలో ఎన్ని గృహాలు పూర్తి చేయాలో మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ లక్ష్యాలు విధించారు.

జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట డివిజన్లలో 73,956 గృహాలు మంజూరయ్యాయి. 526 లేఅవుట్లలో 47,305 ప్లాట్లు కేటాయించగా, మిగిలిన లబ్ధిదారులకు సొంతస్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 21,335 మంది పునాది నిర్మాణానికి సిద్ధం చేయగా, 21,545 మంది పునాదులు పూర్తి చేశారు. అలాగే 7,045 మంది గోడలు నిర్మించగా, 4,896 మంది మోల్డింగ్‌ పూర్తి చేశారు. అలాగే 18,337 మంది ఇంటి నిర్మాణం పూర్తి చేయగా, 798 మంది నిర్మాణాలు ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు.

రెవెన్యూ డివిజన్ల వారీగా...

- రాయచోటిలో 26,645 గృహాలు మంజూరు కాగా, 7,687 మంది పునాది నిర్మాణానికి సిద్ధం చేయగా, 8,901 మంది పునాది పూర్తి చేశారు. అలాగే 2,140 మంది గోడలు, 1,774 మంది మోల్డింగ్‌ వేయగా, 5,941 మంది ఇంటిని పూర్తి చేశారు.

- రాజంపేటలో 17,736 గృహాలు మంజూరు చేయగా, 7,322 మంది పునాది నిర్మాణానికి పనులు సిద్ధం చేయగా, 4,012 మంది పునాది పనులు పూర్తి చేశారు. అలాగే 1,372 మంది గోడలు, 1,110 స్లాబ్‌ వేయగా, 3,761 గృహాలు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

- మదనపల్లె డివిజన్‌లో 29,575 గృహాలు మంజూరు కాగా, 6,326 మంది పునాది నిర్మాణానికి మట్టి పనులు పూర్తిచేయగా, 8,632 మంది పునాది పనులు పూర్తి చేశారు. అలాగే 3,533 గృహాలకు గోడలు పూర్తి కాగా, 2,012 మంది స్లాబ్‌ పూర్తి చేయగా, 8,636 మంది ఇంటిని పూర్తి చేశారు. మరోవైపు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఇంటిని మంజూరు చేసిన స్థాయిలో పనులు జరగక పోవడమే కాదు..బిల్లుల మంజూరులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో ఇంటికి బిల్లును అప్‌లోడ్‌ చేసిన నెలన్నర, రెండు నెలలకు గాని బిల్లు ఖాతాలో పడలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో మరికొందరికి ఏడాదైనా బిల్లులు రావడం లేదు. దీంతో నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకెళ్లడం లేదు.

ప్రస్తుతం గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కమ్మి ధరలు మరింత ప్రియమయ్యాయి. ఇసుకదీ అదే దారి. ఈ పరిస్థితిల్లో ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రూ.6 లక్షలు అవుతుందని అంచనా. కానీ ప్రభుత్వం ఇస్తున్న ధర రూ.1.80 లక్షలు మాత్రమే. గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో యూనిట్‌ ధర రూ.2 లక్షలు, పట్టణాల్లో రూ.2.50 లక్షలు ఉండగా, ఏటికేడు పెరుగుతున్న ధరల దృష్ట్యా యూనిట్‌ విలువ కూడా పెరగాలే కానీ, అంతకన్నా తగ్గించడం పేదలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా లేఅవుట్లలో స్థలాలు కేటాయించినా, పాతిక భాగం మాత్రమే నిర్మాణాలు చేపడుతున్నారు. మిగిలిన వారిలో ఆర్థిక ఇబ్బందులు, ఊరికి దూరంగా స్థలాలు కేటాయించడం, నిర్మాణాలకు అనుకూలంగా లేకపోవడం, నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, తదితర కారణాలతో ఇంటి నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు.

అడ్వాన్సు లేదు.. అప్పూ ఇవ్వలేదు

ఆర్థిక స్తోమత లేని పేదలను నిర్మాణాలకు ప్రోత్సహించే క్రమంలో అడ్వాన్సుగా ప్రభుత్వం ఇస్తామన్న రూ.15 వేలు అడ్వాన్సు, డ్వాక్రా సంఘాల్లో పావలా వడ్డీ పథకం కింద అప్పుగా ఇచ్చే రూ.35 వేలు చాలా మందికి అందడం లేదు. మహిళా పొదుపు సంఘాల్లో కొర్రీలు వేస్తుండగా, నిధుల లేమితో ప్రభుత్వమూ ఇవ్వడం లేదు. జగనన్న ఇళ్లకు ఇప్పటి వరకూ 90 బస్తాలు సిమెంటు ఇస్తుండగా, అదనంగా మరో 50 బస్తాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అదీనూ అమలు కాలేదు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం లబ్ధిదారులకు సిమెంటు, కమ్మి, స్టీలు, ఇసుక అందుబాటులోకి తెచ్చారు. అందుకు అయ్యే ధరను బిల్లులో కట్‌ చేస్తున్నారు. ఇది కొంతలో కొంత ఉపశమనమేనని చెప్పవచ్చు.

స్థలం కోసమే.. నిర్మాణం

ప్రస్తుతం ఇంటి నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తే చాలా మంది ప్లాటు పోతుందనో, ఇల్లు రద్దవుతుందనే భయం, ఆందోళనలో ఉన్నారు. దానిని నిజం చేసేలా అధికారుల నుంచి సిబ్బంది, వలంటీర్ల వరకూ లబ్ధిదారులకు ఇదే చెబుతున్నారు. నిర్మాణానికి గడువు విధిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో మొదట్లో ఉన్న ఆనందం, ఉత్సాహం తర్వాత కనిపించడం లేదు. ఈ క్రమంలో రద్దు పద్దును దృష్టిలో పెట్టుకుని అప్పోసప్పో చేసి కొందరు పునాది వరకూ పూర్తి చేస్తుండగా, మరికొందరు ఉన్నకాడికి పూర్తి చేస్తుండగా, ఇంకొందరు అయిన కాడికి అమ్మేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ కాస్ట్‌ మొత్తం రూ.1.80 లక్షలు కూడా పునాదికే సరిపోతోంది. దీంతో తర్వాత ప్రక్రియకు ఆ స్థాయిలో ముందుకెళ్లడం లేదు.

జిల్లా లక్ష్యం 30 వేలు

జిల్లాలో మొత్తం 30 వేల గృహాలు పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌ విధించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో జగనన్న ఇళ్లతో పాటు టిడ్కో ఇళ్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే 18 వేలకు పైగా ఇళ్లు పూర్తి కాగా, మిగిలిన నిర్మాణాలు ఇప్పటి నుంచి ఏప్రిల్‌ ఏడో తేది నాటికి పూర్తి చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. గతంలో జిల్లాలో సగటున రోజుకు 80 ఇళ్లు పూర్తి చేయగా, తాజా మూహుర్తంతో రోజుకు 200 ఇల్లు పూర్తి చేయించేలా అధికారుల నుంచి సిబ్బంది వారికి వారి స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో పునాది స్థాయిని పక్కన పెట్టి గోడలు, స్లాబ్‌లు పూర్తయిన వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా మోల్డింగ్‌ పూర్తయిన ఇళ్లకు ముందు భాగాన గోడకు ప్లాస్టింగ్‌ చేయించి రంగులు వేయించి ప్రవేశానికి మమ అనిపించేలా చేస్తున్నారు. అయితే గృహ నిర్మాణాల్లో జిల్లాలో రాయచోటి, రాజంపేట డివిజన్లతో పోలిస్తే మదనపల్లె డివిజన్‌ ప్రథమ స్థానంలో ఉంది.

Updated Date - 2023-03-25T23:08:46+05:30 IST