ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలి
ABN , First Publish Date - 2023-05-25T22:47:52+05:30 IST
ఉపాధి పథకం లో ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు.

ఉపాధి కూలీలకు చేస్తున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలి
బైఠాయించిన సిబ్బంది
జమ్మలమడుగు, మే 25: ఉపాధి పథకం లో ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శిస్తున్నారని, ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు. గురువారం జమ్మలమడుగు ఉపాధి హామీ కార్యాలయం ఎదుట కూలీ లు బైఠాయించారు. పొన్నతోట పంచాయతీ నర్సోజీ కొట్టాలలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్రప్రసాద్ రెండు నెలలు గా ఉపాధి పనులు చేస్తున్న రూ.1300 కూలీల అకౌంట్‌లో జమ చేయలేదన్నారు. దాదాపు 30 మందికిపైగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పనికిరానివారి పై పేర్లు నమోదు చేసుకుని వారి డబ్బు అకౌంట్లలో జమ చేస్తున్నాడని, పని చేస్తున్న తమకు నిలువునా మోసం చేస్తున్నాడని వాపోయారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి పని చేస్తున్న కూలీలకు న్యాయం చేయాలని, పనికిరాకుండా వారి అకౌంట్లలో జమ చేస్తున్న డబ్బును విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉపాధి హామీ ఏపీఓ మహేశ్వరరెడ్డిని వివరణ కోరగా ఉపాధి కూలీలపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ మోసాలను విచారించి లిఖితపూర్వకంగా వారి నుంచి ఫిర్యాదు తీసుకుని నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. చర్యలు తీసుకోకుండా రాజకీయం చేస్తే సమస్య మరింత ఉధృతం చేస్తామని కూలీలు హెచ్చరించారు. కూలీలకు అధికారులు విచారణ చేసి ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి.