మట్టి తవ్వు.. కోట్లు పట్టు...

ABN , First Publish Date - 2023-05-16T23:08:43+05:30 IST

చెరువులో మట్టి ద్వారా కొందరు అక్రమార్కులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. చెరువులో మట్టిని ఎక్స్‌కవేటర్లతో తవ్వి టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు, పొలాలకు తరలిస్తున్నారు. చెరువుతో పాటు దాని పక్కనున్న పట్టా భూములపై కూడా కన్నేశారు. పగలు చెరువుల్లోనూ, రాత్రుళ్లు పట్టా భూముల్లోనూ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.

మట్టి తవ్వు.. కోట్లు పట్టు...
దేవసముద్రం చెరువులో ఎక్స్‌కవేటర్‌ల ద్వారా తవ్వకాలు

దేవసముద్రం చెరువులో అక్రమ తవ్వకాలు

ఎక్స్‌కవేటర్‌లతో తవ్వకం... టిప్పర్లతో రవాణా

ఇటుక బట్టీలు, పొలాలకు తరలింపు

నెలకు కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఆదాయం

అడ్డుపడితే కేసులే... రైతులను భయపెట్టి పట్టా భూముల్లో తవ్వకం

చెరువులో మట్టి ద్వారా కొందరు అక్రమార్కులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. చెరువులో మట్టిని ఎక్స్‌కవేటర్లతో తవ్వి టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు, పొలాలకు తరలిస్తున్నారు. చెరువుతో పాటు దాని పక్కనున్న పట్టా భూములపై కూడా కన్నేశారు. పగలు చెరువుల్లోనూ, రాత్రుళ్లు పట్టా భూముల్లోనూ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు వందకు పైగా టిప్పర్ల ద్వారా మట్టి రవాణా జరుగుతోంది. ఒక టిప్పర్‌ 7 నుంచి 9 వేల వరకు అమ్ముతున్నారు. నెలకు మట్టి రవాణా ద్వారా కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అడ్డుపడితే డ్రైవర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని రైతులు అంటున్నారు. మండలంలోని దేవసముద్రం చెరువు పరిస్థితి ఇది.

పుల్లంపేట, మే 16: రైతులు బతకాలంటే చెరువులు బాగా ఉండాలి. చెరువుల్లో నీరు చేరినప్పుడే ఆయకట్టు ప్రాంతంతో పాటు చెరువు నీరు పారుదల ఉన్న ప్రాంతమంతా పచ్చగా కళకళలాడుతుంది. అలాంటి చెరువులు నేడు మట్టి మాఫియా కారణంగా కళను కోల్పోయి రూపురేఖలు మారిపోతున్నాయి. చెరువుల్లో యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వేయడంతో చెరువుల్లో నీరు వచ్చినా నిలబడే పరిస్థితి కనబడటం లేదు. 10 అడుగులకు పైగా మట్టిని తవ్వేస్తూ అక్రమ రవాణా జోరుగా సాగుతుండటంతో చెరువు పరిస్థితి దారుణంగా తయారైంది. చెరువు కట్టకు 100 మీటర్ల దూరంలో తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నా అందుకు విరుద్ధంగా చెరువు కట్టకు ఆనుకునే మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే చెరువులో 80 శాతానికి పైగా మట్టిని తవ్వేశారు. మండలంలో అతి పెద్దది దేవసముద్రం చెరువు. సుమారు 280 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆయకట్టు కూడా 300 ఎకరాలకు పైగా ఉంది. అంతేకాకుండా కాలువల ద్వారా మరికొంత భూమి సాగవుతుంది. చెరువుకు ఆనుకుని 80 ఎకరాల పట్టా భూమి కూడా ఉంది. చెరువులోకి నీరు వస్తే ఈ 80 ఎకరాలు కూడా మునకకు గురవుతాయి. దేవసముద్రం, అగ్రహారం, లేబాకువారిపల్లె, బావికాడపల్లె, తిప్పాయపల్లె, తిమ్మారెడ్డిపల్లె, లక్షుంపల్లె తదితర గ్రామాల పరిధిలో ఈ చెరువు ద్వారా పంటలు పండుతాయి. చెరువులో మట్టి బాగా ఉండటంతో మట్టి మాఫియా ఈ దేవసముద్రం చెరువుపై కన్నేసింది. ఈ చెరువు రాజంపేట ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఇటుక బట్టీల తయారీదారులు ఈ మట్టిపై ఆసక్తి చూపడంతో మట్టి మాఫియా అక్రమ రవాణాకు తెరలేపింది. దేవసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కనుసన్నల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఇక్కడ టిప్పర్లను బాడుగకు తీసుకువచ్చి మట్టి రవాణాను కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం మట్టి ద్వారా కోట్లు వెనకేసుకోవడంతో ఏకంగా టిప్పర్లను కొని మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పగటి పూట చెరువులో అక్రమంగా మట్టిని తోడేస్తుండగా రాత్రివేళ దానిని ఆనుకుని ఉన్న పట్టా భూముల్లో మట్టిని తవ్వేస్తున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. టిప్పర్‌ డ్రైవర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. గతంలో అడ్డుకున్నందుకు తెలుగుదేశం నాయకుడు, అతడి అనుచరులపై కేసులు కూడా పెట్టారు. రోజుకు రెండు మూడు ఎక్స్‌కవేటర్లు పెట్టి పది నుంచి 20 టిప్పర్ల ద్వారా వంద ట్రిప్పుల మట్టిని రాజంపేట-వత్తలూరు మార్గంలో ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఈ మార్గంలో సుమారు 25కుపైగా ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. వీటికంతా ఈ చెరువులో ఉన్న మట్టినే ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్‌ 7 వేల నుంచి 9 వేల వరకు ధర పలుకుతుంది. నెలకు కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఈ మట్టి ద్వారా సంపాదిస్తున్నారు. మట్టి మాఫియా చెలరేగిపోతున్నా ఏ ఒక్క అధికారి గానీ చెరువు వద్దకు వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు. అధికారులకు ఎక్కడికక్కడ మామూళ్లు ముట్టడంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. చెరువులో మట్టి తవ్వడంతో చిన్నపాటి మైనింగ్‌లా చెరువు కనిపిస్తోంది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇటీవల కొందరు మట్టి తవ్వకాలను అడ్డుకుంటే వారిని ఎస్‌ఐ, సీఐ వద్దకు కూడా పిలిపించారని, తప్పుడు కేసులు పెడతారు.. జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పి పంపించారని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులను ప్రభుత్వ అనుమతి ద్వారా తరలిస్తామని చెప్పి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎంతమంది రైతులకు అనుమతులు ఇచ్చారో చెరువులో ఎంత మట్టి తవ్వారో పరిశీలిస్తే మట్టి మాఫియా ద్వారా ఎన్ని కోట్లు సంపాదించారో అర్థమవుతుంది. చెరువు పక్కనే భూములు ఉండటంతో చెరువులో మట్టిని తవ్వగా పట్టా భూముల్లో కూడా 50 శాతానికి పైగా మట్టిని తవ్వేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో చేసేదేమీ లేక రైతులు మిన్నకుండిపోతున్నారు. భవిష్యత్తులో చెరువు పరిస్థితి దారుణంగా మారితే 400 ఎకరాలకు పైగా భూములు బీడు భూములుగా మారే అవకాశముంది. వీటి ద్వారా వందల కుటుంబాలు రోడ్డున పడ్డట్లే. ఇకనైనా సంబంధిత అధికారులు చెరువును పరిశీలించి చెరువును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు.

ఈ విషయమై ఇరిగేషన్‌ డీఈ చెంగల్‌రాయుడును వివరణ కోరగా దేవసముద్రం చెరువులో మట్టి తవ్వకానికి పర్మిషన్‌ ఇచ్చామని తెలిపారు. అది కూడా మొన్ననే ఒకే రైతుకు ఇచ్చామన్నారు. అక్రమంగా ఎంత మంది తవ్వుతున్నారు.. ఎవరు తవ్వుతున్నారని ఎదురు పశ్నించడం కొసమెరుపు.

నా పట్టా భూమిలో మొత్తం తవ్వేశారు..

-గొంది రామచంద్రయ్యనాయుడు, లేబాకవారిపల్లె, పుల్లంపేట మండలం.

చెరువుకు ఆనుకుని నాకు 2.45 ఎకరాల భూమి ఉంది. చెరువులో నీరు ఉన్నప్పుడు పంట వెయ్యలేం. నీరు తగ్గిన తరువాత పంట వేసుకుంటాం. పంట బాగా వస్తుంది. అలాంటి భూమిలో మట్టిని అక్రమంగా ఇష్టానుసారంగా తవ్వేశారు. అడ్డుకుంటే బెదిరిస్తున్నారు. పగలు అడ్డుకుంటే గుట్టుచప్పుడు కాకుండా రాత్రుళ్లు తవ్వేస్తున్నారు. నా భూమిలో మొత్తం మట్టిని తవ్వేసి పనికిరాకుండా చేశారు.

Updated Date - 2023-05-16T23:08:43+05:30 IST