ఏకశిలా నగరి.. శిల్పకళా సిరి...

ABN , First Publish Date - 2023-03-28T23:31:19+05:30 IST

దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళను ఎలుగెత్తి చాటి చెప్పే సుప్రసిద్ధ దేవాలయాలలో ఒంటిమిట్ట కోదండరామాలయం ఒకటి. ప్రాచీన శిల్పకళకు కాణాచిగా ఆంధ్రాకు అపూర్వ ఆభరణంగా భక్తి సుగంధాలను పంచే సౌధంగా విరాజిల్లుతోంది.

ఏకశిలా నగరి.. శిల్పకళా సిరి...
ఒంటిమిట్ట కోదండరామాలయంలోని అపురూప శిల్పకళాసంపద

ఆంధ్ర భద్రాద్రి.. ఒంటిమిట్ట కోదండరాములోరి గుడి

హనుమంతుడు లేని ఆలయం

చారిత్రాత్మక నేపధ్యానికి నిలువుటద్దం

30 నుంచి వైభవంగా బ్రహ్మోత్సవాలు

రాజంపేట, మార్చి 28 : దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళను ఎలుగెత్తి చాటి చెప్పే సుప్రసిద్ధ దేవాలయాలలో ఒంటిమిట్ట కోదండరామాలయం ఒకటి. ప్రాచీన శిల్పకళకు కాణాచిగా ఆంధ్రాకు అపూర్వ ఆభరణంగా భక్తి సుగంధాలను పంచే సౌధంగా విరాజిల్లుతోంది. దేశంలో రెండో అయోధ్యగా, ఆంధ్రా భద్రాద్రిగా ప్రాచీన నిర్మాణ వైభవంతో అలరారుతోంది ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం. పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపధ్యం కలిగిన ఈ రామాలయం కడప-చెన్నై ప్రధాన రహదారిలో కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఒంటిమిట్టలో ఉంది. ఒక రాతి గుట్టపై నిర్మింపబడి మూడు గోపురాలతో 32 అద్భుత శిల్పమయ స్తంభాలతో రంగమండపం, కల్యాణమండపం ఈ ఆలయం సొంతం. రామా.. రఘురామా..! అని పిలిస్తే.. ఓ.. అంటూ పలికే భక్తసులభుడు ఒంటిమిట్ట కోదండపాణి. కులమతాలకతీతంగా యావత్‌ భారతావనికే ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇక్కడి ఏకశిలారాముడు. సీతారామలక్ష్మణులు ఒకే శిలపై వెలసి ఉన్నందున ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా వినుతికెక్కింది. దేశంలో హనుమంతుడు లేని రామాలయం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకు భిన్నంగా హనుమంతుడు లేకుండా నిర్మించిన ఏకైక ఆలయంగా ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని చెప్పుకోవచ్చు. మట్లి పాలకుల్లో ఒకరైన సదాశివరాయుల కాలం నాటి శిలాశాసనాలను బట్టి చూస్తే ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని 1350 సంవత్సరంలో ఉదయగిరిని పాలించిన కంపరాయులు నిర్మించినట్లు తెలుస్తోంది. 1356లో ఉదయగిరి సింహాసనాన్ని అధిష్టించిన కంప సోదరుడైన బుక్కరాయులు ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని ప్రారంభించారని, మట్లిరాజుల్లో ఒక్కడైన అనంతరాజు రామాలయ గుడిని విస్తరించినట్లు తెలుస్తోంది. తూర్పుగాలిగోపురం, మహామండపం, మహాప్రాకారం, రథం నిర్మించారు. అలాగే ఉత్తర, దక్షిణ గోపుర నిర్మాణాలు మొదలు పెట్టగా అనంతరాజు కుమారుడైన తిరువెంగళనాధ రాజు మనుమడు కుమార అనంతరాజు పూర్తి చేశాడు.

అపురూప శిల్పసంపద

ఒంటిమిట్ట కోదండరామాలయంలోని అపురూప శిల్పసంపద పర్యాటకులను మైమరిపిస్తుంది. రంగమండపంలోని 32 శిలా స్తంభాల్లో మూడు ముఖాలు కలిగిన అపురూప శిల్పాలు రామాయణ, భాగవతాలను, నాటి పాలకుల రసజ్ఞతలను ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడి కోదండరామాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక అద్భుత దృశ్యం గోచరమవుతుంది. ఒక ఎత్తయిన పీఠంపై ఉన్న ఆలయం.. చుట్టూ చిన్న, పెద్ద గుట్టలు కనిపిస్తాయి. ఆ గుట్టలన్నీ పుష్పరేకులు గానూ.. మధ్యలో ఉన్న దేవాలయం కర్నికగా అమరి ఉండటం ప్రత్యేకత. ఎంతో చారిత్రక, మరెంతో ప్రాధాన్యం కలిగిన ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సందర్శించడం మధురానుభూతిని కలిగిస్తుంది.

ఒంటిమిట్ట పేరు ఎలా వచ్చిందంటే...

ఒంటడు - మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రాంతంలో వేట మీద జీవనం సాగించే వారు. ఒకసారి కంపరాయలు, ఆయన పరివారం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరు శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు. అంతట ఈ కంపరాయలు ఈ అన్నదమ్ముల కోరికపై జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిలా దేవతామూర్తులకు గర్భాలయం నిర్మిస్తారు. తరువాత వీరి పేరుపై ఒంటిమిట్ట గ్రామాన్ని, చెరువును కట్టించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

ఇతిహాస చరిత్ర

పితృవాఖ్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ ఒంటిమిట్టకు వచ్చినట్లు ఇతిహాసం చెబుతోంది. ఇక్కడ మునులు తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. వీరికి రాక్షసుల బెడద ఎక్కువగా ఉండటంతో యజ్ఞయాగాదులు నిర్వహించలేకపోయారు. మహాముని కోరికపై శ్రీరామలక్ష్మణులు రాక్షస సంహారం చేసినట్లు చెబుతారు. అనంతరం మునుల యజ్ఞయాగాదులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒకే శిలలో నిర్మితమైన సీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేశారట. ఈ విగ్రహాలు మూడు విడివిడిగా కనిపించినా ఇవన్నీ ఒకే శిలపై ఆవిర్భవించి ఉన్నందున ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. ఆనాటి దండకారణ్యంలో భాగంగా శ్రీరాముడి అమ్ములపొది, పిడిబాకు, కోదండం చేతపట్టి రావడంతో కోదండరాముడు అనే నామం వచ్చింది.

రామ లక్ష్మణ బాణాలకు వెలసిన తీర్థాలు

ఆనాటి దండకారణ్యంలో భాగంగా పర్యటించిన సీతారామలక్ష్మణులు అలసి ఒక చెట్టునీడకు చేరారు. ఆ సమయంలో సీతాదేవికి దాహంగా ఉండటంతో శ్రీరాముడు బాణాన్ని భూమిలోకి సందించగా పాతాళం నుంచి గంగ పెల్లుబికింది. దీంతో వారు ముగ్గురు దాహం తీర్చుకున్నారు. అదే సమయంలో లక్ష్మణుడు కూడా భూమిలోకి బాణం సంధించగా గంగ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇవి రామలక్ష్మణ తీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి.

ఎందరో మహానుభావులు

సాహితీ ఉద్దండుడు బమ్మెర పోతనామాత్యుడు, తిప్పయ్య, అయ్యలరాజు రామభద్రుడు, తిప్పకవి, మాల ఓబన్న, ఆంధ్రా వాల్మీకి వావిలకొలను సుబ్బారావు, నల్లకాల్వ అయ్యప్ప, ఉప్పుగొండూరు వెంకటకవి, తాళ్లపాక అన్నమాచార్య, పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వంటి కవులు, భక్తులు, మహనీయులు ఎందరో రామయ్య సేవలో తరించినవారే. మహాభాగవతాన్ని తనకు అంకితమివ్వమని పోతనను శ్రీరాముడుకోరినది ఇక్కడేనని ప్రతీతి.

ఆంధ్ర భద్రాద్రిగా గుర్తింపు

తెలుగు రాష్ట్రాల విభజన తరువాత భద్రాచలం తెలంగాణాలో విలీనం కాగా ఒంటిమిట్ట కోదండరామాలయం ఆంధ్రభద్రాద్రిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయానికి ఆంధ్ర భద్రాద్రిగా గుర్తింపునిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 09-09-2015వ తేదీ ఈ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేసుకుంది. అప్పటి నుంచి కోదండరాముని కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ టీటీడీనే చూసుకుంటోంది. ఈ సందర్భంగా ఈనెల 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా విశేష పూజా కైంకర్యాలు, విశేష అలంకరణలు, డోలోత్సవాలు, వాహన సేవలు, రథోత్సవం, పుష్పయాగం, ఏకాంత సేవ జరగనున్నాయి. ప్రత్యేకించి ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి 8-10 గంటల మధ్య పండు వెన్నెల కాంతుల మధ్య కోదండరాముడి కల్యాణ వేదికపై సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వైఎ్‌స జగన్‌తో పాటు రాష్ట్ర అతిరథ మహారధులు, లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు.

Updated Date - 2023-03-28T23:31:19+05:30 IST