పనిచేయని వారిని పంపించేయండి
ABN , First Publish Date - 2023-08-22T23:18:54+05:30 IST
ప్రజా సమస్యలపై స్పందించని, ప్రజాప్రతినిధులకు పలకని, అందుబాటులో లేని, సకాలంలో పనులు పూర్తి చేయని అధికారులను పంపించేయండని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.
పీఆర్ ఏఈ, డీఈ, అగ్రికల్చర్ ఏడీ, సర్వేయర్‌పై చర్యలు
సమీక్షలో ఇన్‌చార్జ్ మంత్రి కాకాణి ఆదేశం
ఎమ్మెల్యే ఫిర్యాదుపై మంత్రి స్పందన
మదనపల్లె, ఆగస్టు 22: ప్రజా సమస్యలపై స్పందించని, ప్రజాప్రతినిధులకు పలకని, అందుబాటులో లేని, సకాలంలో పనులు పూర్తి చేయని అధికారులను పంపించేయండని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ఆయా శాఖల అధికారులతో నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఇందులో భాగంగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలతో పోలిస్తే సాయంత్రం జరిగిన మదనపల్లె నియోజకవర్గ సమీక్ష కాస్త వాడివేడిగా సాగింది. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషా వ్యవసాయ, పంచాయతీరాజ్, సర్వే విభాగం, జిల్లా ఆసుపత్రి సేవలపై మంత్రికి ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్‌శాఖలో పైసలు ఇవ్వనిదే పనులు జరగడం లేదని, ముందస్తుగా డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై పీఆర్ ఏఈ రమణ, డీఈ శివప్రసాద్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మదనపల్లె మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యంపై అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ఇదివరకే ఇక్కడ పనిచేస్తున్న సర్వేయర్‌ను మరోచోటికి బదిలీ చేస్తే..తన అనుమతి లేకుండా తిరిగి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ మహబూబ్‌చాంద్ కూడా ఇదే రీతిలో స్పందించడంతో సర్వేయర్‌ను మళ్లీ ఇక్కడే ఎందుకు నియమించారని మంత్రి సర్వే విభాగం ఏడీ జయరాజ్‌ను ప్రశ్నించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినట్లు సర్వే ఏడీ మంత్రికి సమాధానం చెప్పారు. సర్వేయర్‌ను తిరిగీ వెనక్కి పంపించేయాలని, కమిషనర్ సిద్ధార్థజైన్‌తో తాను మాట్లాడతానని మంత్రి తెలిపారు. నిమ్మనపల్లె మండలంలో ఇటీవల జరిగిన వేరుశనగ విత్తనకాయల పంపిణీ ప్రారంభానికి తాను వెళితే కేవలం ముగ్గురు రైతులు మాత్రమే వచ్చారని, రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని వ్యవసాయశాఖ ఏవో, ఏడీలపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పంచిందిన మంత్రి ఏడీ శివకుమార్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో వైద్యుల కొరత ఎక్కువగా ఉందని దీంతో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. వైద్యులు, సిబ్బంది లేరనే కారణంతో ఇక్కడికి వచ్చే పేషంట్లను తిరుపతి, బెంగళూరు ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రి స్థాయి, వైద్యులు, సిబ్బంది ఎంత ఉండాలో, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. రోజూ ఇక్కడికి వస్తున్న రోగులు, వారికి అందుతున్న సేవలు, రెఫర్ చేస్తున్న వివరాలు ఇవ్వడంతో పాటు ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డీసీహెచ్‌ఎ్‌స, డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఉదయం జరిగిన తంబళ్లపల్లె నియోజకవర్గ సమీక్షలోనూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కూడా కేసుల రెఫర్ అంశాన్ని ప్రస్తావించినట్లు మంత్రి తెలిపారు. జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నుంచి విద్యుత్తు లైన్ల పనుల వరకూ ఒకరిపై మరొకరు పొంతన లేని లెక్కలు చెప్పడంపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు ఉంటే, ఎమ్మెల్యే, కలెక్టర్‌తో సంప్రదించి పరిష్కరించుకోవాలని మంత్రి హితబోధ చేశారు. అలాగే లేఅవుట్లలో నీటి వసతి కల్పనలో గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రజారోగ్య శాఖలు విఫలమైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని, కలెక్టర్‌తో సంప్రదించి వాటిని పరిష్కరించుకోవాలని అక్కడికి కాకుంటే, ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి తెలిపారు. సమావేశంలో పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎం.నవాజ్‌బాషా, కలెక్టర్ పీఎస్ గిరీషా, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.