రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది

ABN , First Publish Date - 2023-02-21T23:05:49+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక దేవతానగర్‌లోని టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఇన్‌చార్జిలతో యువగళం పాదయాత్రపై సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పక్కన నల్లారి కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, గంటా నరహరి తదితరులు

అనపర్తి, గన్నవరం సంఘటనలే దీనికి నిదర్శనం

రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో 15 రోజుల యువగళం పాదయాత్ర

షెడ్యూల్‌ విడుదల చేసిన టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు

మదనపల్లె టౌన్‌, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక దేవతానగర్‌లోని టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఇన్‌చార్జిలతో యువగళం పాదయాత్రపై సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జీవో నెంబరు-1 తీసుకొచ్చింది లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకే అన్నారు. అనపర్తిలో చంద్రబాబు సభకు అనుమతిచ్చిన పోలీసులు ఆయననే నిందితుడిని చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఎక్కడా కూడా 1000 మందిపై కేసులు పెట్టలేదని, అది కేవలం వైసీపీ అధికారంలోకి వచ్చాక అనపర్తిలో టీడీపీ కార్యకర్తలపై పెట్టడం వారి అహంకారానికి పరాకాష్టగా నిలుస్తోందన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కారును తగలబెట్టిన నిందితులే టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో మళ్లీ స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి వచ్చేటట్లుందని చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతులను వ్యవసాయ మంత్రి పలకరించకపోగా తారకరత్న గుండెపోటుతో మరణిస్తే రాజకీయాలు మాట్లాడుతున్నారన్నారు. అక్కడ సొంత బాబాయినే గొడ్డలిపోటుతో అంతమొందించిన వారికి సిగ్గు ఉండాలన్నారు. డాక్యుమెంట్లను మాయం చేసిన కేసులో చెన్నై నుంచి సీబీఐ అధికారులు నెల్లూరు వచ్చి కార్యాలయం తెరిచారంటే మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సీఎం బాబాయి కూతురు సీబీఐని ఆశ్రయిస్తే వైఎస్‌ ఇంటి పేరున్న భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయం గేట్ల వద్ద కూర్చున్నారన్నారు. ప్రజలే వైసీపీపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి ఓట్లు వేయని వారిని నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా ప్రకటించడం వైసీపీకే చెల్లిందన్నారు.

లోకేశ్‌ యువగళం షెడ్యూల్‌ విడుదల

రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రను టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్ది చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, ఆర్‌.శ్రీనివాసరెడ్డి పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జి గంటా నరహరి విడుదల చేశారు. మార్చి 2వ తేదీ రాత్రి పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలోని కొమ్మిరెడ్డిగారిపల్లె వద్ద రాత్రి బసకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి మొదలయ్యే పాదయాత్ర పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మార్చి 17వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మార్చి 12, 13 తేదీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నందున పాదయాత్రకు విరామం ప్రకటిస్తారన్నారు. 18వ తేదీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేశ్‌ 45 రోజులు పాదయాత్ర చేశారని, మధ్యలో 5 రోజులు కొన్ని కారణాల వలన విరామం ఇచ్చారన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఎన్ని అడ్డంకులు పెట్టినా పాదయాత్ర సాహసయాత్రలా విజయవంతంగా సాగుతోందని తెలిపారు. సమావేశంలో మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి టీడీపీ ఇన్‌చార్జిలు దొమ్మలపాటి రమేశ్‌, శంకర్‌యాదవ్‌, రమేశ్‌రెడ్డి, టీడీపీ నేతలు జయరామనాయుడు, సూర్యప్రకాష్‌, ఎస్‌ఏ మస్తాన్‌, దొరస్వామినాయుడు, సురేంద్రయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:05:50+05:30 IST