కృష్ణమ్మ ప్రవాహానికి బ్రేక్‌!

ABN , First Publish Date - 2023-01-29T23:16:49+05:30 IST

హంద్రీ-నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల వాటా లేనట్ల్లేనని తేలిపోయింది. ఏటా అక్టోబరు లేదా నవంబరులో మొదలై జనవరి వరకూ ప్రవహించే కృష్ణమ్మ ఈ ఏడాది ముఖం చాటేసింది. అమాత్యుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్షం వెరసి ఆరో విడత నీటిని జిల్లా రైతులు కోల్పోవాల్సి వచ్చింది.

కృష్ణమ్మ ప్రవాహానికి బ్రేక్‌!
పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లె వద్ద అసంపూర్తిగా ఆగిన హంద్రీ-నీవా కాలువ మరమ్మతు పనులు

ఈసారి మన వాటా నీరు రానట్లే..!

గండ్లు పూడ్చక..పనులు పూర్తి కాక

అయిదు విడతల్లోనూ అరకొరే..

మదనపల్లె, జనవరి 29: హంద్రీ-నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల వాటా లేనట్ల్లేనని తేలిపోయింది. ఏటా అక్టోబరు లేదా నవంబరులో మొదలై జనవరి వరకూ ప్రవహించే కృష్ణమ్మ ఈ ఏడాది ముఖం చాటేసింది. అమాత్యుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్షం వెరసి ఆరో విడత నీటిని జిల్లా రైతులు కోల్పోవాల్సి వచ్చింది. హంద్రీ-నీవా రెండో విడత పనులు పూర్తయిన 2019 నుంచి ఇప్పటి వరకూ కృష్ణాజలాలు నాలుగుసార్లు ప్రవహించగా, అయిదోసారి ప్రవాహం ప్రారంభమైన కొన్ని రోజులకే వరదలు ముంచెత్తాయి. దీంతో కాలువలు కొట్టుకుపోవడం, ఎక్కడిక్కడ గండ్లు పడటంతో చుక్కనీరు ముందుకు రాలేదు. అయితే ఆరోసారి వాటా నీరు 2022 అక్టోబరు-నవంబరు నెలలో ప్రారంభమై 2023 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆరో వాటాలో చుక్కనీరు జిల్లాకు చేరలేదు. అసలు వరదలకు కొట్టుకుపోయిన హంద్రీ-నీవా కాలువలకు మరమ్మతులు చేపట్టలేదు. తెగిన గండ్లను ఇప్పటికీ పూర్తి స్థాయిలో పూడ్చనూ లేదు. ఫలితంగా ఎప్పటిలాగానే మన వాటా నీటిని ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు వాడుకుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి కృష్ణమ్మను రప్పించడం నుంచి స్థానికంగా వినియోగించుకోవడం వరకూ అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులకు ఉన్న శ్రద్ధ, చొరవ మన వారికి లేదనే చెప్పాలి. తెగిన కాలువలకు మరమ్మతులు, గండ్లను సకాలంలో పూడ్చకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పుష్కలంగా వర్షాలు కురిశాయని, చెరువులు నిండాయని, వీటన్నింటికీ మించి ఇక నీరే అవసరం లేదన్న రీతిలో ఉంచిపోయారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువతో పాటు పుంగనూరు బ్రాంచి కెనాల్‌ను విస్తరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది. కానీ వరద గాయాలను గాలి కొదిలేయడంతో కృష్ణమ్మ పరవళ్లకు బ్రేక్‌ పడింది.

మదనపల్లె సర్కిల్‌-3 పరిధిలోని అనంతపురం జిల్లాలోని సగం ఏరియా, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ఏరియాలలో 90 పాయింట్లలో కాలువలు తెగిపోవడం, గండ్లు పడినట్లు హంద్రీ-నీవా అధికారులు గుర్తించారు. వీటి పునరుద్ధరణ కోసం రూ.1.23 కోట్లతో రెండు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. ఈ పనులను ఇద్దరు కాంట్రాక్టర్లు వేర్వేరుగా దక్కించుకున్నారు. అయితే సకాలంలో పనులు పూర్తి చేయలేదు. అధికారులు దగ్గరుండో లేక కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించనూ లేదు. ఈ క్రమంలో వారు కూడా వర్షాల పేరుతో ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండడం కూడా పనులు జరగకపోవడానికి కారణంగా చెబుతున్నారు. అప్పటికే నీటిని తీసుకునే గడువూ దాటిపోవడమే కాదు.. ప్రవాహం ముగిసే సమయం కూడా ఆసన్నమై మన వాటా నీటిని కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం మరమ్మతులు పూర్తయి, ఇప్పటికీ గలగలా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అయిదుసార్లు కృష్ణా జలాలు వచ్చినా అనంతపురం రైతుల అడ్డంకులు, కాలువలు తెగిపోవడం, నీటి సరఫరాలో నష్టాలు వెరసి ఏటా 1.60 టీఎంసీలకు మించీ తీసుకోలేదు. కృష్ణా జల్లాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పది టీఎంసీల కేటాయింపు ఉంది. కానీ ప్రవాహం సాగిన మూడు నెలల్లో ఇంతవరకూ అందులో పాతికభాగం కూడా తీసుకోలేదు.

పెద్దతిప్పసముద్రం, కురబలకోట, మదనపల్లె, పుంగనూరు మండలాల్లో చెరువులు, కుంటల వరద నీటితో ప్రవాహ మార్గాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ సందర్భంగా కాలువల్లో నీరు వ్యతిరేక దిశలో పయనించడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నీటి ప్రవాహం దిశ మారడంతో కాలువ మొత్తం మట్టి, ఇసుకతో నిండిపోయింది. కాలువ మరమ్మతులతో పాటు పూడికతీత పనులు చేసి మార్గాన్ని మరోసారి పునరుద్ధరిస్తే తప్ప కృష్ణమ్మ ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇదే తరహాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ కాలువలు తెగిపోయాయు. అక్కడ సకాలంలో పనులు పూర్తి కావడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా, ఇక్కడ మాత్రం అందుకు వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై రైతులు అధికారులపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే చెరువులు, కుంటల్లో జలకళ తప్పుతోంది. నీటి సామర్థ్యం రోజురోజుకూ తగ్గుతోంది. వేసవి రాకనే ఇలా ఉంటే, ఏప్రిల్‌, మే నెలలో వీటి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి వర్షాలు పడ్డాయని, చెరువులు నిండాయని, రైతులు అడగలేదనే కారణాలతో అసలు విషయాన్ని పక్కన పెడితే, హంద్రీ-నీవా ఉద్దేశమే పక్కదారి పట్టే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ నిపుణులు వాపోతున్నారు. ఇలా అయితే కుప్పం వరకూ కృష్ణా జలాలు తీసుకెళ్లడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అవసరం లేదని వదిలేస్తే కాలువలు రూపు కోల్పోయే అవకాశం లేకపోలేదు. మరోవైపు కర్నూలు నుంచి ప్రధాన కాలువ, అనంతపురం జిల్లా నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌ వెడల్పునకు ప్రభుత్వం టెండర్ల ప్రకియ్ర పూర్తి చేసింది. వాటితో పాటే ఈ పనులు కూడా చేద్దామని అనుకున్నా అవి పూర్తి కావడం అంశాన్ని పక్కన పెడితే, ప్రారంభం కావడానికే ఏళ్లు పట్టే అవకాశం ఉంది. మరోవైపు మధ్యేమార్గంగా గాలేరు-నగరిని గండికోట ద్వారా హంద్రీ-నీవాకు అనుసంధాన పనులు చేపడుతున్నా..ఆ పైపులైన్‌ పనులు కూడా కనుచూపు మేరలో కనిపించలేదు. ఇలా భవిష్యత్తులో పూర్తవుతాయనే పనులపై ఎదురు చూస్తే, హంద్రీ-నీవా ఫేజ్‌-2లో పూర్తయిన కాలువల్లో ప్రవాహం లేక రూపుకోల్పోయే అవకాశమే కాదు..పడమటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామనే పాలకుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండునెలల్లో పనులు పూర్తి చేస్తాం

- సి.ఆర్‌.రాజగోపాల్‌, హంద్రీ-నీవా ఎస్‌ఈ, మదనపల్లె

కాలువల మరమ్మతులకు వర్షాలు అడ్డంకిగా మారాయి. దీంతో సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయాం. వీటిని రెండు నెలల్లో పూర్తి చేసి చెర్లోపల్లె రిజర్వాయరులో నిల్వ చేసిన 1.20 టీఎంసీల నీటిని ముందుకు నడిపిస్తాం. కుప్పం బ్రాంచి కెనాల్‌ పనులు కూడా జరుగుతున్నాయి. అవకాశాన్ని బట్టి ఆ నీటిని కుప్పం వరకూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. పుంగనూరు బ్రాంచి కెనాల్‌ విస్తరణ పనులకు, కాలువల మరమ్మతులకు సంబంధమే లేదు. ఒకవేళ విస్తరణ పనులు మొదలైనా.. మన వాటా నీటిని యథావిధిగా ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటాం.

Updated Date - 2023-01-29T23:16:50+05:30 IST