Bhaskara Reddy: నేడు భాస్కరరెడ్డి విచారణ

ABN , First Publish Date - 2023-03-12T03:40:19+05:30 IST

సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

 Bhaskara Reddy: నేడు భాస్కరరెడ్డి విచారణ

వివేకా హత్య కేసులో కడప జైల్లోనే విచారించనున్న సీబీఐ

కడప, మార్చి 11(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కడప సెంట్రల్‌ జైలులోని అతిఽథి గృహంలో వివేకా హత్య గురించి సీబీఐ బృందం భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించనుంది. వివేకా హత్య జరగడానికి ముందురోజు అంటే 2019 మార్చి 14వ తేదీ సాయంత్రం అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఈ కేసులో ఏ-2గా ఉన్న సునీల్‌ యాదవ్‌ ఉన్నట్లు సీబీఐ గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా ఆధారాలు సేకరించింది. హత్య కేసులో సాక్ష్యాధారాల చెరిపివేత, రూ.40 కోట్ల డీల్‌లో భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ వాదిస్తోంది. ఇప్పటికే అవినాశ్‌రెడ్డిని మూడుసార్లు సీబీఐ అధికారులు విచారించారు. మరోవైపు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను అరెస్టు చేయడం తథ్యమంటూ సీబీఐ బృందం శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆదివారం సీబీఐ బృందం భాస్కర్‌రెడ్డిని కడపలో విచారించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భాస్కర్‌రెడ్డిని ఫిబ్రవరి 23న విచారణకు రావాలంటూ అదేనెల 18న సీబీఐ బృందం పులివెందులకు వెళ్లి ఆయనకు నోటీసులు అందించింది. అయితే ఆ రోజు వ్యక్తిగత పనులున్నాయని, మరో రోజుకు వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2023-03-12T03:40:19+05:30 IST