పునరావాస పథకంగా సలహాదారుల నియామకం
ABN , First Publish Date - 2023-05-26T23:36:05+05:30 IST
సలహాదారుల నియామకం రాజకీయ పునరావాస పథకంగా, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఉపాధి హామీ పథకంగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన తులసిరెడ్డి అన్నారు.

తులసిరెడ్డి ఎద్దేవా
వేంపల్లె, మే 26: సలహాదారుల నియామకం రాజకీయ పునరావాస పథకంగా, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఉపాధి హామీ పథకంగా మారిందని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ మరొకవైపు అనేకమంది సలహాదారులను నియమిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. మైనారిటీ సంక్షేమశాఖకు ఇప్పటికే ఇద్దరు సలహాదారులుండగా ఈ నెలలోనే మరో ఇద్దరిని నియమించడం గర్హనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కడుదయనీయంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సలహాదారుని మీద నెలకు రూ.5లక్షలు ఖర్చుచేయడం సమంజసమా అని ప్రశ్నించారు. సలహాదారుల నియామకం సమంజసం కాదని కోర్టులు వ్యాఖ్యానించినా పట్టించుకోవడం లేదన్నారు.
కాగా.. జగనరెడ్డి భజనరెడ్డిగా, చంద్రబాబు చెక్కభజన బాబుగా మారారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రథమ పౌరురాలైన భారత రాష్ట్రపతి, గిరిజన మహిళ శ్రీమతి ద్రౌపది ముర్మును అవమానపరుస్తూ, ఆంధ్రప్రదేశకు అడుగడుగునా అన్యాయం చేస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు మోదీ ప్రాపకం కోసం పాకులాడడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, చెన్నకేశవ, వేంపల్లె మండల శాఖ అద్యక్షుడు నరసింహారెడ్డి, ఉత్తన్న, బద్రి, రాఘవయ్య, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.