ప్రజలపై మరో భారం

ABN , First Publish Date - 2023-03-30T23:19:13+05:30 IST

మున్సిపాలిటీలో ఉన్న ప్రజలపై ప్రభుత్వం మరో భారం వేయనుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మునిసిపాలిటీలలో ఉన్న ప్రజలకు ఆస్తిపన్ను పెరగనుంది.

ప్రజలపై మరో భారం
రాయచోటి పట్టణం

ఏప్రిల్‌ నుంచి పెరగనున్న ఆస్తిపన్ను

విలువ ఆఽధారంగా పన్ను వేయడంపై అభ్యంతరాలు

నేటితో ముగియనున్న బకాయిలపై వడ్డీ మాఫీ

(రాయచోటి- ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలో ఉన్న ప్రజలపై ప్రభుత్వం మరో భారం వేయనుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మునిసిపాలిటీలలో ఉన్న ప్రజలకు ఆస్తిపన్ను పెరగనుంది. ప్రస్తుతం ఉన్న పన్ను కంటే 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే అంతస్థాయిలో పెరగదని, ఆస్తి విలువను బట్టి పెరిగే అవకాశాలు ఉన్నట్లు మునిసిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఆస్తి విలువను బట్టి పన్ను వేయడం ప్రజలను దోచుకోవడమేనని ప్రజలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపధ్యంలో బకాయిలపై వడ్డీమాఫీ అవకాశం శుక్రవారంతో ముగియనుంది.

మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రజలకు సౌకర్యాలు అందించగలుగుతారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, నీటిసరఫరా, స్థానిక రహదారుల నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర సేవలను అందించడానికి ప్రజల నుంచి వసూలయ్యే ఆస్తిపన్ను ముఖ్యంగా ఉపయోగపడుతుంది. లక్షకు పైగా జనాభా ఉన్న రాయచోటి మునిసిపాలిటీలో 26,696 ఇళ్లు ఉన్నాయి. మున్సిపాలిటీ నివేదికల ప్రకారం ప్రతి ఏటా రాయచోటికి ఆస్తిపన్ను ద్వారా రూ.4,90,22,608 వసూలు కావాలి. ఈ మొత్తానికి జరిమానాగా రూ.24,90,069 వసూలు కావాలి. ఈ మొత్తం కలిపి రూ.5,15,12,677 ప్రతి ఏటా మునిసిపాలిటీకీ ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం రాయచోటి మునిసిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిలు కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్తిపన్ను బకాయి రూ. 4,25,35,806 ఉండగా ఈ బకాయిలకు జరిమానా అంతకు ఎక్కువగానే ఉంది. బకాయిలకు జరిమానా రూ.4,46,66,034 ఉంది. ఈ లెక్కన ప్రస్తుత ఆస్తిపన్ను, అందుకు జరిమానా, బకాయిలు, బకాయిలపై జరిమానా కలిపి రూ.13,87,14,517గా ఉంది. పన్ను వసూలు చేయడం మున్సిపాలిటీకి తలకు మించిన భారంగా మారింది. దీంతో పట్టణంలో ప్రజలకు అందించే సౌకర్యాలపైన దీని ప్రభావం పడుతోంది. ఇప్పటికే రాయచోటి మునిసిపాలిటీలో పలు వార్డులలో పారిశుధ్యం చాలా అధ్వానంగా ఉంది. సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. రోజూ నీటి సరఫరా జరగడం లేదు. ఇంకా అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.

ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రత్యేక వడ్డింపు

ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలలో ఆస్తిపన్నుపై ప్రభుత్వం ప్రత్యేక వడ్డింపు విధించబోతున్నట్లు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆస్తి విలువ ఆధారితంగా పన్ను వేయనున్నట్లు ఆరోపిస్తున్నాయి. వేయబోయే పన్ను 15 శాతం వరకు ఉండవచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. వెంటనే ప్రభుత్వం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

బకాయిలపై వడ్డీ మాఫీ

ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపధ్యంలో ఆస్తిపన్ను బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తిపన్ను బకాయి పూర్తిగా చెల్లించేస్తే వడ్డీని పూర్తిగా మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయచోటి మునిసిపల్‌ కమిషనర్‌ తన సిబ్బందితో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ అకాశానాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-03-30T23:19:13+05:30 IST