అంగరంగ వైభవంగా.. కోదండరాముని రథోత్సవం
ABN , First Publish Date - 2023-04-07T00:04:05+05:30 IST
ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటిమిట్ట పురవీధుల్లో సీతారామలక్ష్మణులు విహరించారు.
ఒంటిమిట్ట పురవీధుల్లో ఊరేగిన సీతారామలక్ష్మణులు
రథాన్ని లాగేందుకు పోటీపడ్డ భక్తజనం
రాజంపేట, ఏప్రిల్ 6: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటిమిట్ట పురవీధుల్లో సీతారామలక్ష్మణులు విహరించారు. ఈ రథోత్సవ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రఽథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. శ్రీరామ.. జయజయరామా... జానకిరామా... అంటూ శ్రీరామున్ని స్మరిస్తూ రథాన్ని ముందుకు తీసుకెళ్లారు. మహిళలు, యువకులు, వృద్ధులు, ఒంటిమిట్ట ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై రథోత్సవాన్ని తిలకించారు. పురవీధుల్లో ఈ కార్యక్రమం జరగడంతో ఒంటిమిట్ట ప్రజలు పులకించిపోయారు. చెక్కభజనలు, భజంత్రీలు మోగిస్తూ కళాకారులు నృత్యాలు చేశారు.
రథోత్సవానికి సంప్రదాయ పూజలు
కోదండరాముని రథోత్సవ కార్యక్రమానికి సంప్రదాయ రీతిలో టీటీడీ అధికారులు వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక తహశీల్దారు శ్రీనివాసులరెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రథ చక్రాన్ని పర్యవేక్షించే ఆచారికి బియ్యం, భత్యం, వస్త్రా లను సమర్పించి సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వ హించిన అనంతరం రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు.
రథోత్సవ ఇతిహాసం
ఆత్మరజికుడి శరీరమే రథం, బుద్ధిసారధి మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రఽథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవం జరపడంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. అందుకే రథోత్సవాన్ని బ్రహ్మోత్సవాల్లో కల్యాణం తరువాత అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. సీతారామలక్ష్మణ రఽథాన్ని లాగి దర్శించుకుంటే భక్తిమార్గం అన్ని విధాలా శుభం కలుగుతుందని ప్రతీతి.