పాల శీతలీకరణ కేంద్రంలో ప్రమాదం
ABN , First Publish Date - 2023-05-25T22:45:03+05:30 IST
రాయచోటి పట్టణ పరిధిలోని వరిగపాపిరెడ్డిగారిపల్లె రోడ్డులో గల విజయ పాల శీతలీకరణ కేంద్రంలో పాలు నిల్వ ఉంచే ట్యాంకర్‌లో మరమ్మతులు చేస్తున్న టెక్నీషియన్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో టెక్నీషియన్ మృతి
రాయచోటి టౌన్, మే 25: రాయచోటి పట్టణ పరిధిలోని వరిగపాపిరెడ్డిగారిపల్లె రోడ్డులో గల విజయ పాల శీతలీకరణ కేంద్రంలో పాలు నిల్వ ఉంచే ట్యాంకర్‌లో మరమ్మతులు చేస్తున్న టెక్నీషియన్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రాయచోటి పట్టణ పరిధిలోని వరిగ రోడ్డులో ఇటీవల విజయపాల డెయిరీని ప్రారంభించారు. పాలు నిల్వ ఉంచే శీతలీకరణ ట్యాంకరు కూలింగ్ సరిగ్గా రాలేదని డెయిరీ నిర్వాహకులు విజయ కంపెనీ వారికి ఫిర్యాదు చేశారు. హర్యానా రాష్ట్రం మెహందీపూర్‌కు చెందిన జోగేంద్రసింగ్ (32) అనే టెక్నీషియన్ రెండు రోజుల నుంచి మరమ్మతు పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మరమ్మతు పనులు చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ట్యాంకర్ పేలి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో నాగరాజు అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు. ట్యాంకర్‌లో గ్యాస్ ఒత్తిడి ఎక్కువ కావడంతో ట్యాంకర్ పేలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి వెంకట్రామిరెడ్డితో పాటు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్‌లోని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు ఎస్‌ఐలు నరసింహారెడ్డి, ఇనాయతుల్లాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.