పల్లెటూరు నుంచి అందాల సుందరి
ABN , First Publish Date - 2023-02-21T23:04:04+05:30 IST
ఆసక్తి ఉన్న రంగంలో రాణించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అని నిరూపించింది పల్లెటూరి అందాల సుందరి ముక్కా గోమతిరెడ్డి. అందాల పోటీల్లో మిస్ ఆంధ్రాగా గెలిచి జాతీయ స్థాయిలో జరిగే అందాల పోటీకి సిద్ధం అవుతోంది.
ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ముక్కా గోమతిరెడ్డి ఎంపిక
ఓబులవారిపల్లె, ఫిబ్రవరి 21 : ఆసక్తి ఉన్న రంగంలో రాణించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అని నిరూపించింది పల్లెటూరి అందాల సుందరి ముక్కా గోమతిరెడ్డి. అందాల పోటీల్లో మిస్ ఆంధ్రాగా గెలిచి జాతీయ స్థాయిలో జరిగే అందాల పోటీకి సిద్ధం అవుతోంది. ముంబాయిలో మార్చి 5వ తేదీ జరిగే ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా శ్రీనివాసులరెడ్డి, అరుణ కుమారిల కుమార్తె ముక్కా గోమతిరెడ్డి పాల్గొననుంది. ఆమె వృత్తిరీత్యా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె తండ్రి కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నారు. ముక్కావారిపల్లె గ్రామంలో నివాస గృహం, వ్యవసాయ భూములున్నాయి. కుటుంబ, బంధువర్గంతో అనుబంధం ఉండటం వల్ల స్వగ్రామంలోను అటు బెంగుళూరులోనూ నివాసాలు ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం వారు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే ఒక్కగానొక్క కుమార్తె గోమతిరెడ్డి అభిరుచిని చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. చిన్ననాటి నుంచి పాఠశాలల్లో నిర్వహించే పోటీలలో మొదటి బహుమతులు పొందేది. డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అందాల పోటీలలో కూడా బహుమతులు సొంతం చేసుకుంది. ఇలా తన అందంతో మిస్ ఆంధ్రగా నిలిచింది. బెంగళూరులో ఉండటం వల్ల మోడలింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది. బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియా మిస్ ఫెమినా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. జనవరిలో ముంబాయిలో జరిగిన ఫెమినా మిస్ ఆంధ్ర పోటీలలో పాల్గొని టైటిల్ చేజిక్కించుకుని ముంబాయిలో మార్చి 5వ తేదీ జరిగే ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తూ ఆందాల పోటీలలో పాల్గొంటున్న గోమతిరెడ్డి ప్రపంచ సుందరిగా నెగ్గడమే తన లక్ష్యమని చెబుతున్నట్టు తండ్రి ముక్కా శ్రీనివాసులరెడ్డి వివరించారు. ముక్కా గోమతిరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు.