Pushpavalli Jakkam: వంగవీటి కుటుంబానికి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా..?

ABN , First Publish Date - 2023-08-16T17:28:59+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి వార్త ట్రెండ్ అవుతోంది. అటు మీడియా, ఇటు సోషల్ మీడియా వంగవీటి రాధాకృష్ణ పెళ్లిపై కోడై కూస్తున్న పరిస్థితి. ఆగస్ట్ 19వ తేదీన వంగవీటి రాధా నిశ్చితార్థం జరగనుందని, సెప్టెంబర్ 6వ తేదీన పెళ్లి అని.. ఆయన నర్సాపురానికి చెందిన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నారని మీడియాలో వార్తలు ప్రసారం కావడం గమనార్హం.

Pushpavalli Jakkam: వంగవీటి కుటుంబానికి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పెళ్లి వార్త ట్రెండ్ అవుతోంది. అటు మీడియా, ఇటు సోషల్ మీడియా వంగవీటి రాధాకృష్ణ పెళ్లిపై కోడై కూస్తున్న పరిస్థితి. ఆగస్ట్ 19వ తేదీన వంగవీటి రాధా నిశ్చితార్థం జరగనుందని, సెప్టెంబర్ 6వ తేదీన పెళ్లి అని.. ఆయన నర్సాపురానికి చెందిన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నారని మీడియాలో వార్తలు ప్రసారం కావడం గమనార్హం. అయితే.. ఆ అమ్మాయి ఎవరనే విషయంపై ఆరా తీయగా ఎట్టకేలకు అసలు విషయం తెలిసింది.

రాధా వివాహం చేసుకోనున్న ఆ యువతి పేరు జక్కం పుష్పవల్లి. నర్సాపురానికి చెందిన ఈ యువతి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగింది. నర్సాపురం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కం అమ్మాని కుమార్తెనే ఈ పుష్పవల్లి. ఈమె తండ్రి బాబ్జీ ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా.. కృష్ణా జిల్లాకు చెందిన వంగవీటి రాధాకృష్ణ నరసాపురానికి అల్లుడు కాబోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వంగవీటి రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశిస్తున్నారు.


2019 ఎన్నికల్లోనే విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధా భావించారు. కానీ ఆ సీటును రాధాకు కేటాయించడం ససేమిరా కుదరదని అప్పట్లో ఆ పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఆ తర్వాత కూడా వైసీపీ అధిష్ఠానం ధోరణి.. ‘ఉంటే ఉండు లేదంటే పో’ అన్నట్టు సాగింది. 2014 ఎన్నికల వరకు వైసీపీ సెంట్రల్‌ ఇన్‌చార్జ్‌గా గౌతంరెడ్డి ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన సెంట్రల్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి, ఓటమి పాలయ్యారు. 2015లో నగర అధ్యక్షుడిగా ఉన్న రాధాను సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. 2014లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రాధాను సెంట్రల్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించడంతో 2019లో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు సీటు దక్కలేదు. కాంగ్రెస్‌లో ఉన్న మల్లాది విష్ణు ఆ ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీలో చేరడంతో క్రమంగా సీను మారుతూ వచ్చింది. తొలుత విష్ణును నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.

నగర స్థాయిలో పదవి ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువగా సెంట్రల్‌ నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. తనతోపాటు కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేతలకు రాష్ట్ర, నగర స్థాయిలో పదవులను ఇప్పించుకోవడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీలో డివిజన్‌ అధ్యక్షులుగా పని చేసిన వారికి సెంట్రల్‌ నియోజకవర్గంలోని 20 డివిజన్లలో కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తాను సమన్వకర్తగా ఉన్న సెంట్రల్‌లో తన ప్రమేయం లేకుండా కో-ఆర్డినేటర్లను నియమించడంపై రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు పీకే టీమ్‌ సర్వే జరిపి, సెంట్రల్‌ నియోజకవర్గం మల్లాదికే అనుకూలంగా ఉన్నట్టు తేల్చడంతో అధిష్ఠానం పూర్తిగా మల్లాది వైపు మొగ్గుచూపింది. రాధా క్రమంగా వైసీపీకి దూరం అవుతూ, చివరికి ఆ పార్టీని వీడారు. వంగవీటి రాధా ఇంతలా సెంట్రల్ నుంచే పోటీ చేయాలని భావించడం వెనుక కారణాలు లేకపోలేదు. విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి రంగాపై ఆ నియోజకవర్గ ప్రజలు ఎనలేని అభిమానం చూపిస్తుంటారు. తన తండ్రిని అభిమానించే ప్రజలు ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా కలిసొచ్చి గెలుపును కైవసం చేస్తుందనే గట్టి నమ్మకంతోనే వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-08-16T18:08:58+05:30 IST