Mekapati Chandrasekhar Reddy: టిక్కెట్ ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా: ఎమ్మెల్యే మేకపాటి

ABN , First Publish Date - 2023-03-24T17:07:53+05:30 IST

ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. జిల్లాలో పలు సందర్భాల్లో పలువురు నాయకులు

Mekapati Chandrasekhar Reddy: టిక్కెట్ ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా: ఎమ్మెల్యే మేకపాటి

నెల్లూరు: ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. జిల్లాలో పలు సందర్భాల్లో పలువురు నాయకులు పార్టీల అగ్రనాయకుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు అదే తరహా తిరుగుబాటు జిల్లాలో కనిపించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌, టీడీపీ (Congress TDP)లు నెల్లూరు నేతల తిరుగుబాట్ల ప్రభావాన్ని చవిచూడగా తాజాగా అధికార వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల వ్యతిరేకతను ఎలా ఎదుర్కొవాలో తెలియక అల్లాడిపోతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు పొగపెట్టడంతో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆనం కుటుంబానికి చెందిన రామనారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌మోహన్‌రెడ్డిపై ధిక్కార స్వరం వినిపించారు. ఆ వెనువెంటనే తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారనే ఆవేదనతో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) వైసీపీ నుంచి నిష్కమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

నా దారి నేను చూసుకుంటా

ఇప్పుడు ఈ నేతలను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌డ్డి (Mekapati Chandrasekhar Reddy) అనుసరిస్తున్నారు. వైసీపీ హైకమాండ్‌పై ఎమ్మెల్యే మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గం (Udayagiri Assembly constituency)పై వైసీపీ డబుల్‌ గేమ్‌ ఆడుతుందని ధ్వజమెత్తారు. హైకమాండ్‌ ఆధ్వర్యంలో ఉదయగిరిలో విభజన రాజకీయాలు చేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధిపై పలికే నాధుడే లేడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందని, మార్చుకోకపోతే భవిష్యత్‌లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ‘టిక్కెట్ ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటా’ అని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. వైసీపీలో నాలుగు వర్గాలుగా విభజించి.. అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిష్టానంలో పలికే నాధుడే లేడని, సచివాలయంలో ఏ అధికారిని కదిలించినా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని అన్నారు. బటన్ నొక్కితే సీఎం జగన్‌ (CM Jagan)కే పేరని.. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని చంద్రశేఖర్‌డ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉందని... తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పార్టీ తీవ్ర సమస్యల్లో పడుతుందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం

నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం ప్రారంభమైంది. పది అసెంబ్లీ స్థానాలుంటే అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డితో మొదలైన తిరుగుబాబు జిల్లా అంతా విస్తరించే అవకాశం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రత్యక్షంగా యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వంతు వచ్చింది. ఆనం రాంనారాయణరెడ్డి(Anam Ramnarayana Reddy)ని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నేదురమల్లి రాంకుమార్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇప్పుడు కోటంరెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించారు. ఈ ఇద్దరికి చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం తీవ్రంగా శ్రమించింది. ఆ ప్రయత్నాలు ఫలించడం లేదనే విమర్శలు కూడా వచ్చాయి. కొద్ది రోజులుగా మౌనంగా వైసీపీపై నిరసన గళం వినిపిస్తున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పుడు తీవ్రస్థాయిలో స్వంత పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో (Nellore District) క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీకి (YSRCP) ఇప్పుడు గడ్డుకాలం మొదలైందని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) పెనుమార్పులు జరుగే అవకాశం ఉందని అంటున్నారు. ఆనం, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి? రేపు ఇంకెవరో అని వైసీపీలో టెన్షన్ వాతావరణ నెలకొంది.

Updated Date - 2023-03-24T17:38:36+05:30 IST