మీ సంతోషం, భవిష్యత్తు నా బాధ్యత

ABN , First Publish Date - 2023-08-22T02:41:57+05:30 IST

దసరా పండుగ నాడు ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

మీ సంతోషం, భవిష్యత్తు నా బాధ్యత

దసరాకు ఒక డీఏ.. సీపీఎస్‌కు జీపీఎస్‌తో మంచి సొల్యూషన్‌

నేడో రేపో ఆర్డినెన్స్‌.. ఉద్యోగులకు మంచి చేసే సర్కారిది

ఆర్థిక ఇబ్బందుల్లో మీరనుకున్న స్థాయిలో చేయలేకపోయా!

కానీ మనసు నిండా ప్రేమ ఎక్కువగా ఉంది: సీఎం జగన్‌

మీ సంతోషం, భవిష్యత్తు నా బాధ్యత

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): దసరా పండుగ నాడు ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ 21వ రాష్ట్ర మహాసభ.లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉద్యోగులు.. ప్రభుత్వానికీ ప్రజలకూ వారధులని, కనుక, ఉద్యోగుల సంతోషం, భవిష్యత్తు తన బాధ్యతని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు 2,06,638 లక్షల శాశ్వత ఉద్యోగాలతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సృష్టించామని చెప్పారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన ఆర్టీసీ, కంపాషనేట్‌ అపాయింట్‌మెంట్స్‌ విషయంలోగానీ, 10 వేలకుపైగా కాంట్రాక్ట్‌ ఎంప్లాయి్‌సను రెగ్యులరైజ్‌ చేసే విషయంలోగానివ్వండి, ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉన్న 14,658 మందిని సొసైటీ పరిధి నుంచి ప్రభుత్వంలోకి తీసుకొనే విషయంలో గాని, జిల్లా కేంద్రాలన్నింటిలోనూ 16 శాతం హెచ్‌ఆర్‌ మంజూరుతోపాటు, ఆర్టీసీలో 55 వేల మంది కార్మికులను రెగ్యులైజ్‌ చేయడం.. ఇలా అనేక అంశాల్లో మన ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయలేదని అన్నారు.

జీపీఎ్‌సను కాపీకొట్టి దేశమంతా అమలు చేసే రోజొస్తుంది!

అనేక సంవత్సరాలుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసిన సీపీఎస్‌ సమస్య పరిష్కారానికి జీపీఎస్‌ గ్యారెంటీ పెన్షన్‌ స్కీం తీసుకొచ్చాం. ఉద్యోగుల జీవితంలో రిటైర్‌మెంట్‌ అయిన తర్వాత కూడా చిరునవ్వుతో బతికేలా చట్టాన్నే ఆర్డినెన్స్‌కు పంపించాం. నేడోరేపో ఈ ఆర్డినెన్స్‌ రాబోతోంది. ఈ పెన్షన్‌ స్కీంను కాపీకొట్టి రాబోయే రోజుల్లో మొత్తం దేశంలోనే ఇంప్లిమెంట్‌ చేసే పరిస్థితి రాబోతోందని చెబుతున్నా’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ ఉద్యోగుల్లో మెజార్టీశాతం అవినీతి పరులని, తొలగించాలని చంద్రబాబు ‘మనసుమాట’ పుస్తకంలో రాశారు. ఇలాంటి వ్యక్తి కాబట్టే 2014-19 మధ్య శాశ్వత ఉద్యోగుల నియామకాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. ఐదేళ్లలో కేవలం 34 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే గతప్రభుత్వం నియమించింది’ అన్నారు.

మనసు నిండా ప్రేమ ఉంది..

‘ఉద్యోగుల ప్రయోజనాలు, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని శ్రీనన్న(బండి శ్రీనివాసరావు) అన్నారు. 2022 జూలై 1కి సంబంధించిన డీఏ దసరానాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. ఆర్థిక ఇబ్బందుల్లో కొద్దో గొప్పో మీరు అనుకున్న స్థాయిలో నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ మనసు నిండా ప్రేమ మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ ప్రభుత్వం మీది. మీకు మంచి చేసే విషయంలో నాలుగడుగులు వేయడానికి ఎప్పుడూ ముందుంటా’ అని జగన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-22T02:41:57+05:30 IST