AP Govt Distribution of lands: వీరేనా పేదలు!

ABN , First Publish Date - 2023-05-26T02:40:36+05:30 IST

రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై జగన్‌ ప్రభుత్వం పగబట్టింది. రాజధాని ప్రాంతమైన తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో జగన్‌ ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత ఉందని గ్రహించి, సెంటు భూముల పంపిణీ పేరుతో కొత్త పన్నాగం పన్నారు.

AP Govt Distribution of lands: వీరేనా పేదలు!

వైసీపీ కార్యకర్తలు సైతం జాబితాలో

సెంటు భూమి పేరుతో కంపు రాజకీయం

పేదల ముసుగులో రాజధానిలో పందేరం

సొంత కార్లలో షికార్లు చేసే వారూ లబ్ధిదారులే

ఖరీదైన ఇల్లు ఉన్న వారూ నిరుపేదలేనట!

మార్కెట్‌యార్డు డైరెక్టర్‌ భార్యకు పట్టా సిద్ధం!

‘పేదలందు రాజధాని పేదలు వేరయా!’ అని జగన్‌ సూత్రీకరించారు. వారిని పేదలుగా పరిగణించకుండా... వాళ్లు ఇచ్చిన భూముల్లో ఇతర ప్రాంతాల ‘పేదల’కు సెంటు స్థలాల పందేరం చేస్తున్నారు. వారిలోనైనా వందశాతం నిజమైన పేదలా అంటే అదీ లేదు. సొంత పార్టీ కార్యకర్తలు, కారున్న వారు, కానిస్టేబుళ్లకూ ‘సెంటు’ పూస్తున్నారు.

గుంటూరు, మే 25 (ఆంధ్రజ్యోతి)/ తుళ్లూరు(తాడికొండ): రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై జగన్‌ ప్రభుత్వం పగబట్టింది. రాజధాని ప్రాంతమైన తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో జగన్‌ ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత ఉందని గ్రహించి, సెంటు భూముల పంపిణీ పేరుతో కొత్త పన్నాగం పన్నారు. ఓటు బ్యాంకు కోసం అనర్హులను ఎంపిక చేశారు. సెంటు భూమి కోసం ఎంపిక చేసిన ఓ మహిళ భర్త మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ కుటుంబానికి ఖరీదైన కారు, సొంత ఇల్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీకి చెందిన వారు కావటంతో నిబంధనలు తుంగలోతొక్కేసి ఎంపిక చేశారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను కూడా వైసీపీ సానుభూతిపరురాలు కావటంతో లబ్దిదారుల జాబితాలో చేర్చేశారు. అదే విధంగా ఇప్పటికే విలాసవంతమైన ఇల్లు ఉన్న వలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలను సైతం సొంత పార్టీ వారని ఔదార్యం చూపించి సెంటు భూములను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. తాడికొండ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని, టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను చట్టసభలోకి అడుగుపెట్టకుండా చేయాలనే ఏకైక తలంపుతోనే పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎక్కడా పేదలు లేనట్టు ఈ రెండు నియోజకవర్గాల వారినే ఎంపిక చేసి పేదలపై తమకెంతో మమకారం ఉందని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

శుక్రవారం ఈ పట్టాలను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వస్తుండటంతో పోలీసు యంత్రాంగం ఎంతో అప్రమత్తమైంది. దారి పొడవునా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకైక రాజధాని కోసం పోరాడుతున్న రైతులను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. వారి నుంచి ఎటువంటి నిరసనలు వ్యక్తమైనా ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఎవరికీ పట్టని మొర..

సెంటు ప్లాట్లు కేటాయింపులో కొంత మంది అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని స్థానికులు మాట్లాడుతున్నారు.అయితే వీరిలో ఎంత మందికి పట్టాలు మంజూరు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు వైసీపీ వారే లబ్ధిదారులుగా ఉన్నారనేది అధికారులు సిద్ధం చేసిన జాబితా ఆధారంగా తేలిపోతోంది. పేదల పేరు చెప్పి సీఎం జగన్‌ రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఇప్పటికే రాజధాని గ్రామాల రైతులు ఆరోపించారు.

అంతేకాకుండా ఆర్‌-5జోన్‌ ఏర్పాటుచేసి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ విచ్ఛినం చేయడానికి సిద్దపడ్డాడన్నారు. దీంతో అమరావతి రాజధాని స్వరూపమే మారిపోయి, దానిని అభివృద్ధి చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి లేక పోతే యువతకు ఉద్యోగాలుండవు.. రాష్ట్రానికి పెట్టుబడులుండవు.. భూములు త్యాగం చేసిన రైతుల బిడ్డల భవిషత్‌ ప్రశ్నార్థకం.. అమరావతి నిర్వీర్యంతో ఉపాధి అవకాశాలు పోయి అప్పులపాలైపోతామంటూ రైతులు చెబుతున్న మాటలు చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా వుంది.

అనర్హులు ఉంటే పట్టాలు రద్దు చేస్తాం

పేదలకు సెంటు భూమి కేటాయింపులో అనర్హులకు పట్టాలు వస్తే వారి పట్టాలను రద్దు చేస్తాం. సెంటు భూమి ప్లాట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు జరగలేదు. పారదర్శకంగా ప్లాట్లు కేటాయింపులు జరిగాయి. పట్టాల లిస్టుల్లో అనర్హులు వున్నట్లయితే వారిని గుర్తించి వారి పట్టాలను రద్దు చేస్తాం.

- ఫణింద్రబాబు, తహసీల్దార్‌, తుళ్లూరు

పనికిరాని పట్టాలపై లబ్ధిదారుల్లో అనాసక్తి

పట్టాల పంపిణీపై లబ్దిదారుల్లో అనాసక్తి కనిపిస్తోంది. ‘హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలి... అప్పటి వరకూ లబ్దిదారులకు ఎలాంటి హక్కులు ఉండ’’వని పట్టాలపై ముద్రించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు సెంటు పట్టాలపై ఆసక్తిగా లేరు. దీనికి తోడు ‘ఇది పాపపు కూడు.. రైతులకు అన్యాయం చేసి మనకు ఇస్తున్నారు. ఇది న్యాయం కాదు’ అనే కారణంతో మరి కొందరు పట్టాల పంపిణీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సభకు వచ్చేందుకు కూడా వారు ఆసక్తిని చూపడంలేదు. దీంతో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది రంగంలోకి దిగారు. జాబితాలో పేరున్న లబ్దిదారులే కాకుండా వారి కుటుంబ సభ్యులు, పిల్లాజల్లా సహా అందరూ రావాలని వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఒత్తిడి పెడుతున్నారు. వందలకొద్దీ బస్సులను సిద్ధం చేసి తరలించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

Updated Date - 2023-05-26T02:40:36+05:30 IST