YCP Anti - Voters: ‘బూత్‌’ లేపేస్తారు!

ABN , First Publish Date - 2023-04-26T02:21:37+05:30 IST

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టేదెవరు? ఛీ కొట్టేదెవరు? దీనిని గుర్తించేందుకు ‘లిట్మస్‌ టెస్ట్‌’ చేయనున్నారు. ఆ లిట్మస్‌ పేపర్‌... ‘మా నమ్మకం నువ్వే’ స్టిక్కరే! ఈ పరీక్ష చేయించేది వలంటీర్ల ద్వారా! రాజ్యాంగ వ్యవస్థలకు చిక్కకుండా, దొరక్కుండా చాలా తెలివిగా ఓటర్లపై ఈ ప్రయోగం చేయబోతున్నారు.

YCP Anti - Voters:  ‘బూత్‌’ లేపేస్తారు!

వ్యతిరేక ఓటర్లపై వైసీపీ వ్యూహం

వారు ఓటేయకుండా చేయడమే లక్ష్యం

ఇప్పటికే వలంటీర్ల ద్వారా జాబితాలు

‘నమ్మకం’ స్టిక్కర్‌ ద్వారా లిట్మస్‌ టెస్ట్‌

వ్యతిరేకించిన, పీకేసిన వారే టార్గెట్‌

చివరి నిమిషంలో బూత్‌లలో మార్పు

ఓటు కనిపించక వెనుదిరగాలనే పథకం

వ్యతిరేక ఓట్లు తగ్గించే కుట్ర

జనంలో ‘నమ్మకం’ కోల్పోతున్న జగన్‌ సర్కారు మరో రాజకీయ ఎత్తుగడకు తెర లేపుతోంది. వైసీపీకి ‘నమ్మకమైన’ ఓటర్లు ఎవరు, కానిదెవరో గుర్తించే వ్యూహం అమలు చేస్తోంది. ‘వీళ్లు మన ఓటర్లు కారు’ అని నిర్ధారణకు వస్తే... ఇక అంతే! అలాంటి ఓటర్ల నెత్తిన ‘బూత్‌ బాంబ్‌’ వేస్తారు! ఓటర్ల జాబితాలో వారి పేరు ఉంటుంది. కానీ... చివరి నిమిషంలో బూత్‌ మారిపోతుంది. అది ఎక్కడ ఉంటుందో తెలియదు! అంటే.. వైసీపీని వ్యతిరేకించే ఒక ఓటు గల్లంతైనట్లే! స్టిక్కర్‌ టెస్ట్‌, జగన్‌ పేపర్‌ టెస్ట్‌ల ద్వారా వ్యతిరేక ఓటర్లను గుర్తించాలన్నది లక్ష్యం! ఆ బాధ్యతను కూడా వలంటీర్లకే అప్పగించినట్లు సమాచారం!

2019 ఎన్నికల్లో..

కోడికత్తి, గొడ్డలిపోటు, అబద్ధపు ప్రచారాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి... రకరకాల వ్యూహాలు అమలు చేసి, అనేక హామీలు ఇచ్చి... ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అంటూ అధికారంలోకి వచ్చారు.

2024 ఎన్నికల్లో..

విపక్షంలో ఉండగా అమలు చేసిన వ్యూహాలన్నీ ఇప్పుడు వికటించాయి. అసలు వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యాయి. ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిపోతోంది. దీంతో ఈసారి మరో రాజకీయ ఎత్తుగడకు తెర లేపుతున్నారు. అదే.. వైసీపీ వ్యతిరేక ఓటర్లను ‘బూత్‌’దాకా రాకుండా చేయడం!

(అమరావతి - ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టేదెవరు? ఛీ కొట్టేదెవరు? దీనిని గుర్తించేందుకు ‘లిట్మస్‌ టెస్ట్‌’ చేయనున్నారు. ఆ లిట్మస్‌ పేపర్‌... ‘మా నమ్మకం నువ్వే’ స్టిక్కరే! ఈ పరీక్ష చేయించేది వలంటీర్ల ద్వారా! రాజ్యాంగ వ్యవస్థలకు చిక్కకుండా, దొరక్కుండా చాలా తెలివిగా ఓటర్లపై ఈ ప్రయోగం చేయబోతున్నారు. తమను వ్యతిరేకించే ఓటరు వేలిపై సిరా మార్కు పడకుండా చేయడమే దీని లక్ష్యం. పోలింగ్‌ బూత్‌ ఏదో తెలియకపోతే... ఇక ఓటే వేయలేరు కదా! ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ స్టిక్కర్లను ఇంటింటికీ అతికించే ప్రక్రియను ఉద్యమంలాగా జరుపుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు... తమతోపాటు వలంటీర్లను కూడా తీసుకెళ్లి స్టిక్కర్లను అతికిస్తున్నారు. దీని వెనుకే అసలు వ్యూహం దాగి ఉంది. తమ ఇంటిపై స్టిక్కర్‌ను స్వచ్ఛందంగా అతికించుకునే వారిపై పూర్తిగా ‘నమ్మకం’ ఉన్నట్లే. అంటే... వారు వైసీపీ అభిమానులన్నట్లు! ఇక... వైసీపీ నేతలు, వలంటీర్లు స్టిక్కర్‌ అతికిస్తుంటే నవ్వుతూ స్వాగతించే వారిని లేదా అభ్యంతరం వ్యక్తం చేయని వారిని కూడా తమ ఓటర్లుగానే పరిగణిస్తారు. చివరగా... ‘మా ఇంటికి స్టిక్కర్‌ అతికించొద్దు’ అని గట్టిగా వ్యతిరేకించే వారు, ఇలా అతికించగానే అలా పీకేసే వారే వైసీపీ టార్గెట్‌! వీరందరినీప్రభుత్వ వ్యతిరేక ఓటర్లుగా, తమకు ‘ప్రమాదకారులు’గా నిర్ణయిస్తారు. ఇలా స్టిక్కర్‌ లేని ఇళ్లు గుర్తించే బాధ్యతను వలంటీర్లకు అప్పగిస్తున్నారు. వ్యతిరేకులను గుర్తించడంలో ‘స్టిక్కర్‌’ మొదటి దశ. ఆ తర్వాత మరో దశ కూడా ఉంది!

‘సొంత మీడియా’ ద్వారా...

ప్రభుత్వ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలకు ఇప్పటికే జగన్‌ పత్రిక పంపిస్తున్నారు. వలంటీర్లతోనూ కొనిపిస్తున్నారు. కొత్తగా వందేభారత్‌, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అడిగిన వారికి, అడగని వారికీ ఆ పత్రిక అందిస్తున్నారు. అదేవిధంగా... ఊళ్లలో తమ వ్యతిరేకులెవరో పూర్తిస్థాయిలో నిర్ధారించుకునేందుకూ జగన్‌ పత్రికను ‘లిట్మస్‌ పేపర్‌’గా ఉపయోగిస్తారు. అప్పటికే స్టిక్కర్‌ టెస్ట్‌ ద్వారా వ్యతిరేకులను ప్రాథమికంగా గుర్తించిన వారి ఇళ్లకే జగన్‌ పత్రికను పంపిస్తారు. ‘ఒక నెల ఉచితంగా ఇస్తాం. తర్వాత... మీకు నచ్చితే కొనసాగించుకోవచ్చు’ అని ‘ఫ్రీ’ ఆఫర్‌ ఇస్తారు. ‘మీ పేపరూ వద్దు. మీరూ వద్దు’ అని దండం పెట్టారంటే... వైసీపీ వ్యతిరేక ఓటర్లుగా లెక్క!

బూత్‌ మార్చి మంత్రాంగం...

జగన్‌ స్టిక్కర్‌, జగన్‌ పత్రిక రెండింటినీ వద్దన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. వారి పేర్లతో కూడిన జాబితా, చిరునామాలు వెళ్లాల్సిన చోటికి వెళతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి అసలు తతంగం నడుస్తుంది. వారి ఓట్లను తీసేయడం అంత సులభం కాదు. పైగా... జాబితాను చూసుకుంటే ఓటు ఉన్నదీ, లేనిదీ తెలిసిపోతుంది. అందుకే... ‘బూత్‌ బాంబ్‌’ పేలుస్తారు. వారి ఓట్లను గుట్టుచప్పుడు కాకుండా మరో బూత్‌కు మార్చేస్తారు. ఓటర్లు అలవాటు ప్రకారం గత ఎన్నికల్లో ఓటు వేసిన బూత్‌కే వచ్చే ఎన్నికల్లోనూ వెళతారు. కానీ... మండుటెండలో గంటో, రెండు గంటలో వేచి చూసిన తర్వాత తమ వంతు వచ్చేసరికి జాబితాలో తమ పేరు లేదని తెలుస్తుంది. మరి ఎక్కడ ఉందో తెలియదు. మరో రెండు మూడు బూత్‌లు తిరిగి వెతుక్కునే ఓపిక ఉండదు. పట్టుదలతో వెతుక్కున్నా... ఈలోపు పుణ్యకాలం ముగిసిపోవచ్చు. వెరసి... వారి ఓట్లు గల్లంతైనట్లే. ఆ విధంగా వైసీపీ వ్యతిరేక ఓట్లు తగ్గిపోతాయి. బూత్‌లు మార్చిన విషయం చివరి దాకా రహస్యంగా ఉంచేస్తారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పెద్దల నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. కుదిరితే చెప్పాపెట్టకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఓట్లను జాబితా నుంచి తొలగించడం... లేనిపక్షంలో ఒకే ఇంట్లో ఉన్న ఓట్లను చెల్లాచెదురు చేస్తారు.

ఇది సాధ్యమేనా...

పక్కపక్క ఇళ్లలో... ఒకరి ఓట్లు ఒక బూత్‌లో, మరొకరివి మరోబూత్‌లో ఉంచడం సాధ్యమేనా? కచ్చితంగా సాధ్యమే! ఒకే ఇంట్లోనే ఒకరి ఓటు ఒక చోట, మరొకరిది ఇంకోచోట కూడా ఉన్నాయి. పట్టణాల్లోని అపార్ట్‌మెంట్లలో ఒక ఫ్లాట్‌లోని ఓటర్ల బూత్‌లు ఒకచోట, పక్క ఫ్లాట్‌లోని ఓట్లు మరో బూత్‌లో ఉంటున్నాయి. ఒక బూత్‌లో నిర్దిష్ట సంఖ్యను మించితే, ఇతర బూత్‌లకు సర్దుబాటు చేయడం సాధారణమే! దీనినే తమ ప్రయోజనాలకు వాడుకోవాలన్నది వైసీపీ ప్లాన్‌! ఇందులో అసలు విషయమేమిటంటే... తమకు ఓటు ఉందని తెలుస్తుంది కానీ, అది ఏ బూత్‌లో ఉందో చివరి దాకా తెలియదు.

వలంటీర్లే సర్వం...

ఓటర్ల నమోదు, సవరణ, తిరస్కరణ ప్రక్రియలతో వలంటీర్లకు సంబంధం లేదు. వారిని ఆ పనులకు ఉపయోగించుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ, అనధికారికంగా వలంటీ ర్లే అన్ని పనుల్లో నిమగ్నమయ్యారు. వార్డుల పరిధిలో ఎవరి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? అందులో వైసీపీకి వచ్చేవి ఎన్ని, ప్రతిపక్ష ఓట్లు ఎన్ని అనే అంచనాతో జాబితాలున్నాయి. ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ వ్యూహాలు మరింత బలంగా అమలు చేసే అవకాశముందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. దీంతో... ఇప్పటి నుంచే అప్రమత్తమై, ఓటర్లలోనూ అవగాహన పెంచాలని భావిస్తున్నాయి.

Updated Date - 2023-04-26T02:21:37+05:30 IST