JANASENA: వైసీపీ మైండ్‌గేమ్‌!

ABN , First Publish Date - 2023-03-31T03:25:40+05:30 IST

పొత్తులపై సాగుతున్న ఫేక్‌ ప్రచారంపై జనసేన అప్రమత్తమైంది. సోషల్‌ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సమాచారం పంపింది.

JANASENA: వైసీపీ మైండ్‌గేమ్‌!

పొత్తులు, వ్యూహాలపై తప్పుడు ప్రకటనలు

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం నమ్మొద్దు!

గందరగోళానికి, భావోద్వేగాలకు గురికావొద్దు

పార్టీ శ్రేణులకు జనసేన సమాచారం

అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పొత్తులపై సాగుతున్న ఫేక్‌ ప్రచారంపై జనసేన అప్రమత్తమైంది. సోషల్‌ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సమాచారం పంపింది. ‘‘రాష్ట్ర శ్రేయస్సు, మన యువత భవితను దృష్టిలో ఉంచుకుని పవన్‌ ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పారు. అప్పటి నుంచి వైసీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది’’ అని జనసేన తెలిపింది. జనసేనతో పాటు ఇతర ప్రతిపక్షాల నేతల పేర్లతో తప్పుడు ప్రకటనలతో గందరగోళం సృష్టించడం ఆ క్రీడలో భాగమే అని తెలిపింది. ‘‘సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రకటనలు, సమాచారంతో గందరగోళానికి గురికావొద్దు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పవన్‌ కల్యాణ్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తీసుకోబోయే నిర్ణయాలను, అనుసరించే వ్యూహాలను పారదర్శకంగా పార్టీ నాయకులకు తెలియజేస్తారు. అందువల్ల... పొత్తులు, వ్యూహాలపై అనవసరమైన ఆందోళనలకు గురికావొద్దు’’ అని జనసేన తన పార్టీ శ్రేణులకు సూచించింది. ‘‘దమ్ముంటే జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ సవాల్‌ విసురుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోరుకుంటున్నది జరగదు.

ఏం జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో అది నాకు తెలుసు. అదే జరుగుతుంది. వైసీసీ వ్యతిరేక ఓటు వృథా కానివ్వను. రాష్ట్రం హితం కోసమే నిర్ణయం తీసుకుంటా. నన్ను నమ్మండి’’.... జనసేన 10వ ఆవిర్భావ సభ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలివి. జనసేన వ్యూహం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆ సభలో ఆయన స్పష్టంగా వివరించారు. ప్రతి సమావేశంలోనూ పార్టీ వ్యూహంపై బహిరంగంగానే చెబుతున్నారు. కానీ కొంతమంది పనిగట్టుకుని ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లో పార్టీకి సంబంధం లేకుండా, నాయకులు చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జనసేనకు సీట్లు కేటాయింపు చేసేసినట్లు ఒకసారి, టీడీపీతో పొత్తు లేదని మరోసారి.... అసలు జనసేనతో పొత్తు అవసరమే లేదు, సొంత బలంతో గెలుస్తామని టీడీపీ కీలక నేతలు ప్రకటనలు చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో కిందస్థాయి నేతల్లో గందరగోళం నెలకొంటోంది. దీనిపై పార్టీలు తమ కేడర్‌కు స్పష్టత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రాజకీయ క్రీడలో భాగంగా వైసీపీ మైండ్‌గేమ్‌ సాగిస్తోందని, ప్రతిపక్ష నేతల పేరుతో తప్పుడు ప్రకటలు సృష్టిస్తూ గందరగోళం రేపుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులు, వ్యూహాలు, సీట్లు వంటి అంశాలను అధినేత చూసుకుంటారని, తప్పుడు ప్రకటనలు నమ్మవద్దని, పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు గందరగోళానికి, భావోద్వేగాలకు లోనుకావద్దని రెండు, మూడు రోజులుగా అధిష్ఠానం నుంచి కేడర్‌కు సమాచారం పంపిస్తున్నారు. ఈ విషయాల్లో అనవసర ఆందోళన వద్దని స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా చేపట్టాలని కేడర్‌కు సూచిస్తున్నారు.

Updated Date - 2023-03-31T03:25:40+05:30 IST