Share News

బస్సుయాత్ర.. బలప్రయోగం

ABN , First Publish Date - 2023-11-20T00:25:45+05:30 IST

ఎలాగైనా సాధికర బస్సుయాత్రను విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తోన్నారు. బలప్రయోగం.. అధికార దుర్వినియోగం చేసి జనాన్ని సమీకరించి సభను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.

బస్సుయాత్ర.. బలప్రయోగం

నేడు నరసరావుపేటలో వైసీపీ యాత్ర

బలవంతపు జనసమీకరణపై నేతల దృష్టి

నిర్బంధంగా ప్రైవేటు విద్యా సంస్థల మూసివేత

వైసీపీ నాయకుల చేతుల్లోకి స్కూల్స్‌, కళాశాల బస్సులు

ఒక్కో వలంటీరు 15 మందిని తీసుకురావాలని ఆదేశాలు

నరసరావుపేట, నవంబరు 19: ఎలాగైనా సాధికర బస్సుయాత్రను విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తోన్నారు. బలప్రయోగం.. అధికార దుర్వినియోగం చేసి జనాన్ని సమీకరించి సభను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో సోమవారం జరగనున్న బస్సు యాత్ర సభకు జనాన్ని తరలించేందుకు స్థానిక వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వలంటీర్లు, డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించే బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. విద్యా సంస్థల బస్సులను జన సమీకరణకు వినియోగించుకునేందుకు ప్రైవేట్‌ విద్యా సంస్థలకు నిర్భందంగా సోమవారం మూసివేయిస్తున్నారు. బస్సుయాత్ర విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేతలను అధిష్ఠానం ఆదేశించింది. దీంతో ఎలాగైనా జనసమీకరణ చేయాలని.. అందుకోసం ప్రైవేట్‌ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి మరీ వారి బస్సులను ఇవ్వాలని వైపీసీ నేతలు ఆదేశించారు. ఇందుకు సహకరించని విద్యా సంస్థలపై చర్యలు ఉంటాయన్న హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి బస్సులను వైసీపీ నేతలకు యాజమాన్యాలు అప్పగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కళాశాలలు ఆదివారం తరగతులు నిర్వహించి సోమవారం సెలవు ప్రకటించాయి. ఇందుకు విద్యా శాఖ అధికారులు సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. బలవంతంగా విద్యా సంస్థలను మూసివేయిస్తుండంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంతటితో ఆగని వైసీపీ నేతలు వలంటీర్లకు జనసమీకరణకు టార్గెట్లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పట్టణంలోని ఒక్కో వలంటీర్‌ 15 మందికి తగ్గకుండా జనాన్ని తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులను సభకు తరలించాలని సదరు అధికారులు మీటింగ్‌ పెట్టి మరీ వలంటీర్లకు అదేశాలు జారీ చేసినట్లు వారు చెప్పకనే చెబుతున్నారు. సభకు రాకపోతే పథకాలు నిలిచిపోతాయని వలంటీర్లు జనాలను బెదిరిస్తున్నారని సమాచారం. ఇష్టమైతే సభకు వస్తాం, బలవంతంగా రావాలని వలంటీర్లు బెదిరించడం ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను సభకు తరలించాలని సంబంధిత అధికారులు, ఉద్యోగులకు ఆదేశించినట్లు సమాచారం. ఉన్న అన్ని మార్గాల ద్వారా జన సమీకరించేందుకు నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. బస్సు యాత్ర కోసం అధికారులు నిబంధనలను గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ సభ విజయవంతంలో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పల్నాడు రోడ్డును కూడా మూసివేసి సభావేదిక నిర్మిస్తుండటం విమర్శలకు దారితీసింది.

గ్రూపులను పక్కన పెట్టండి..

నరసరావుపేట నియోజకవర్గంలోని వైసీపీలో నేతల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ క్రమంలో గ్రూపులను పక్కన పెట్టి బస్సుయాత్ర సభకు జనసమీకరించి కార్యక్రమాన్ని విజయవతం చేయాలని జిల్లా కో అర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెండు గ్రూపుల నేతలను అదేశించినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న నేతలకు సభ విజయవంతం ద్వారా చెక్‌ పెట్టే దిశగా జనసమీకరణలో నిమగ్నమయ్యారు. పల్నాడు రోడ్డులోని వేదిక సమీపంలోని గురజాల ఎమ్మెల్యే డాక్టర్‌ కాసు మహేష్‌రెడ్డి నిర్వహణలో ఉన్న కళాశాల ప్రాంగణంలో భోజన ఏర్పాట్లకు ఆయన నిరాకరించడం పార్టీలో చర్చనీయంశమైంది. భోజనాలు ఏర్పాటు చేస్తే ప్రాంగణం పాడవుతుందని ఆయన చెప్పినట్టు కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో మరో కళాశాలలో భోజన ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Updated Date - 2023-11-20T00:40:25+05:30 IST