జాప్యం తెచ్చిన అనర్థమిది!
ABN , First Publish Date - 2023-08-30T03:01:04+05:30 IST
నిర్మాణ జాప్యమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితికి కారణమని కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయపడింది.
పోస్ట్‌మన్ పనికే పీపీఏ పరిమితం
పోలవరం పనులు ఆపినప్పుడే హెచ్చరిస్తే ఇలా జరిగేది కాదు
జలశక్తి శాఖ సమావేశం ఆగ్రహం
రాష్ట్ర అధికారులు లేకుండానే భేటీ
చివరి నిమిషంలో రావొద్దని సమాచారం
కేంద్ర సంస్థలతో మాత్రం సుదీర్ఘ సమీక్ష
నిజనిర్ధారణ నివేదికపై 4 రోజులు భేటీలు
తొలి రోజు కార్యదర్శి పంకజ్ ఆధ్వర్యంలో.. నేడు సలహాదారు వెదిరె శ్రీరామ్ సమీక్ష
కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన అవసరం లేదన్న జలసంఘం
ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి వాడిన మట్టి, రాళ్లపై సీఎంఎస్‌ఆర్‌ఎస్ సందేహం
ఇక దిద్దుబాట్లు, నివారణపై కేంద్రం దృష్టి!
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ జాప్యమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితికి కారణమని కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయపడింది. నిర్మాణాల్లో జాప్యం జరిగితే హెచ్చరించాల్సిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ).. పోస్ట్‌మన్ జాబ్‌కే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తంచేసింది. మంగళవారమిక్కడ జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. జలశక్తి శాఖ ముఖ్య సలహాదారు వెదిరె శ్రీరామ్, కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ), సెంట్రల్ మెటీరియల్-శాండ్ రీసెర్చ్ స్టేషన్ (సీఎంఎ్‌సఆర్‌ఎస్), పీపీఏ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ హాజరు కావాలని.. కీలకమైన నిధులు, 41.15 మీటర్ల కాంటూరులో తొలిదశ పూర్తి చేసేందుకు కాలపరిమితి, డయాఫ్రంవాల్, ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ, ఇతర అంశాలపై సమీక్ష జరుగుతుందని ఈ నెల 22వ తేదీన జలశక్తి శాఖ సమాచారం పంపింది. రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్‌సీ, పోలవరం చీఫ్ ఇంజనీర్ రావాలని కోరింది. కానీ ఆఖరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వర్తమానం పంపింది. దీంతో రాష్ట్ర అధికారులు ఢిల్లీ ప్రయాణం మానుకున్నారు. వారిని రావద్దన్న జలశక్తి శాఖ.. తన పరిధిలోని కేంద్ర సంస్థలతో సమీక్ష సాగించడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సమావేశంలో ప్రాజెక్టు స్థితిగతులపై సుదీర్ఘంగా సమీక్షించారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడం.. గైడ్‌బండ్ కూలిపోవడం.. ఎగువ కాఫర్ డ్యాంకు సీపేజీ.. గ్యాప్‌లు మరింత పెరిగిపోవడం మొదలైనవాటిపై చర్చించారు.
ప్రాజెక్టు డిజైన్లను ఆమోదించి.. వాటి నిర్మాణానికి తగినట్లుగా కాలపరిమితి విధిస్తున్నామని.. కానీ గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయని సమావేశం అభిప్రాయపడింది. ప్రతి డిజైన్‌కూ కాల పరిమితి ఉంటుందని.. కాలాతీతమైతే నిర్మాణ గుణం మారిపోతుందని.. స్ట్రక్చరల్ తేడాలు వచ్చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఒక్కో కట్టడానికి ఒక్కో డిజైన్‌ను, గడువును ఇచ్చామని.. సాంకేతికంగా వాడాల్సిన మెటీరియల్స్ గురించి కూడా స్పష్టం చేశామని.. అయితే.. కాలానుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి.. జాప్యమైతే రాష్ట్రాన్ని హెచ్చరించే విధులను పీపీఏ విస్మరించిందని ఆక్షేపించింది. కేంద్రం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రానికి.. రాష్ట్రం ఇచ్చిన నివేదికలను కేంద్రానికి పంపే పోస్ట్‌మన్ జాబ్‌కే పీపీఏ పరిమితమైపోయిందని అసహనం వ్యక్తం చేసింది. పనులు నిలిపివేసిన ప్రతిసారీ అఽథారిటీ సమర్థంగా వ్యవహరించి ఉంటే.. ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని తేల్చిచెప్పింది.
నాలుగైదు రోజుల్లో కార్యాచరణ!
న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి నాలుగైదు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జలశక్తి శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ బాధ్యతను వెదిరె శ్రీరామ్‌కు అప్పగించినట్లు సమాచారం. తొలిరోజు మంగళవారం కార్యదర్శి పంకజ్ సారథ్యంలో సమావేశం జరుగగా.. బుధవారం నుంచి శుక్రవారం వరకు శ్రీరామ్ సమీక్షలు చేపడతారు. పీపీఏ సీఈవో, జల సంఘం, వ్యాప్కోస్ వంటి సాంకేతిక విభాగాల అధికారులు పాల్గొంటారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదకపై సమగ్ర అధ్యయనం చేస్తారు.
లోతుగా అధ్యయనం
గైడ్‌బండ్ కుప్పకూలినప్పుడు డీడీఆర్‌పీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో నియమించిన నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదికపైనా సమావేశంలో చర్చించారు. ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలున్నాయి.. వాటిని సరిదిద్దేందుకు తీసుకోవలసిన చర్యలపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నందున కొత్తది నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్ర జల సంఘం సాంకేతిక విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కొత్తది కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి వాడిన మట్టి, రాళ్లు సాంకేతికగా సరైనవి కావని సీఎంఎ్‌సఆర్‌ఎస్ అభిప్రాయపడింది. అయితే.. గతంలో సీఎంఎ్‌సఆర్‌ఎస్ ఆమోదించాకే.. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం జరిగిందని స్పష్టం చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణాలకు సంబంధించి థర్డ్ పార్టీగా సీఎంఎ్‌సఆర్‌ఎస్సే వ్యవహరించిందని గుర్తు చేసింది. చివరకు.. ఇప్పటిదాకా జరిగిన నష్టంపై పోస్టు మార్టం నిర్వహించడం కంటే.. దిద్దుబాట్లు, నివారణపై దృష్టి సారిద్దామని సమావేశం నిశ్చయానికి వచ్చింది.