అసలేం జరుగుతోంది?

ABN , First Publish Date - 2023-10-10T02:35:33+05:30 IST

‘మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు, అరెస్టుకు గవర్నర్‌ అనుమతి అవసరమా? లేదా?’ దీనిపై 31 రోజులుగా చర్చ జరుగుతోంది.

అసలేం జరుగుతోంది?

ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ విస్మయం!

అధికారులను పిలిపించి ప్రశ్నల వర్షం?

17(ఏ)పై నెల రోజులుగా చర్చ

బాబుపై కేసుకు గవర్నర్‌ అనుమతిపై సుప్రీం కోర్టు దాకా వాదనలు

అయినా గవర్నర్‌ను కలవని ప్రభుత్వం

రాజ్‌భవన్‌ కేంద్రంగా చర్చ జరుగుతున్నా నిర్లక్ష్యమే!

వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశం

రాజ్‌భవన్‌కు ప్రధాన కార్యదర్శి, ఏజీ, ఏఏజీ, సీఐడీ చీఫ్‌

గంటా 20 నిమిషాలపాటు వివరణ

‘ఆంధ్రజ్యోతి’ కథనం తర్వాత కీలక పరిణామం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు, అరెస్టుకు గవర్నర్‌ అనుమతి అవసరమా? లేదా?’ దీనిపై 31 రోజులుగా చర్చ జరుగుతోంది. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు కొనసాగుతున్నాయి. అయినా సరే... ఇప్పటిదాకా ప్రభుత్వం గవర్నర్‌ నజీర్‌ అహ్మద్‌ను దీనిపై సంప్రదించనేలేదు. కేసు వివరాలను కనీసం ప్రస్తావించలేదు. అలాంటిది... సోమవారం అకస్మాత్తుగా రాజ్‌భవన్‌కు పరుగులు తీశారు. గవర్నర్‌ నుంచి పిలుపు రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. అది కూడా... ‘అదా అసలు సంగతి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రచురించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. స్కిల్‌ ప్రాజెక్టులో చంద్రబాబుపై సీఐడీ పెట్టింది డొల్ల కేసని, గవర్నర్‌ ‘నో’ అంటారు కాబట్టే ఆయన ముందస్తు అనుమతి కోరలేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ‘చంద్రబాబుపై కేసు - గవర్నర్‌ అనుమతి అవసరం’పై నెలరోజులుగా ప్రజల్లో, కోర్టులో, మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అయినా సరే... ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కరంటే ఒక్కరూ గవర్నర్‌ను కలిసి ఈ కేసులో పూర్వాపరాలను వివరించలేదు. ఇదే క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో రాజ్‌భవన్‌ స్పందించినట్లు తెలుస్తోంది. ఇంతకూ ఈ వ్యవహారంలో ఏం జరిగింది? ప్రభుత్వం తనను ఎందుకు అనుమతి కోరలేదు? దాని వెనక ఉన్న కారణాలు ఏమిటి? అని తెలుసుకోవాలని భావించిన గవర్నర్‌ నజీర్‌ అహ్మద్‌... సంబంధిత అధికారులంతా వచ్చి తనకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సుబ్రమణ్యం, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రాజ్‌భవన్‌కు హుటాహుటిన పరుగులు తీశారు. తమకు సహాయకంగా ఒక ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, సీఐడీ డీఎస్సీని కూడా తీసుకెళ్లారు.

సాయంత్రం 6 నుంచి 7.20 దాకా గంటా 20 నిముషాల పాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... స్కిల్‌ డెవల్‌పమెంట్‌ స్కామ్‌ జరిగిందెప్పుడు? మొదట బయటపడిందెప్పుడు? అనే వివరాలను సుదీర్ఘంగా వివరించారు. అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే జరిగిన ఘటన కాబట్టే గవర్నర్‌ అనుమతి తీసుకోవాలన్న ప్రస్తావన రాలేదని గవర్నర్‌కు తెలిపారు. సుప్రీంకోర్టులో చేస్తున్న వాదనలనే మళ్లీ గవర్నర్‌ ముందు ఏకరువు పెట్టినట్లు తెలిసింది. గవర్నరే స్వయంగా పిలిపించడం, అందులోనూ ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన వ్యక్తి కావడంతో అధికార బృందం అన్ని జాగ్రత్తలతో వెళ్లింది. అన్ని డాక్యుమెంట్లను కట్టలు కట్టి తీసుకెళ్లి... ఒక్కో పత్రం చూపిస్తూ ఆయనకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తిగా సుదీర్ఘ అనుభవమున్న గవర్నర్‌ నజీర్‌ అహ్మద్‌ ఆయా పత్రాలను నిశితంగా పరిశీలించినట్లు తెలిసింది. పైకి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సమాచారం.

ఇంత లెక్కలేనితనమా?

కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఒకరు గవర్నర్‌ను కలిసి వివరించడం సర్వసాధారణం. ఆయా అంశాల తీవ్రతను బట్టి స్వయంగా ముఖ్యమంత్రే రాజ్‌భవన్‌కు వెళతారు. విదేశీ పర్యటనలు, ఢిల్లీ పర్యటనలకు వెళ్లి వచ్చినప్పుడు కూడా గవర్నర్‌కు వివరాలు చెప్పడం పరిపాటి. కానీ... చంద్రబాబుపై కేసుకు సంబంధించి స్వయంగా గవర్నర్‌ పాత్రపైనే నెలరోజులుగా చర్చ జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు కూడా ఆయన పిలిచిన తర్వాతే రాజ్‌భవన్‌కు పరుగులు తీయడం గమనార్హం.

Updated Date - 2023-10-10T02:35:33+05:30 IST