ఢిల్లీలో ఏం చేశారు?

ABN , First Publish Date - 2023-03-19T02:57:51+05:30 IST

అసెంబ్లీలో సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చేందుకు వాయిదా తీర్మానానికి అవకాశమివ్వాలని శనివారం తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది.

ఢిల్లీలో ఏం చేశారు?

ప్రధానితో ఏం మాట్లాడారు?

సభలో చర్చకు టీడీపీ పట్టు

11 మందిపై సస్పెన్షన్‌ వేటు

‘మండలి’లోనూ అదే అంశం

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చేందుకు వాయిదా తీర్మానానికి అవకాశమివ్వాలని శనివారం తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. దీనిని నిరాకరించిన స్పీకర్‌ తమ్మినేని టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమైన తర్వాత వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌ పరంపర కొనసాగినట్లయింది. ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్‌ సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. సీఎం ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కోసమా? స్వప్రయోజనాల కోసమా చర్చించాలంటూ పట్టుపట్టారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అజెండా పేపర్లును చించి వెదజల్లారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... సభా సమయాన్ని వృథా చేయడానికే ప్రతి రోజూ టీడీపీ సభ్యులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ సూచించారు. మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలంటూ మంత్రి బుగ్గన ప్రతిపాదించగా... సభ ఆమోదం తెలిపింది. బెందాళం అశోక్‌, కింజారపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాలయ చినరాజప్ప, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహన్‌రావులను ఒక రోజుపాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు సభనుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్‌ సభలో ప్రవేశించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. స్పీకర్‌ తమ్మినేని టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నా అని తెలిపారు.

మండలి సమావేశాల బహిష్కరణ

శాసనమండలి సమావేశాలను శనివారం ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఉద యం 10 గంటలకు శాసనమండలి సమావేశం ప్రారంభం కాగానే.. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై సభలో చర్చించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చిం ది. కౌన్సిల్‌ చైర్మన్‌ మోషేనురాజు దాన్ని తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. మండలి చైర్మన్‌ పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నిరసన కొనసాగించారు. తర్వాత పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. మంత్రులు అంబటి, కాకాణి, బొత్స... ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభకు అంతరాయం కల్పిస్తున్నారంటూ మండిపడ్డారు. అంగీకరించని యనమల... ప్రధానితో ఏం చర్చించారో సీఎం సభకు వచ్చి చెప్పాలని, లేదంటే లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ అయినా ఇవ్వాలని పట్టుబట్టారు. సమావేశాలు ముగిసేలోగా ఇస్తారన్న అంబటి మాటలను ఆయన కొట్టిపారేశారు. గత నాలుగేళ్లుగా సీఎం జగన్‌ ఒక్కసారి కూడా కౌన్సిల్‌ సమావేశాలకు హాజరుకాలేదని, ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి లేనందున తాము సభ నుంచి బాయ్‌కాట్‌ చేస్తున్నామని యనమల ప్రకటించారు.

Updated Date - 2023-03-19T02:57:51+05:30 IST