నాటికీ, నేటికీ ఎంత తేడా!!

ABN , First Publish Date - 2023-03-21T03:36:06+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రాఫ్‌ భారీగా పడిపోయిందని ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.

నాటికీ, నేటికీ ఎంత తేడా!!

2019లో, ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓట్లలో భారీ తరుగు

తొలి ప్రాధాన్య ఓట్ల ఆధారంగా‘పీపుల్స్‌ పల్స్‌’ విశ్లేషణ

ఉత్తరాంధ్రలో 18.89 శాతానికిపడిపోయిన వైసీపీ గ్రాఫ్‌

తూర్పు సీమలో 19.10%,

పశ్చిమ సీమలో 13.37% తగ్గుదల

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రాఫ్‌ భారీగా పడిపోయిందని ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను, తాజా ఫలితాలను బేరీజు వేశాక రెంటి మధ్య భారీ అంతరం కనిపిస్తోందని ‘పీపుల్స్‌ పల్స్‌’ అనే సంప్థ విశదీకరించింది. మొదటి ప్రాధాన్య ఓటు ఆధారంగా తీసుకున్న గణాంకాలు పరిశీలిస్తే.. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాలు.. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్లు తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారని తేలింది. జగన్మోహన్‌రెడ్డికి రాయలసీమలో గట్టి బలం ఉందని ఇప్పటి వరకూ అన్ని సర్వేలూ చెబుతూ వచ్చాయి. ఐ-ప్యాక్‌ టీమ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఒకే తరహా అభిప్రాయం వెల్లడైందని పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది. ఉత్తరాంధ్రలో వైసీపీ గ్రాఫ్‌ 18.89 శాతం దాకా పడిపోయింది. తూర్పు రాయలసీమలో 19.10 శాతం పడిపోయింది. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప భాగంగా ఉన్న పశ్చిమ రాయలసీమలోనూ 13.37 శాతం మేర వైసీపీ బలహీనపడింది. రాయలసీమలో భారీగా జగన్‌ ఓట్లకు గండి పడటం ఆ ప్రాంత వైసీపీ నేతలకు వణుకు పుట్టిస్తోంది. వారిని భయపెట్టిన మరో ప్రధాన అంశమేమంటే .. టీడీపీ ఉత్తరాంధ్రలో 4.27 శాతం, తూర్పు రాయలసీమలో 5.28 శాతం, పశ్చిమ రాయలసీమలో 3.78 శాతం మేర బలాన్ని పెంచుకుంది. సహజంగా విద్యావంతులైన గ్రాడ్యుయేట్ల అభిప్రాయాలు అంత త్వరగా మారిపోవు. కానీ జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్లలోనే తీవ్ర స్థాయి వ్యతిరేకత పెల్లుబుకడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

Updated Date - 2023-03-21T03:36:06+05:30 IST