మేం 151.. మీరు 23 మందే!
ABN , First Publish Date - 2023-09-22T03:42:29+05:30 IST
మీరున్నది 23 మందే.. మేం 151 మంది ఉన్నాం.. మీకులా శాసనసభపై మాకు గౌరవం లేకపోతే.. మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అసెంబ్లీ,
మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి!!
టీడీపీ సభ్యులకు మంత్రి రోజా హెచ్చరికలు
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘మీరున్నది 23 మందే.. మేం 151 మంది ఉన్నాం.. మీకులా శాసనసభపై మాకు గౌరవం లేకపోతే.. మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అసెంబ్లీ, స్పీకర్, చట్టాలపై గౌరవం ఉండబట్టే సైలెంట్‌గా ఉన్నాం. టీడీపీ సభ్యులు రౌడీయిజం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘బాలకృష్ణ మీసం మెలేస్తే.. భయపడేవాళ్లెవరూ లేరు. చంద్రబాబును కక్షసాధింపుగా జైల్లో పెట్టామని టీడీపీ కలరింగ్ ఇస్తోంది. చంద్రబాబు పెద్ద గజదొంగ అని ప్రజలకు అర్థమయింది. 14 ఏళ్లు స్కామ్‌లు చేశాడే తప్ప... ప్రజలకు పని కొచ్చే స్కీమ్‌లు పెట్టలేదు. అందుకే అయ్యో పాపం అని ఎవ్వరూ రోడ్డు మీదకు రావట్లేదు. దాంతో పిచ్చెక్కి అచ్చెన్నాయుడు కనీసం కార్యకర్తలైనా రండని వీడియోలు చేస్తున్నాడు. బాబుపై పెట్టింది అక్రమ కేసైతే అసెంబ్లీలో కరెక్ట్ ఫార్మాట్‌లో చర్చను కోరాలి. అలా కాకుండా సైకోల్లా అరుస్తూ, స్పీకర్ మీదకు వచ్చేశారు.ప్రభుత్వ ధనం దోచేసిన చంద్రబాబు కోసం అసెంబ్లీకి వచ్చి రౌడీయిజం చేయడాన్ని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబుపై టీడీపీ వాళ్లకు నిజంగా ప్రేమ లేదు. కేవలం రాజకీయ ఉనికి కోసమే అసెంబ్లీలో రాద్ధాంతం చేస్తున్నారు’’ అని రోజా విమర్శించారు.