బీఈడీ ఉర్దూ మూల్యాంకనంలో ఒకే ఒక్కడు
ABN , First Publish Date - 2023-05-02T00:43:55+05:30 IST
బీఈడీ మూల్యాంకనంలో మత ప్రార్థనలు... క్యాంపస్‌లో రెగ్యులర్ సైకాలజీ విద్యార్థుల చేత బీఈడీ పేపర్ల మూల్యాంకనం... ఇదీ ఏఎన్‌యూ అధికారుల తీరు.
గుంటూరు(విద్య), మే 1: బీఈడీ మూల్యాంకనంలో మత ప్రార్థనలు... క్యాంపస్‌లో రెగ్యులర్ సైకాలజీ విద్యార్థుల చేత బీఈడీ పేపర్ల మూల్యాంకనం... ఇదీ ఏఎన్‌యూ అధికారుల తీరు. తాజాగా బీఈడీ ఉర్దూ మీడియంలో ఆరు సబ్జెక్టుల రికార్డులను ఒకే అధ్యాపకుడి చేత మూల్యాంకనం చేయించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సోమవారం నుంచి బీఈడీ ఉర్దూ మీడియం రికార్డుల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందులో భాగంగా బీఈడీ మూడో సెమిస్టర్‌లోని ఆరు సబ్జెక్టుల రికార్డులను ఒకే అధ్యాపకుడితో మూల్యాంకనం చేయించారు. వర్సిటీ పరిధిలోని ఉర్దూ కళాశాలలకు సంబంధించిన గణితం, ఫిజిక్స్, బయాలజీ, ఇంగ్లీషు రికార్డుల మూల్యాంకనం సోషల్ బోధించే అధ్యాపకుని చేత చేయించారు. ఇలా విద్యార్థుల జీవితాలతో ఇలా చెలగాటం ఆడడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సత్తెనపల్లి, వినుకొండ ప్రాంతాల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పనిచేసే టీచర్ల చేత కూడా బీఈడీ మూల్యాంకనం చేయించినట్లు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మూల్యాంకన కేంద్రాల్లో మత ప్రార్థనలు నిర్వహించిన అధ్యాపకుల గురించి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.