Taxes Thieves : వాణిజ్య పన్నుల శాఖలో దొంగలు పడ్డారు!
ABN , First Publish Date - 2023-03-02T02:48:51+05:30 IST
‘ఒక దేశం... ఒకే పన్ను’ పేరుతో కేంద్రం జీఎస్టీ ప్రవేశపెట్టింది! ఇంకేముంది... పన్ను ఎగవేతలకు అన్ని దారులూ మూసుకుపోయాయని అంతా అనుకుంటున్నారు.
ఖజానాకు వందల కోట్ల గండి
భారీగా వెనకేసుకుంటున్న ‘సిండికేట్’
ఒకే అధికారి చేతిలో కీలకమైన విభాగాలు
వెన్ను దన్నుగా నిలిచిన కీలక ప్రజాప్రతినిధి
వ్యాట్ ‘అప్పీళ్ల’లోనే భారీ గోల్‌మాల్
అనధికారికంగా దొడ్డిదారిన దందా
అడ్డగోలుగా ‘స్టే’ ఉత్తర్వులు జారీ
ఫీజు చెల్లింపు, పన్ను వసూలూ ఉండదు
రెండేళ్లలో 140 దరఖాస్తులకు ‘పరిష్కారం’
ప్రభుత్వ ఖజానాకు రూ.276 కోట్లు గండి
పట్టించుకునే దిక్కులేక అప్రతిహతంగా దోపిడీ
‘ఆంధ్రజ్యోతి’ సమగ్ర కథనం
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ‘అప్పులో రామచంద్రా’ అని ఆకలి కేకలు పెడుతోంది. ఎంత దొరికితే అంత రాబట్టుకోవడానికి వెంపర్లాడుతోంది. చెత్తపైనా పన్ను వేసి జనాన్ని పిండుతోంది. కానీ... గుప్పెడు మంది అధికారులు, వారి వెనుక ఒక ప్రజాప్రతినిధి, కలిసి రాష్ట్ర ఖజానాకు రావాల్సిన వందల కోట్లు నొక్కేస్తున్నారంటే నమ్ముతారా? సారథి డమ్మీగా మారిన వాణిజ్య పన్నుల శాఖను ఆ ఐదారుగురు అధికారులే నడిపిస్తున్నారంటే నమ్మగలరా? జీఎస్టీ, పాత వ్యాట్ పేరుతో వాణిజ్యపన్నుల శాఖలో సాగుతున్న పన్ను ఎగవేతల తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనాలు... నేటి నుంచి!
ఒకే ఒక్కడు..
వాణిజ్య పన్నుల శాఖలోని కీలక వ్యవస్థలను ఒకే ఒక అధికారికి అప్పగించారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్థిక శాఖలోని ఓ కీలక అధికారి సహకారంతో ఆయన నిర్ణయాత్మక శక్తిలా మారారు. వ్యాపార సంస్థల నుంచి వచ్చే అప్పీళ్లు, రివిజన్, పన్నుల మదింపు, మినహాయింపుల విభాగాలపై నిర్ణయం ఆయనదే. తెరవెనుక చక్రం తిప్పేది మాత్రం మరికొందరు అధికారులు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘ఒక దేశం... ఒకే పన్ను’ పేరుతో కేంద్రం జీఎస్టీ ప్రవేశపెట్టింది! ఇంకేముంది... పన్ను ఎగవేతలకు అన్ని దారులూ మూసుకుపోయాయని అంతా అనుకుంటున్నారు. ప్రతినెలా వస్తున్న జీఎస్టీ వసూళ్ల లెక్కను చూసి ‘ఆదాయం, ఆర్థికం పెరుగుతోంది’ అని భావిస్తున్నారు. కానీ... ఇదంతా ఉత్తిదే! ‘పకడ్బందీ’ అనుకుంటున్న జీఎస్టీ వ్యవస్థకు సైతం తూట్లు పొడుస్తున్నారు. అదెవరో కాదు! రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో కీలకంగా ఉండి, ప్రభుత్వ ఆదాయం పెంచాల్సిన వాళ్లే! చట్టాన్ని తుంగలో తొక్కుతూ, చట్టంలోని లొసుగులు ఉపయోగించుకుంటూ ఎంచక్కా పన్ను ఎగవేతకు సహకరిస్తున్నారు. ఖజానాకు గండి కొడుతూ... సొంత జేబులు నింపుకొంటున్నారు. అంతా ఇంతా కాదు... వందల కోట్లలో! ఇది... నమ్మలేని నిజం! రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంలో 90 శాతం వాణిజ్య పన్నుల శాఖే వసూలు చేస్తుంది. ‘పన్ను’ ఉన్న ప్రతి చోటా... ఎగవేతా ఉంటుంది. ఎగవేతకు ఆస్కారం లేకుండా పన్నులు వసూలు చేయాల్సిన కొందరు అధికారులే ఇక్కడ స్కామ్‌కు సూత్రధారులు. పలు నిబంధనలను, చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని పన్ను ఎగవేయాలనుకుంటున్న వారికి ఈ అధికార అక్రమార్కులే ‘దారి’ చూపుతున్నారు. 2017 జూన్‌తో ముగిసిన ‘వ్యాట్’ కింద వేసిన పన్నులపై ఆరేళ్లపాటు రివ్యూలు జరిపే అవకాశముంది. కేవలం ఈ రివ్యూలు, ‘అప్పిలేట్’ మాయలో... మూడేళ్లలో వివిధ రూపాల్లో రూ.600 కోట్లు బొక్కినట్లు అంచనా. ఇందులో ఒక కీలక అధికారి పాత్రే ముఖ్యం! రాష్ట్రంలో ఐఏఎ్‌సలే లేనట్లు, వాణిజ్య పన్నుల శాఖలో ఇంక అధికారులే లేనట్లు... అనేక కీలక విభాగాలు ఆయనకే అప్పగించారు. పన్ను రివిజన్, ఆడిట్, అప్పిలేట్ వంటి ముఖ్యమైన అంశాలను ‘డీల్’ చేస్తున్న ఆ అధికారికి ఒక బలమైన ప్రజాప్రతినిధి దన్నుగా నిలిచారు. మరో ఇద్దరు ముగ్గురితో కలిసి చక్రం తిప్పుతూ... కేవలం ‘వ్యాట్ నుంచి మినహాయింపు’ అనే ఒకేఒక్క అంశం ఆధారంగా కోట్లు నొక్కేస్తున్నట్లు సమాచారం.
ఇది ఇలా సాధ్యమైంది?
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ప్రధాన విధి పన్ను వసూలు చేయడమే. ‘వ్యాట్’ ఉండగా వారి పాత్ర మరీ కీలకం. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సర్కిల్ స్థాయిలో ప్రతి ఏటా వ్యాపారులు, వ్యాపార సంస్థల లావాదేవీలను మదింపు చేసి కొన్ని వేల అసె్‌సమెంట్‌లు, ఆడిట్‌లు చేసి వందల కోట్ల రూపాయల పన్నులు విధిస్తారు. వీటిని వ్యాపారులు చెల్లించాలి. ఒక వేళ డిమాండ్ నోటీసుపై అభ్యంతరం ఉంటే వ్యాపారులు వాణిజ్య పన్నుల శాఖలోని అప్పీలేట్ అథారిటీ వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. ‘వ్యాట్’ చట్టం కింద తమకు ఇచ్చిన నోటీసులో అధిక పన్ను చూపారని, దీని పునఃపరిశీలించాలని వ్యాపారులు కోరవచ్చు. అయితే... ఇలా అప్పీలు చేయాలంటే నోటీసు ఇచ్చిన పన్నులో 12.5 శాతం ఫీజుగా చెల్లించాలి. అక్కడ వారికి అనుకూలమైన ఆదేశాలు రాకపోతే... మరో అప్పీలుకు వెళ్లవచ్చు. అప్పుడు పన్ను మొత్తంలో 25 శాతం చెల్లించాలి. ఈ చెల్లింపుల దగ్గరే గోల్‌మాల్ జరుగుతోంది. పన్ను నోటీసును నిబంధనల ప్రకారం పరిశీలించకుండానే ఒక అధికారి ‘స్టే’ ఇస్తున్నారు. అంటే, ఆ పన్ను వసూలు కాదు. ‘అప్పీలు’ కోసం కట్టాల్సిన పన్ను వాటా కట్టాల్సిన అవసరమూ లేదు. ఇదో పెద్ద స్కీమ్... స్కామ్!
దొడ్డిదారిలో ‘విన్నపం’
వాణిజ్య పన్నుల శాఖలో అనేక కీలక విభాగాలను గుప్పిట పట్టుకున్న అధికారి... ‘అప్పీళ్ల’కు ఒక దొడ్డిదారి ఏర్పాటు చేశారు. అంటే...వ్యాపారులు పన్ను నోటీసుపై సంబంధిత నిబంధన ప్రకారం అప్పీలుకు వెళ్లరు. ఎందుకంటే... అలా వెళితే 25 శాతం పన్ను కట్టాల్సి వస్తుంది! అందుకే... పన్ను నోటీసులో సాంకేతికమైన లోపాలు ఉన్నాయనో, మరో కారణమో చూపించి దానిని పరిశీలించాలని ఒక దరఖాస్తు సమర్పిస్తారు. దీనికోసం ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరంలేదు. ముందుగా కుదుర్చుకున్న ‘ఒప్పందం’ ప్రకారం... సదరు అధికారి పన్ను నోటీసుపై ‘స్టే’ ఇప్పించేస్తారు. అంతే... అది అంతటితో ఆగిపోతుంది. ఇలా అడ్డగోలుగా ఇచ్చిన ‘స్టే’ ఉత్తర్వులవల్ల గత రెండేళ్లలో 220 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు ఆగిపోయాయి. అప్పీలేట్ అథారిటీతో సంబంధం లేకుండా అడ్డగోలుగా స్టే ఉత్తర్వులు ఇవ్వడం వల్ల సర్కారుకు నికరంగా 56 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వ్యాట్ చట్టం ప్రకారం ఇలా స్టే ఇచ్చేందుకు తన అధికార పరిధి అనుమతించనప్పటికీ... పదులకొద్దీ ‘స్టే’ ఉత్తర్వులు ఇప్పిస్తున్నారు. దీనిని పట్టించుకోవాల్సిన ఇతరులూ ‘సిండికేట్’లో ముక్కలే కావడంతో అంతా గప్‌చుప్! వెరసి... ఒక్క అధికారి రాష్ట్ర ఖజానాకు రూ.276 కోట్లు గండి కొట్టారు. అందులో... ఆయన వాటా ఎంతో! ఆయన వెనుక ఉన్న కీలక ప్రజాప్రతినిధికి చేరింది ఎంతో! మిగిలిన ‘బ్యాచ్’ పంచుకున్నది ఎంతో!
ముందూ వెనుకా చూడకుండా...
పన్ను విధింపు ఉత్తర్వుపై ‘స్టే’ కోరేందుకు బలమైన కారణాలు చూపించాలి. కానీ... సాధారణ వినతినే అప్పీల్‌గా పరిగణించి కీలక కేసుల్లో పరిష్కారం చూపిస్తున్నట్లు తెలిసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి గత ఏడాది జూలై 31 వరకు 140 దరఖాస్తులను ఈ పద్ధతిలోనే ఆమోదించినట్లు సమాచారం. ఈ బాగోతం బయటపడకుండా ఉండేందుకు వాణిజ్యపన్నుల శాఖ వెబ్‌సైట్ నుంచి ఆ ఉత్తర్వులను తాజాగా తొలగించడం కొసమెరుపు! ముఖ్యమైన వారంతా ముఠాగా మారడంతో వాణిజ్యపన్నులశాఖలో అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. ‘ఆదాయార్జన శాఖల’పై ముఖ్యమంత్రి జగన్ తూతూమంత్రంగానే సమీక్షలు జరుపుతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి ఎక్కడ, ఎలా గండి పడుతోందో పట్టించుకునే దిక్కులేదు. దీంతో గోల్‌మాల్ అప్రతిహతంగా సాగుతోంది.