వైసీపీ సర్కారు ఘోరంగా విఫలం

ABN , First Publish Date - 2023-02-02T03:10:40+05:30 IST

పార్లమెంటులో 31 మంది ఎంపీలు ఉన్న వైసీపీ రాష్ట్రానికి ఏం తెచ్చింది? విభజన హామీల అమలుకు కేంద్రంలో ఇదే చివరి బడ్జెట్‌.

వైసీపీ సర్కారు ఘోరంగా విఫలం

విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్‌

31 మంది ఎంపీలు... రాష్ట్రానికి ఏం తెచ్చారు?

బడ్జెట్‌ రాష్ట్రానికి నిరుత్సాహం... దేశానికి సంతోషం: చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘పార్లమెంటులో 31 మంది ఎంపీలు ఉన్న వైసీపీ రాష్ట్రానికి ఏం తెచ్చింది? విభజన హామీల అమలుకు కేంద్రంలో ఇదే చివరి బడ్జెట్‌. ఈ బడ్జెట్‌లో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిధులు, నిర్ణయాలు ఉండేలా సాధించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై బుధవారం ఆయన స్పందించారు. ‘‘మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. కర్ణాటకలో కరువు ప్రాంతాల కోసం బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. దానిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు తెచ్చుకోలేకపోయారు. విభజన హామీల అమలుపై నిర్ణయాలు ఏవీలేవు. వీటి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్‌రెడ్డి, వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలం అయ్యారు. సొంత కేసులు, స్వప్రయోజనాలపై మాత్రమే వారికి ఆసక్తి ఉందని మరోసారి రుజువైంది’’ అని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌ జాతీయ స్థాయిలో సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం కింద రూ.13 లక్షల కోట్లు కేటాయించడం సానుకూల పరిణామం. 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాలను రూపొందించడానికి ఆలోచనలు చేయడం స్వాగతించదగ్గ అంశం. విజన్‌- 2047 ద్వారా మన దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో మాక్రో, మైక్రో స్థాయి ప్రణాళికలు రూపొందించుకుంటే ఈ లక్ష్యం అందుకోవచ్చు. రైతులకు ప్రోత్సాహకంగా రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస యోజన పథకం కింద పేదల గృహ నిర్మాణం కోసం రూ.79 వేల కోట్లు, ఆక్వా రంగానికి రూ.6వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఎస్‌ఎంఏఈలకు వడ్డీ శాత ం తగ్గించి వాటి రుణాలకు రూ.రెండు లక్షల కోట్లు కేటాయించడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు ఉద్యోగులకు ఊరట కల్పిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపొందించామన్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, ఆ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఆర్థిక అసమానతలను రూపుమాపాలని చంద్రబాబు కోరారు.

రాష్ట్రం అవసరాలు పట్టడం లేదు: టీడీపీ

సీఎం జగన్‌రెడ్డికి ఢిల్లీలో తన కేసుల గోల తప్ప రాష్ట్ర అవసరాలు పట్టడం లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయారని, ఆయన వైఫల్యానికి అది మచ్చుతునకలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ మేరకు టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తదితరులు వివరణాత్మక ప్రకటనలు విడుదల చేశారు.

బడ్జెట్‌లో అన్యాయానికి జగన్‌ బాధ్యత

వహించాలి: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

‘‘రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ నిరాశజనకంగా ఉంది. దీనికి సీఎం జగన్‌ పూర్తి బాధ్యత వహించాలి’’ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు స్పష్టంచేశారు. విభజన చట్టం అమలైన నాటి నుంచి 10 ఏళ్లలో హామీలు అమలు చేయాలని, కానీ కేంద్రం మాత్రం బడ్జెట్‌లో వాటి ప్రస్తావనను చేర్చలేదని చెప్పారు. జగన్‌ పిరికివాడని, ఢిల్లీ వచ్చి సీబీఐ, ఈడీ కేసుల మాఫీ గురించి మాట్లాడుకోవడం, అప్పుల మీద అప్పులు తెచ్చుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కనాడు మాట్లాడలేదని ఆరోపించారు. వైసీపీ మునిగిపోయే పడవలా తయారైందని రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Updated Date - 2023-02-02T03:10:41+05:30 IST