నేటి వరకే ‘స్కిల్’ నిందితుల ఈడీ కస్టడీ
ABN , First Publish Date - 2023-03-18T06:37:43+05:30 IST
ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీ కాలపరిధికి మించి ఈడీ కస్టడీకి ఇస్తూ విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది.

జ్యుడీషియల్ కాలపరిధికి మించి వీల్లేదు: హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీ కాలపరిధికి మించి ఈడీ కస్టడీకి ఇస్తూ విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది. పిటిషనర్ల జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 18తో ముగుస్తున్న నేపథ్యంలో ఈడీ కస్టడీ సైతం ఆ రోజుతోనే ముగుస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 13న ఇచ్చిన ఉత్తర్వులను పాక్షికంగా కొట్టివేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈడీ అధికారులు రాత్రివేళల్లో నిందితులను విచారించారన్న ఆరోపణలపై తర్వాత విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆదేశాలిచ్చారు. స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారంటూ సీమెన్స్ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, స్కిల్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టెడ్ అకౌంటెంట్ సురేశ్ గోయల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిని విచారణ నిమిత్తం ఈ నెల 14 నుంచి 20 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఈ నెల 13న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. జ్యుడీషియల్ రిమాండ్ 18తో ముగుస్తుంటే, 20 వరకు కస్టడీకి ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈడీ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపించారు.