బటన నొక్కి.. బాగుచేయండి
ABN , First Publish Date - 2023-11-20T00:28:35+05:30 IST
గోతులు.. గుంతలు.. తప్ప దారులు కనిపించని రోడ్లకు కూడా బటన నొక్కి బాగు చేయండి.. అంటూ రెండో రోజు ఆదివారం జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు నిరసన తెలిపాయి. ఉమ్మడి పోరాట కార్యాచరణలో భాగంగా ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది’ పేరుతో నిరసన చేపట్టారు.

గుంతల రోడ్లపై రెండో రోజు నిరసనలు
గోతులు చూపుతూ రోడ్లపై పాదయాత్రలు
ఉమ్మడిగా టీడీపీ, జనసేన నాయకుల ఆందోళన
అసమర్థ పాలనకు రోడ్లే నిదర్శనమంటూ నినాదాలు
గోతులు.. గుంతలు.. తప్ప దారులు కనిపించని రోడ్లకు కూడా బటన నొక్కి బాగు చేయండి.. అంటూ రెండో రోజు ఆదివారం జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు నిరసన తెలిపాయి. ఉమ్మడి పోరాట కార్యాచరణలో భాగంగా ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది’ పేరుతో నిరసన చేపట్టారు. ధ్వంసమైన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, రహదారులు మృత్యు మార్గాలుగా మారినా పాలకుల్లో చలనం లేదంటూ ఇరు పార్టీ నేతలు గుంతల వద్ద బైఠాయించి నిరసనలు తెలిపారు. అసమర్ధ పాలన సాగుతుందని అందుకు రోడ్లు దుస్థితే నిదర్శనమంటూ నేతలు మండిపడ్డారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాలుగునరేళ్ల కాలంలో గుంతల రోడ్లకు తట్టెడు మట్టి కూడా వేయలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిచి రోడ్లు బాగు చేయాలని లేనిపక్షంలో ఆందోనలు ఉధృతం చేస్తామని టీడీపీ, వైసీపీ నేతలు హెచ్చరించారు.
గుంటూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాలుగున్నేరళ్ల పాలనలో రహదారుల గురించి పట్టించుకోలేదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎందరో మృతి చెందారని, పలువురు క్షతగాత్రులుగా మారారని టీడీపీ, జనసేన ఉమ్మడి పోరులో భాగంగా ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాయకులు నిరసనలు తెలిపారు. రోడ్లపై గుంతలు తప్ప దారులు కనిపించడం లేదంటూ వాటిని చూపుతూ నేతలు ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప ప్రస్తుత పాలకులు మరమ్మతులను కూడా గాలికొదిలేయడంతో వాహన చోదకుల ఇక్కట్లు అన్నీఇన్నీ కాకుండా పోయాయన్నారు. చేసిన పనులకు బిల్లులను పెండింగ్‌లో ఉంచడంతో కాంట్రాక్టర్లు ముఖం చాటేయడంతో రోడ్ల మరమ్మతుల టెండర్లకు కనీస స్పందన లేకుండా పోయిందన్నారు. రహదారుల దుస్థితిని చూసిన ప్రజలు జగన వద్దు బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క రోడ్డు కూడా వేయని ఘనత సీఎం జగనకే దక్కిందని విమర్శించారు.
పిట్టలవానిపాలెం మండలం చందోలు నుంచి పొన్నూరు వెళ్లేదారిలో రహదారి అవస్థలను చూపెడుతూ బాపట్ల టీడీపీ ఇనచార్జి వేగేశన నరేంద్రవర్మ జనసైనికలతో కలిసి నిరసన తెలిపారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం - ఇలపావులూరు రోడ్డులోని కొటికలపూడి వద్ద టీడీపీ, జనసేన శ్రేణులు నిరసన చేపట్టారు. పర్చూరు పరిధిలోని ఇంకొల్లు రోడ్డులో టీడీపీ, జనసేన శ్రేణులు ఉమ్మడిగా నిరసన తెలిపారు. రేపల్లె-గుడ్డికాయలంక, చెరుకుపల్లిలో రోడ్ల ఇక్కట్లపై ఉమ్మడిగా నిరసన కార్యక్రమం నిర్వహించాయి కొల్లూరు మండలం రావికంపాడు, బొద్దులూరుపాడు, పెసర్లంక, పోతార్లంక వెళ్ళే రహదారులు అధ్వానస్థితిపై టీడీపీ, జనసేన నాయకులు నిరసన తెలిపారు. రేపల్లె మండలం మోర్తోట నుంచి రాజుకాల్వ రహదారి, నిజాంపట్నం మండలం మంత్రిపాలెం-అడవులదీవి రహదారి, నగరం మండలంలో నిరసన తెలిపారు.
చిలకలూరిపేట మండలం మద్దిరాల-గోపాలంవారిపాలెం రహదారిపై నిరసన కార్యక్రమం జరిగింది. మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నేత తోట రాజారమేష్ 2 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. నమ్మి ఓటేసిన పాపానికి కనీసం రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లలేని దారుణ పరిస్థితిని మంత్రి రజిని తెచ్చారన్నారు. సీఎం కేసీఆర్ కూడా రోడ్లపై అవహేళన చేస్తుంటే జగన్‌కు కనీసం సిగ్గు అనిపించడం లేదన్నారు. యడ్లపాడు మండలం బోయపాలెం-కొండవీడు మార్గంలో భారీ గుంతలో స్కూటీ పడి దానిపై ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారని తెలిసి టీడీపీ, జనసేన నాయకులు గుంతలు పూడ్చాలని ప్లకార్డులు ప్రదరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. క్రోసూరు మండలం దొడ్లేరు-హసానాబాద్ రహదారిలో నిరసన తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రోడ్లన్నీ ధ్వంసమైన ప్రతి రోజు రోడ్ల ప్రమాదాలు నిత్యకృత్యం అయినా ప్రజప్రతినిధులకు గాని, అధికారులకాని పట్టడం లేదని విమర్శించారు. అమరావతి-బెల్లంకొండ డబుల్ రోడ్డు నిర్మాణానికి టీడీపీ హయాంలో నిఽధులు మంజూరైతే దానిని తాము నిర్మిస్తున్నాట్లు చెప్పుకుంటున్నారని ఏద్దేవా చేశారు. దాచేపల్లి మండలం ముత్యాలంపాడు - తంగెడ గ్రామాల మధ్య గోతులను పూడ్చలేని ప్రభుత్వం అభివృద్ధి చేశామంటూ ప్రజలను మోసం చేస్తుందంటూ టీడీపీ, జనసేన నాయకులు పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. మాచర్ల మండలం కొత్తపల్లిలో, గురజాల పట్టణంలో, మాచవరం - మల్లవోలు గ్రామాల మధ్య గుంతల రోడ్డుపై టీడీపీ, జనసేన నేతలు నిరసన తెలిపారు.
గుంటూరులోని పొన్నూరు రోడ్డు వాటర్ ట్యాంకుల సమీపంలో రోడ్డుపై బైఠాయించి టీడీపీ, జనసేన నాయకులు నిరసన తెలిపారు. తెనాలి మండలం కొలకలూరులో గుంతల మయంగా మారి ప్రమాదకరంగా ఉన్న తెనాలి వయా నందివెలుగు - గుటూరు రోడ్డుపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపారు. కొల్లిపర మండలం అత్తోట, చివలూరు రోడ్డు దుస్థితిని తెలియజేస్తూ టీడీపీ, జనసేన నాయకులు నిరసన తెలిపారు. ప్రత్తిపాడు నుంచి కోండ్రుపాడు మీదగా జాతీయ రహదారిని కలిపే రోడ్డుపై ఉన్న గుంతల వద్ద ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి బీ రామాంజనేయలు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు నిరసన తెలిపాయి. అంతకముందు నిమ్మగడ్డవారిపాలెం సెంటర్ నుంచి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు.