నేటి నుంచి .. టీడీపీ బస్సు యాత్ర

ABN , First Publish Date - 2023-06-26T00:46:15+05:30 IST

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం చేపట్టిన బస్సు యాత్ర పలనాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభం అవుతోంది.

నేటి నుంచి .. టీడీపీ బస్సు యాత్ర

నరసరావుపేట, జూన్‌ 25 : భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం చేపట్టిన బస్సు యాత్ర పలనాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభం అవుతోంది. ఎక్కుమంది ప్రజలను కలిసేలా యాత్రను రూపొందించారు. క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపేలా అన్నింటికీ మించి చంద్రబాబు ప్రకటించిన తొలి మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం చేయనున్నారు. తెలుగేదేశం అధికారంలోకి వస్తే అమలు చేసే మేనిఫెస్టోలోని ఆరు అంశాలను పూర్తిగా వివరించి ప్రజలను చైతన్య పరిచే దిశగా యాత్ర సాగనున్నది. మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.

జిల్లాలోని అన్ని నియోజవర్గాలను కలుపుకు వెళ్ళేలా బస్సు యాత్ర సాగనుంది. తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రగతి పనులు నిలిచిపోయిన వాటి దగ్గర సెల్ఫీ ఛాలెంజ్‌ విసురుతూ, స్ధానిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి రోజూ సాయంత్రం ఒక గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేస్తారు. రచ్చబండకు సమీప గ్రామాల ప్రజలను అహ్వానిస్తారు. రచ్చబండ నిర్వహించే గ్రామంలోనే నేతలు రాత్రికి బసచేస్తారు. ప్రజలతో మమేకమై వారి మనోభావాలు తెలుసుకుంటారు

సూపర్‌ సిక్స్‌లో భాగంగా రానున్న ఐదు ఎళ్లలో రూ 6 లక్షల మేర ప్రతి ఇంటికి ఆదాయం ఎలా సమకూరుతుందో ప్రజలకు వివరిస్తారు. ప్రతి ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నా 18 నుంచి 59 ఏళ్ల లోపు వారికి ఒక్కొక్కరికి నెలకు రూ 1500, చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ 15 వేలు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, ఆర్టీసీ బస్లుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తారు. బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి తాగునీరు, పేదలను ధనికులగా మార్చటం, యువగళం నిధి కింద నిరుద్యోగ యువకులకు నెలకు రూ 3000, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, అన్నదాతకు ఏడాకి రూ 20 వేలు అందించనున్నట్లు ప్రజలను చైతన్య పరుస్తారు. వీటిలో పాటు తెలుగుదేశం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల అమలు, స్థానికంగా ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమ మైనింగ్‌, అక్రమ కేసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తారు. యాత్రకు సంబంధించి పూర్తి ప్రణాళికను రూపొందించారు.

నరసరావుపేట నియోజకవర్గంలో యాత్ర ఇలా...

నరసరావుపేట జేఎన్‌టీయూ కళాశాల కాకాని వద్ద నుంచి బస్సు యాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. పెట్లూరివారి పాలెం, కోటప్పకొండ, యలమందల గ్రామాల మీదుగా పట్టణానికి చేరుతుంది. అక్కడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. లింగంగుంట్ల, స్టేషన్‌ రోడ్డు సత్తెనపల్లి రోడ్డు, ఇస్సపాలెం గ్రామం మీదుగా ములకలూరు చేరుకుంటుంది. ఇస్సపాలెం మహాకాళీ అమ్మవారి అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్ర రచ్చబండ నిర్వహిస్తారు. అనంతరం ఇస్సపాలెంలో నేతలు రాత్రికి బస చేస్తారు.

బస్సు యాత్రను విజయవంతం చేయండి

జిల్లాలో జరగనున్న తెలుగుదేశం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆదివారం విజ్ఞప్తి చేశారు. యాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని యాత్రను విజయవంతంచేయాలని పిలుపు నిచ్చారు. యాత్రలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్వెల్యేలు పాల్గొంటారని తెలిపారు.

రేపు మాచర్ల నియోజకవర్గంలో ...

27న మాచర్ల నియోజకవర్గంలో యాత్ర సాగనుంది. 28న గురజాల, 29న సత్తెనపల్లి, 30న పెదకూరపాడు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. ఇందుకు సంబంధించి అయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2023-06-26T00:46:15+05:30 IST