గంజాయిపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు

ABN , First Publish Date - 2023-02-24T00:46:53+05:30 IST

గంజాయి కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

గంజాయిపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు
మొబైల్‌ ఫోన్లను బాధితులకు అందజేస్తున్న ఎస్పీ వకుల్‌జిందాల్‌

అధికారులకు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరిక

బాపట్ల, ఫిబ్రవరి 23: గంజాయి కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. పోలీసు కార్యాలయంలో గురువారం జరిగిన నేరసమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో గస్తీ వ్యవస్థను పటిష్ఠంగా నిర్వహించాలన్నారు. ఏదైనా ప్రాపర్టీ నేరం జరిగితే ఆ పరిధిలోని బీట్‌ సిబ్బంది, తనిఖీ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. స్పందన పిటిషన్లు, ఫోక్సోకేసులు, గ్రేవ్‌ కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్‌కేసులు, మిస్సింగ్‌ కేసులు, సర్కిల్‌ క్రైమ్‌ పార్టీల పనితీరు, గంజాయి, నాటుసారాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. 112, 100లకు వచ్చే అత్యవసర కాల్స్‌కు తక్షణం స్పందించాలన్నారు. కాల్‌ వచ్చిన సమయం అధికారి సంఘటన స్థలానికి చేరుకున్న సమయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అత్యవసర కాల్స్‌ పట్ల ఆలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ముఖ్యమైన కూడళ్లల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నేరచేదన, లోక్‌అదాలత్‌ కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి ప్రశంసపత్రాలు అందజేశారు.

సెల్‌ఫోన్లను ట్రేస్‌ చేసి ఇచ్చిన పోలీసులు

ఐటికోర్‌ సిబ్బంది సహకారంతో 13 మొబైల్‌ఫోన్లను గుర్తించి వాటిని బాధితులకు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది, పట్టణ సీఐ పి.కృష్ణయ్యలను అభినందించారు. ఫోన్‌ పోతే ఆస్తి నష్టమే కాకుండా అందులో ఉన్న విలువైన సమాచారం కూడా పోతుందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ పి.మహేష్‌, డీఎస్పీలు జి.లక్ష్మయ్య, టి.మురళీ కృష్ణ, ఎ.శ్రీనివాసరావు, ఎవి.రమణ, ఇన్‌స్పెక్టర్లు ఎ.శ్రీనివాస్‌, పి.బాలమురళీకృష్ణ, ఎం.మురళీ కృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-24T00:49:18+05:30 IST