NO Salary: ఆరొచ్చినా అందని జీతం!
ABN , First Publish Date - 2023-02-07T03:00:06+05:30 IST
పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని అడుక్కోవాల్సిన దుస్థితికి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఒకటో తారీఖునే జీతాలు ఇచ్చేలా చూడాలని సీఎస్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌వోల సంఘం నేతలు
రాష్ట్ర సచివాలయంలోనూ అదే అవస్థ
కొన్ని విభాగాలకే అందిన నెల వేతనాలు
సమయానికి రావాలంటున్న ప్రభుత్వం
సమయానికి జీతాలు మాత్రం ఇవ్వదా?
సూటిగా నిలదీస్తున్న ఉద్యోగులు
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని అడుక్కోవాల్సిన దుస్థితికి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ నెల తొలివారం గడిచిపోయినా ఎక్కువమంది ఉద్యోగులకు ఇంకా వేతనం పడలేదు. కొంత మందికి మాత్రం ఒకటో తేదీన వేస్తున్నారు. అక్కడినుంచి విడతల వారీగా పడుతూ.. చివరి ఉద్యోగికి తన వేతనం చేరేసరికి నెల సగం దాటిపోతుంది. సకాలంలో జీతాలు రాక వడ్డీలకు రుణాలు తెస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా అప్పులపాలవుతున్నారు. జీతాలివ్వాలని నిలదీస్తే కేసులు పెడతారేమోనని హడలిపోతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగిని అని భరోసాతో గడిపిన రోజులు గుర్తు తెచ్చుకుని కుమిలిపోతున్నారు. ఇదీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల దుస్థితి! రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6లక్షల మంది ఉద్యోగులు, నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. 1వ తేదీన అందాల్సిన వేతనం కొద్దిమందికే పడగా, ఎక్కువమందికి ఇప్పటికీ ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఏదో ఒకనెల అయితే... భరిస్తాంగానీ ప్రతి నెలా ఇదే తంతా అని ఉద్యోగులు వాపోతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలోనూ జీఏడీ, రెవెన్యూ, హోం, ఫైనాన్స్, ప్లానింగ్ తదితర కొద్ది శాఖల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందగా, మిగిలిన శాఖల ఉద్యోగులకు ఇంకా పడలేదు. ’మా ఇంటి ఓనరు అద్దె డబ్బులు అడిగాడు. నా ఎకౌంట్‌లో రూ. 975 ఉన్నాయి. వేరే వారి దగ్గర తీసుకుని ఇచ్చా. ఇతర అవసరాలకు డబ్బులు లేవు. జీతం పడుతుందని రోజూ బ్యాంకు ఖాతా చెక్ చేస్తూనే ఉన్నాను. ఏందో ఈ ఖర్మ’ అంటూ రాష్ట్ర సచివాలయంలో ఓ ఉద్యోగి వాపోయారు. బ్యాంకుల ఈఎంఐలు, పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, పాల బిల్లు, నీళ్ల బిల్లు, ఇంట్లో సరుకులు... ఇలా ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోందని, మరోవైపు.. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులకు ఈఎంఐలు సకాలంలో కట్టకపోవడంతో బ్యాంకుల్లో చెక్ బౌన్స్ అవుతోందని, సిబిల్ స్కోరు పడిపోతుందని వాపోతున్నారు.
‘ఉద్యోగులు సమయానికి రావాలి. ముఖ ఆధారిత హాజరు యాప్‌లో వేయాలి అంటూ... ఆ యాప్ ఈ యాప్ అంటూ.. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారు. సమయపాలన గురించి మానిటరింగ్ కమిటీలు, నోడల్ ఆఫీసర్లు అంటూ హడావుడి చేస్తూ...పదే పదే సర్క్యులర్లు ఇస్తున్నారు. విధుల గురించి ఉద్యోగులను గట్టిగా నిలదీస్తున్నారు. అది చేయలేదు....ఇది చేయలేదంటూ చిన్న చిన్న కారణాలతో ఉద్యోగులను సస్పెండ్లు చేస్తున్నారు. ఇంత హడావుడి చేసేటప్పుడు..సమయానికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియదా?’ అని ఓ ఉద్యోగి సూటిగా ప్రశ్నించారు.
సీఎ్‌సను కలిసిన బండి శ్రీనివాసరావు
జీతాలందకపోవడంతో ఇబ్బందిగా ఉందని, పాలవాళ్ల నుంచి అప్పులు ఇచ్చిన బ్యాంకుల నుంచి పెరుగుతోందని సీఎస్ జవహర్‌రెడ్డికి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. వెంటనే వేతనాలు పడేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడారు. వేతనాల కింద ఇప్పటికే రూ. 2 వేల కోట్లు చెల్లించామని, మరో రూ.4వేల కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎస్ తెలిపినట్టు బండి వెల్లడించారు. ఆర్థికశాఖ కార్యదర్శిని పిలిచి సాధ్యమైనంత త్వరగా వాటినీ చెల్లించేలా చూస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
తక్షణమే చెల్లించాలి: ఏపీటీఎఫ్
సకాలంలో జీతాలు రాకపోతే జీవనం ఎలా కొనసాగించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు ప్రశ్నించారు. ‘‘మూడున్నరేళ్లుగా ఏ నెలలోనూ సక్రమంగా జీతాలు పడకపోవడంతో బ్యాంకుల్లో ఈఎంఐలు సరిగా చెల్లించలేకపోతున్నాం. మరోవైపు ఆదా య పన్ను చెల్లించాలని నోటీసులు అందుతున్నాయి. ఫిబ్రవరిలో 50 శాతం, మార్చి నెలలో మరో 50 శాతం చొప్పున ఆదాయ పన్ను చెల్లిస్తామని, జీతాల్లో మినహాయించుకోవాలని పాఠశాలల హెచ్‌ఎంలు, కార్యాలయాల అధికారులను ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరే పరిస్థితి వచ్చింది’’ అని హృదయరాజు తెలిపారు.
మానసిక క్షోభ అనుభవిస్తున్నాం
6వ తేదీ వచ్చినా ఇంకా రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులందరికీ జీతాలు అందలేదని, సకాలంలో జీతాలు ఇప్పించాలంటూ సచివాలయ ఎస్‌వోల సంఘం సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ‘‘ప్రతి నెలా ఉద్యోగులకు కమిట్‌మెంట్లు ఉంటాయి. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో బ్యాంకు ల్లో ఈఎంఐలు కట్టడానికి, పిల్లల ఫీజులు చెల్లించడానికి, ఇతర అవసరాలకు ఇబ్బందులు పడుతున్నాం. వైద్య అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. వేతనాల సమస్య సుదీర్ఘకాలంగా కొనసాగడం వల్ల మాలో చాలామంది ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతూ.. విధులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు’’ అని ఆ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ఆర్థిక శాఖ కార్యదర్శిని కలవడానికి ప్రయత్నించగా, ఆయన లేకపోవడంతో ఆ శాఖలో అధికారులకు వినతిపత్రం అందించారు.