వేతనాలు.. నామమాత్రం!

ABN , First Publish Date - 2023-03-02T00:00:57+05:30 IST

ఒకటో తేదీ వేతనం అనే ఉద్యోగుల కల అతికొద్ది మందికి సాకారమైంది. వేళ్లమీద లెక్కించే అతికొద్ది మందికి బుధవారం వేతనాలు పడ్డాయి. ఒకటో తేదీ ఉదయం నుంచి ఉద్యోగులకు వేతనాలు పడుతున్నాయంటూ పెద్దఎత్తున హడావుడి జరిగింది కానీ తొలిరోజు అతికొద్ది మందికే వేతనం అందిందని సాయంత్రానికి గానీ ఉద్యోగులకు తెలియలేదు.

వేతనాలు.. నామమాత్రం!

నెల మొదలు కాగానే ఉద్యోగుల్లో వేతనాల టెన్షన్‌ మొదలవుతోంది. ఎప్పుడు జీతాలు పడతాయా.. అని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల ఒకటో తేదీనే వేతనాలు జమయ్యాయంటూ హడావుడి జరిగింది. నామమాత్రంగా కొద్దిమందికి వేసి తొలిరోజే వేతనాలు పడుతున్నాయన్న ప్రకటనలతో ఉద్యోగులను పక్కదారి పట్టించేలా ప్రభుత్వమే ఇలాంటి ప్రచారానికి ఒడిగడుతోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

గుంటూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఒకటో తేదీ వేతనం అనే ఉద్యోగుల కల అతికొద్ది మందికి సాకారమైంది. వేళ్లమీద లెక్కించే అతికొద్ది మందికి బుధవారం వేతనాలు పడ్డాయి. ఒకటో తేదీ ఉదయం నుంచి ఉద్యోగులకు వేతనాలు పడుతున్నాయంటూ పెద్దఎత్తున హడావుడి జరిగింది కానీ తొలిరోజు అతికొద్ది మందికే వేతనం అందిందని సాయంత్రానికి గానీ ఉద్యోగులకు తెలియలేదు. అదే ఇప్పుడు ఉద్యోగుల్లో కలవరం రేపుతోంది. సరిగ్గా రెండు నెలల క్రితం జనవరిలో కూడా ఇలానే జరింది. కొత్త ఏడాది ఒకటో తేదీన వేతనాలు పడుతుండడంతో తమ తలరాత మారిందని ఉద్యోగులు ఆనంద పడ్డారు. ఆ ఆనందం అదేరోజు సాయంత్రానికి ఆవిరైంది. ఆ నెలలో 20వ తేదీ వచ్చే వరకూ ఉద్యోగుల్లో చాలామంది వేనతాలను కళ్లజూడలేకపోయారు. ఇప్పుడు సగటు ఉద్యోగిని అదే భయం వెంటాడుతోంది.

వేతనాలపై అంతా హడావుడే!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 50వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 10 శాతం మందికి కూడా తొలిరోజు వేతనాలు పడలేదని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే ఒకటో తేదీ ఉదయం 11 గంటల నుంచే వేతనాలు పడుతున్నట్లు జిల్లావ్యాప్తంగా ప్రచారం సాగింది. రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగుల్లో కొందరికి వేతనాలు పడినట్లు సమాచారం వచ్చింది. కాకుమానులో మండల పరిషత్‌ ఉపాధ్యాయులు, మంగళగిరిలో హైస్కూలు ఉపాధ్యాయులు, మరికొన్ని చోట్ల జెడ్పీ ఉపాధ్యాయులకు వేతనాలు పడ్డాయి. నరసరావుపేటలో కొంతమంది పెన్షనర్లకు వేతనాలు పడ్డాయి. కాగా జనవరిలో ఒకటో తేదీనే వేతనాలు పొందిన సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఈసారి ప్రభుత్వం షాకిచ్చింది. మూడు జిల్లాల్లో ఉన్న 13,770 మంది సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లకు కూడా తొలిరోజు గౌరవ వేతనాలు అందకపోవడం విశేషం.

మెసేజిలపై పెన్షనర్ల అనుమానాలు

ఉద్యోగుల వేతనాలతోపాటే తొలిరోజు విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్‌ కూడా పడుతోందన్న వార్త కూడా బుధవారం ఉదయం నుంచే హల్‌చల్‌ చేసింది. పెన్షనర్ల వాట్సాప్‌ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ జిల్లాలో పెన్షనర్ల అసోసియేషన్‌ పెద్దల్లో ఏ ఒక్కరికీ బుధవారం సాయంత్రం పెన్షన్లు పడలేదు. పెన్షన్లు పడ్డాయా.. లేదా అని ఆరా తీయగా.. ఎవరికి వారే తమకు పెన్షన్‌ రాలేదని చెప్పడంతో వాళ్లు అవాక్కయ్యారు. గ్రూపుల్లో, సామాజిక మాద్యమాల్లో ఫేక్‌ వ్యక్తులు ఎవరైనా చేరి ఇలా ప్రచారం చేస్తున్నారా అనే అంశంపై వారు ఆరా తీస్తున్నారు. కాగా బుధవారం సాయంత్రానికి నరసరావుపేట, విజయవాడ, రాజమహేంద్రవరంలో పదుల సంఖ్యలో పెన్షనర్లకు పెన్షన్‌ పడినట్లు తేలిందని అసోసియేషన్‌ పెద్దలు చెబుతున్నారు.

ఒత్తిడిని తగ్గించుకోవడానికేనా?

వేతనాల విషయంలో ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. వేతనాలు సకాలంలో రాకపోవడంతో ఉద్యోగులు లోన్‌యాప్‌ల బారినపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగానే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉద్యమ కార్యచరణ నోటీసులు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఒత్తిడి తగ్గించుకోవడానికే ప్రభుత్వం ఇలా హడావుడి చేస్తోందని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నామమాత్రంగా కొద్దిమందికి వేసి తొలిరోజే వేతనాలు పడుతున్నాయన్న ప్రకటనలతో ఉద్యోగులను పక్కదారి పట్టించేలా ప్రభుత్వమే ఇలాంటి ప్రచారానికి ఒడిగడుతోందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగులకు వేతన ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఈనెల సచివాలయ ఉద్యోగులను పక్కనపెట్టి తొలిరోజు ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన ప్రాధాన్యం ఇవ్వడం వారి వాదనలకు బలం చేకూర్చేలా ఉంది.

Updated Date - 2023-03-02T00:00:57+05:30 IST