జీతాల జాడేదీ?

ABN , First Publish Date - 2023-02-07T01:06:46+05:30 IST

వేతన జీవులకు ఈ నెల కూడా జీతాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వారం గడుస్తున్నా కనీసం 10శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు, జీతాలు, పెన్షన్లు అందలేదు.

జీతాల జాడేదీ?

గుంటూరు(విద్య), ఫిబ్రవరి 6: వేతన జీవులకు ఈ నెల కూడా జీతాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వారం గడుస్తున్నా కనీసం 10శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు, జీతాలు, పెన్షన్లు అందలేదు. ఫలితంగా ఈనెల కూడా ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి దాదాపు 26వేల మంది వరకు ఉన్నారు. వీరితో పాటు వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా లెక్కల ప్రకారం వివిధ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లు 20వేల మందికిపైగా ఉన్నారు. వీరికి నెలనెలా ప్రభుత్వం ఇచ్చే జీతం, పెన్షనే ఆధారం. ఉమ్మడి జిల్లాలో ఇంతరకు 10శాతం మందికి కూడా జీతాలు రాని పరిస్థితి నెలకొంది. కొందరు పెన్షనర్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ జీతాల కోసం వాకబు చేస్తున్నారు.

ఇవీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు..

ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే జీతంతో అనేక ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉంటాయి. ప్రధానం కుటుంబంలో నెలవారీ నిర్వహణ ఖర్చులు. ఇంటి అద్దె, విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి. ఈవీఎంల రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. తమతోపాటు ఉన్న పెద్దల వైద్య ఖర్చులు.. ఇలా అనేక రకాల ఖర్చులు జీతాలపై ఆధారపడి ఉంటాయి. ఇక పెన్షనర్లకు వారికి వచ్చే పెన్షనే వైద్య ఖర్చులకు ఆధారం. నెలనెలా కొనుగోలు చేయాల్సిన మందులు కొంతమందికి వేలల్లోనే ఉంటాయి. మరోవైపు నెలవారీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీంతో వారంతా పెన్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ కుబేర్‌లో ఇంకా కేటాయించని బ్యాచ్‌నెంబర్లు

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల కోసం సంబంధిత శాఖలకు ప్రత్యేకంగా ఆర్‌బీఐ ఈకుబేర్‌లో బ్యాచ్‌ నెంబర్లను కేటాయిస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా నెంబర్లు కేటాయిస్తే ప్రభుత్వం వద్ద ఉన్న నగదు నిల్వల ప్రకారం ఆయా శాఖలకు ప్రాధాన్యత ప్రకారం కేటాయింపులు ఉంటాయి. అయితే ఇంకా అనేక శాఖలకు ఈకుబేర్‌లో నెంబర్లు ఇవ్వలేదని జీతాల బిల్లులు తయారుచేసే విశ్రాంత ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో వేతనాలు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు.

జీతాలు చెల్లించకపోవడం బాధాకరం

ఫ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌చాంద్‌బాషా

గుంటూరు(తూర్పు), ఫిబ్రవరి6: ప్రతినెలా జీతాలకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పడిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్‌ కళాశాల ఆవరణలో సంఘ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ జీతాలు ఆలస్యమవ్వడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విధులు విషయంలో కఠిన నియమాల్ని తీసుకొచ్చి పనిచేయించుకుంటున్న ప్రభుత్వానికి జీతాలు ఇవ్వాల్సిన భాద్యత లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘ నాయకులు వై.నాగేశ్వరరావు, కోటా సాహెబ్‌, కరీముల్లా, షాఖాదరి, సీహెచ్‌ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:06:47+05:30 IST