కొండమోడు-పేరేచర్ల రహదారికి మూడు నెలల్లో భూసేకరణ పూర్తిచేస్తాం
ABN , First Publish Date - 2023-02-03T23:52:30+05:30 IST
మేడికొండూరు మండలం పేరేచర్ల నుంచి రాజుపాలెం మండలం కొండమోడు వరకు జరగనున్న నేషనల్ హైవే అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల్లో భూసేకరణ చేస్తామని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాదు అన్నారు.
సత్తెనపల్లి, ఫిబ్రవరి 3: మేడికొండూరు మండలం పేరేచర్ల నుంచి రాజుపాలెం మండలం కొండమోడు వరకు జరగనున్న నేషనల్ హైవే అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల్లో భూసేకరణ చేస్తామని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాదు అన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయం లో తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైవే రోడ్డు నిర్మాణపనుల్లో భాగంగా సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లో రెండు బైపాస్ రోడ్లు వస్తాయన్నారు. సత్తెనపల్లి నుంచి కొండమోడు వరకు మొత్తం 175 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్‌వోలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొత్తం 38కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం ఉంటుందన్నారు. రాబోయే మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ చేస్తామన్నారు. ముందుగా సత్తెనపల్లిలో నుంచి ధూళ్ళిపాళ్ళ మీదుగా వెళ్ళనున్న బైపాస్ రోడ్డు ప్రాంతాన్ని ఆయన స్థానిక తహసీల్దార్ నగేష్, సర్వేయర్లు, వీఆర్‌వోలతో కలసి పరిశీలించారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను కూడా ఆయన ప్రత్యేకంగా పరిశీలించి తహసీల్దార్లకు, సర్వేయర్లకు పూర్తి వివరాలు తెలియ జేశారు.
భూముల పరిశీలన
ఫ ముప్పాళ్ళ: మండలంలోని మాదల, ఇరుకుపాలెం గ్రామాల పరిధిలోని పొలాల నుంచి హైవే వెళ్లనుండటంతో ఈ పొలాలను జాయింటు కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దారు యం.భవానీశంకర్, డీటీ లక్ష్మీప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఫ రాజుపాలెం: మండల పరిధిలోని రెడ్డిగూడెం-కొండమోడు వరకు ఉన్న రహదారిని శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. మండలంలోని అనుపాలెం, రెడ్డిగూడెం, రాజుపాలెం, చౌటపాపాయపాలెం గ్రామాలలోని ప్రధాన రహదారిని పరిశీలించారు. కొండమోడు నుంచి పేరేచర్లవరకు బైపాస్ రోడ్డు ఎంతమేర విస్తరణ జరుగుతుందో తెలుసుకున్నారు. ఎన్‌హెచ్ బృందం సర్వే పూర్తి కాకపోవటంతో ఎంత మేర పట్టాభూమి, ఎంతమేర ప్రభుత్వ భూమి అనే ఆంశాలు తెలియాల్సి వుంది. ఆయన వెంట ఏడీ సర్వే, సతైనపల్లి డీఐ, స్థానిక తహసీల్దార్ నలిని తదితరులు ఉన్నారు.