రైల్వే పార్సిల్ మాయం
ABN , First Publish Date - 2023-05-27T00:47:38+05:30 IST
గుంటూరు రైల్వేస్టేషన్ పార్సిల్ సరికొత్త మోసం జరిగింది. రైల్వే కమర్షియల్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యంతో రూ.10 లక్షలకు పైగా విలువ చేసే పార్సిల్‌ని వేరొకరికి డెలివరీ ఇచ్చేశారు.

గుంటూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వేస్టేషన్ పార్సిల్ సరికొత్త మోసం జరిగింది. రైల్వే కమర్షియల్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యంతో రూ.10 లక్షలకు పైగా విలువ చేసే పార్సిల్‌ని వేరొకరికి డెలివరీ ఇచ్చేశారు. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి రావడంతో రైల్వేలో కలకలం రేకెత్తింది. దీనిపై హెడ్‌క్వార్టర్స్ స్థాయి అధికారులు గుంటూరు పార్సిల్ ఆఫీసుకు వచ్చి విచారణ చేపట్టారంటే మోసం ఎంత తీవ్రతతో స్పష్టమౌతున్నది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన కోకో ప్రైమ్ నేచురల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ గుంటూరులోని డ్రైఫ్రూట్స్ దుకాణాలకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను సరఫరా చేస్టుంటుంది. ఆ సంస్థ ఎండీ రమ్యాబాబు అక్కడి త్రిసూర్ రైల్వేస్టేసన్ నుంచి 11 బస్తాలు గుంటూరులోని వెరైటీ డ్రైఫ్రూట్స్ దుకాణానికి బుకింగ్ చేశారు. అందులో 500 కేజీల బరువైన 10 బస్తాలలో యాలకులున్నాయి. అలానే మరో బ్యాగులో జాజికాయలున్నాయి. వీటి విలువ రూ.10 లక్షల 31 వేల 625గా ఇన్‌వాయిస్ తీశారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఎల్‌ఆర్‌ని ఆ సంస్థ గుంటూరులోని వ్యాపార సంస్థకు ఇవ్వలేదు. ఏదైనా సందర్భంలో రన్నింగ్ రశీదు పోతే అందుకు బదులుగా బాండ్ పేపర్ మీద అన్ని వివరాలు, ఆధారాలు తీసుకుని సంతకాలు చేయించుకుని సిబ్బంది డెలివరీ చేస్తారు. అలాంటిది ఎవరో వ్యక్తి వచ్చి బాండ్ పేపర్ మీద సంతకం చేసి వివరాలు ఇవ్వగానే డెలివరీ చేశారు. కాగా సరుకులు ఎగమతి చేసిన వ్యాపారి గుంటూరులోని వ్యాపారికి ఫోన్ చేసి తనకు నగదు పంపాలని కోరగా అసలు పార్సిల్ రాకుండా ఎలా పంపుతానని ప్రశ్నించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాలక్కాడ్ నుంచి వచ్చిన వ్యాపారి గుంటూరు ఆర్‌పీఎఫ్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు. అసలు పార్సిల్ ఎవరికి డెలివరీ చేశారని సీసీ టీవీ దృశ్యాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకున్నారు. కాగా విధి నిర్వహణల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై రైల్వే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.