రైతన్నకు వాన వెతలు
ABN , First Publish Date - 2023-08-28T02:52:54+05:30 IST
ఖరీఫ్ సీజన్ వచ్చి దాదాపు మూడు నెలలు అవుతోంది. ఈపాటికి సమృద్ధిగా వర్షాలు పడి, పంటలు కళకళలాడుతూ ఉండాలి.
ఖరీ్‌ఫలో వెంటాడుతున్న వర్షాభావం
వర్షాకాలంలో వేసవిని తలపిస్తున్న వైనం
రాష్ట్రవ్యాప్తంగా 22.6ు తక్కువ వర్షపాతం
13 జిల్లాల్లో లోటు.. కొన్నిచోట్ల 40ు పైనే
మాడుతున్న పంటలు.. సాగునీటికీ తిప్పలు
రాయలసీమలో పరిస్థితి మరింత దారుణం
సెప్టెంబర్లోనూ సీమ, దక్షిణ కోస్తాలో వర్షాభావం!
(అమరావతి/విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఖరీఫ్ సీజన్ వచ్చి దాదాపు మూడు నెలలు అవుతోంది. ఈపాటికి సమృద్ధిగా వర్షాలు పడి, పంటలు కళకళలాడుతూ ఉండాలి. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాకాలంలో మండు వేసవిని తలపిస్తోంది. వరుణుడు ముఖం చాటేశాడు. వానలోటు ఎక్కువగా ఉంది. వర్షాధార పంటల సాగు చాలా తగ్గింది. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. దీనికి తోడు కరెంటు కోతలతో మోటార్లు సరిగా పని చేయట్లేదు. ఎత్తు గాలి, ఎండ తీవత్రతో వాతావరణంలో తేమ ఉండట్లేదు. ఈ పరిస్థితుల్లో నీరందక మొక్కలు ఎండిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇక జలాశయాల నుంచి అరకొరగా వదిలే నీరు కాలువల చివరి భూములకు అందట్లేదు. కుంతలు, కాలువల్లో నీటిని ఎత్తిపోయాలంటే ఇంజన్లు పెట్టాల్సి వస్తోంది. నీరు అందుబాటులో లేకపోతే ట్యాంకర్లతో తరలించి పొలాలకు మళ్లించాల్సి వస్తోంది. దీనికి ఖర్చు తడిసిమోపడవుతోంది. ఇంజన్లతో ఎకరం తడపాలంటే 2-3 గంటలు నీరు పెట్టాల్సి వస్తోంది. గంటకు రూ.500 దాకా వసూలు చేస్తున్నారు. ట్యాంకర్ల నీటికి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఖర్చు భరించలేని పేద రైతులు కుంతలు, బోదె కాలువల్లో నీటిని బకెట్లతో తీసుకెళ్లి మొక్కలను తడుపుతున్న పరిస్థితి. వరికి మినహా మిగతా పంటలన్నింటికీ వర్షం చాలా అవసరం. కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవట్లేదు. అక్కడక్కడా చెదురుమదురుగా, ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మెట్ట పంటలకు నీటి తడులు అందక మొక్కలు వాడిపోతున్నాయి. వాన కురవని ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో కొందరు రైతులు తొలకరి పైర్లు పీకేసి, మంచి వర్షాలు పడ్డాక ప్రత్యామ్నాయ పంటలు వేస్తామని చెబుతున్నారు. మరికొందరు రైతులు పంటలను వదిలేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు వివిధ రకాల తెగుళ్లు ఆశిస్తున్నాయి. అన్ని జిల్లాలలో మెట్ట ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాయలసీమలో మరీ దారుణంగా ఉంది. పత్తి, వేరుశనగ, అపరాల పంటలు ఎండుముఖం పట్టాయి. ఈ ఏడాది గోదావరి డెల్టాలోనూ వర్షాలు తక్కువగా పడ్డాయి. ఈ కారణంగా వరినాట్లు మందకోడిగానే సాగుతున్నాయి. మరోవైపు ఉద్యాన పంటలూ నిస్తేజంగా మారాయి.
కరెంటు ఉండదు.. నీరు రాదు
వర్షాలు తక్కువగా పడ్డ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు తగ్గినట్టు రైతులు చెబుతున్నారు. వ్యవసాయానికి పగటి పూట నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వం.. అప్రకటిత కోతలు విధిస్తుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. రైతులు గంటల తరబడి మోటార్ల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. రాయలసీమ, ప్రకాశం, పల్నాడు, పశ్చిమ కృష్ణా ప్రాంతంలో విద్యుత్ కోతలపై రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కృష్ణా, గోదావరి, వంశధార ప్రాజెక్టుల కింద వరి, ఇతర పంటల సాగుకు సరిపడా నీరు రావట్లేదని ఆయా ప్రాంతాల రైతులు మండిపడుతున్నారు. చివరి భూములకు నీరు అందట్లేదని కాలువల పరిధిలోని రైతులు వాపోతున్నారు. సీజన్ ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా ఖరీఫ్ సాగు పుంజుకోలేదు. రైతులు 60 శాతమే పంటలు వేశారు. వరి, పత్తి, వేరుశనగ, అపరాల పంటలు సగానికి సగమే సాగులో ఉన్నాయి. అవి కూడా సరిగ్గా లేవు. మిర్చి సాగుకు అనుకూల వాతావరణం లేక నారుమళ్లు పోసిన రైతులు సందిగ్ధంలో ఉన్నారు.
397 మండలాల్లో వానలోటు
రాష్ట్రవ్యాప్తంగా 22.6ు వర్షపాతం తక్కువగా ఉంది. 13 జిల్లాల్లో వానలోటు తీవ్రంగా ఉంది. 12 జిల్లాల్లో కాస్త అటుఇటుగా వర్షాలు పడ్డాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే మెరుగైన వానలు పడ్డాయి. అన్నమయ్య, నెల్లూరు, కడప, శ్రీసత్యసాయి, కోనసీమ జిల్లాల్లో 40ు పైగా వానలోటు ఉంది. పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో 30ు పైన, కాకినాడ, నంద్యాల, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాల్లో 20ు దాకా వర్షపాతం తక్కువగా ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా (679 గ్రామీణ మండలాలకు) 397 మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైంది. కేవలం 61 మండలాల్లో అధిక వర్షాలు కురవగా, 215 మండలాల్లో సాధారణ వర్షాలు పడ్డాయి. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సగం మండలాల్లో వర్షాలు తక్కువగా పడ్డాయని ప్రభుత్వ నివేదికలు తెలియజేస్తున్నాయి.
వచ్చే నెలలోనూ వర్షాభావం
ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న దేశంలోని అనేక ప్రాంతాల్లో.. వచ్చే నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్, దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్ క్లైమేట్ సెంటర్ (ఏసీసీసీ) ఈ మేరకు అంచనా వేశాయి. దక్షిణ, మఽధ్యభారతంలో అనేక ప్రాంతాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తక్కువ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాభావం నెలకొని సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. పంటల దిగుబడిపై దీని ప్రభావం పడుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. భూగర్భ జలాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరకోస్తాలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదుకానున్నది. పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్‌నినో ప్రభావంతో దేశంలో ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావం కొనసాగుతున్నది. భారత వాతావరణ శాఖ నిపుణుల విశ్లేషణ మేరకు గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు దేశంలో 31 శాతం భూభాగం తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొన్నది. భూమిలో తేమశాతం తగ్గడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు దేశంలో 672.1 మి.మీ.లకుగాను 621.3 మి.మీ.లు (సాధారణం కంటే 8 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది.
ఈ లోటు రెండంకెలకు చేరుకోవచ్చని స్కైమెట్ నిపుణుడొకరు తెలిపారు. ఎల్‌నినో వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సగటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడచిన 60 ఏళ్లలో ఎల్‌నినో తీవ్రతతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరిగిన మూడు సంవత్సరాల్లో ఈ ఏడాది కూడా ఒకటి. ఆగస్టు నెలలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. రాయలసీమలో కర్నూలు, చి త్తూరు తప్ప మిగిలిన ఆరు జిల్లాల్లో సగానికిపైగా మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో 249 మండలాలకుగాను 165 మండలాల్లో వర్షాభావం నెలకొంది. కోస్తాలో నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, పశ్చిమగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు రాష్ట్రంలో 399.8 మి.మీ.లకు గాను 309.6 మి.మీ. వర్షపాతం (సాధారణం కంటే 22.8% తక్కువ) నమోదైంది.