కన్నుల పండువగా రథసప్తమి

ABN , First Publish Date - 2023-01-29T01:30:04+05:30 IST

శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల శనివారం చివరి రోజు రథసప్తమి పండుగ కలిసి రావడంతో ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా జరిగింది

కన్నుల పండువగా రథసప్తమి
పిడుగురాళ్లలో ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల రథం ఊరేగింపు

పిడుగురాళ్ల, జనవరి 28: శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల శనివారం చివరి రోజు రథసప్తమి పండుగ కలిసి రావడంతో ఈ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు పల్నాడు ప్రాంతానికి చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా స్వామివారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాలు, కలశ ఊరేగింపు, స్వామివారి కల్యాణం, పంచామృతాభిషేకాలు వంటి కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు.

నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మున్సిపల్‌ చైర్మన్‌ కొత్త వెంకట సుబ్బారావు, తహసీల్దారు కె. చక్రవర్తి, ఎంపీడీవో కాశయ్య తదితరులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాళాయపాలెం శివ స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు జిల్లా అన్నివిధాల అభివృద్ధి చెందాలని దేవుడిని కోరినట్లు ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడులోని పిడుగురాళ్లలో రథోత్సవం జరుపుకోవడం అందరికీ సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.

జై ఆంజనేయ.. జై వీరాంజనేయ.. అంటూ భక్తుల నినాదాలతో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి బయలుదేరిన రథం ఊరేగింపు పట్టణ ప్రధాన రహదారిపై జరిగింది. రథం లాగేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రధాన కూడళ్లలో భక్తులు స్వామి వారికి హారతులిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు కాకు మాను మల్లికార్జునరావు, కరాలపాటి సుబ్బారావు, భవిరిశెట్టి శ్రీనివాస రావు, బొలిశెట్టి రామ్మోహనరావు, మారం రామకృష్ణారావు, లఘువరపు శింగరయ్య, విప్పర్ల నాగాచారి తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు మజ్జిగ, తాగునీరు పంపిణీ

పిడుగురాళ్ల ఆంజనేయస్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ నేతలు భక్తులకు మజ్జిగ, తాగునీటి ప్యాకెట్లను అందించారు. పార్టీ కార్యాలయ సమీపంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు యువసేన ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. అలాగే జనసేన పార్టీ ఆధ్వర్యంలోనూ ఆ పార్టీ నేతలు భక్తులకు మజ్జిగ, తాగు నీటిని పంపిణీ చేశారు.

దాచేపల్లి : రథసప్తమి వేడుకల్లో భాగంగా శనివారం దాచేపల్లిలోని శ్రీవీర్ల అంకమ్మ తల్లి దేవాలయంలో మహిళలు ఆవు పిడకలు, పాలు కట్టెలతో కలిసి ప్రత్యేకమైన ప్రసాదాన్ని తయారు చేశారు. ఆలయ అర్చకులు మండాది పవన్‌కుమార్‌శర్మ, పుల్టాబొట్ల మారుతీశర్మ ఆధ్వర్యాన చండీ హోమం, పారాయణం నిర్వహించారు.

పెదకూరపాడు : మండలంలోని 75 తాళ్ళూరు అయోధ్య స్వామి ఆశ్రమంలో శనివారం రథ సప్తమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభ మైన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య స్వామి, సాయి నాధుడు, దత్తీశ్వరుడు విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాటి కోటేశ్వరమ్మ, రామకృష్ణ, స్వతంత్ర భారతి, శ్రీనివాసరెడ్డి, వెంకయ్య స్వామి, శివ రామిరెడ్డి, సాయి సుబ్బారావులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి: రథ సప్తమి సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో సూర్యనారాయణ స్వామి ఆరాధన, లలిత సహస్ర నామం, గోపూజా కార్యక్రమాలు గోశాలలో జరిగాయి. అనంతరం మహిళా మండలి సభ్యులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

అమరావతి: రథసప్తమి పర్వదినం పురస్కరించుకుని చావపాడు లోని శివాలయంలో వేదపాఠశాల విద్యార్ధులచే పూజలు నిర్వహించారు. అర్చకులు ఘంటసాల చంద్రమౌళి, మణికంఠ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు చేశారు. బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి, సూర్యదేవాలయంలో అర్చకులు పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-01-29T01:30:08+05:30 IST