పేదల గళంతో టీడీపీ పోరాటం

ABN , First Publish Date - 2023-03-02T00:40:32+05:30 IST

పేదల గళంతో ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అరాచకాలపై పోరాటం సాగిస్తామని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు.

పేదల గళంతో టీడీపీ పోరాటం

30వ వార్డులో నరేంద్రకుమార్‌కు స్వాగతం పలుకుతున్న టీడీపీ నాయకులు

పొన్నూరుటౌన్‌, మార్చి 1 : పేదల గళంతో ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అరాచకాలపై పోరాటం సాగిస్తామని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. పొన్నూరులోని 30వ వార్డులో బుధవారం ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఈ సందర్భంగా వార్డులో విస్తృతంగా పర్యటించిన ఆయన ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తెలగపాలెం రామమందిరం వద్ద జరిగిన బహిరంగ సభలో నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ పొన్నూరు పట్టణం గడచిన మూడున్నరేళ్లుగా అభివృద్ధిలో కుంటుపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన పేదల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. రూ.200 ఉన్న సామాజిక పింఛన్‌ను చంద్రబాబు రూ.2 వేలకు పెంచారన్నారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు రూ.3 వేలు చేస్తానని సొంత పత్రికలో ప్రకటనలు ఇచ్చి నేటికీ దానిని అమలు చేయడం లేదని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఊరికో ప్యాలెస్‌ నిర్మించుకుంటున్నాడని, కానీ పేదవాడికి సొంత ఇల్లు ఉంటే పింఛను తొలగిస్తున్నాడని అన్నారు. పొన్నూరు పట్టణమంటేనే లారీలకు, మెకానిక్‌లకు ప్రసిద్ధి అన్నారు. కానీ జగన్‌రెడ్డి తెచ్చిన గ్రీన్‌ ట్యాక్స్‌లు, ప్రభుత్వ విధానాలతో లారీ ఓనర్లు వాటిని అమ్ముకుని ఇతర పనులకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. పట్టణంలో చిరు వ్యాపారులపై పురపాలక సంఘం అధికారులు వసూళ్ల దందా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంజనేయస్వామి గుడిలో పార్కింగ్‌ పొందిన వైసీపీ నాయకుడు ఆర్‌అండ్‌బి రోడ్‌పై కూడా అక్రమ పద్ధతిలో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే రేషన్‌ మాఫియా మర్డర్‌ జరిగిందని, కానీ రోజుల వ్యవధిలోనే రేషన్‌ మాఫియాను తిరిగి ప్రారంభించారన్నారు. పట్టణంలో యువతను గంజాయి, వ్యసనాలకు బానిసలను చేసి నిర్వీర్యం చేయాలని వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు బాధాకరమన్నారు. కార్యక్రమంలో యరసాని శ్రీరామ్మూర్తి, తోట ప్రసాద్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Updated Date - 2023-03-02T00:40:32+05:30 IST