రాష్ట్ర బీజేపీ సారథిగా పురందేశ్వరి
ABN , First Publish Date - 2023-07-05T03:26:23+05:30 IST
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు.
సోము వీర్రాజుకు ఉద్వాసనఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ పెద్దలు కొంతకాలంగా సత్యకుమార్, సుజనా, సీఎం రమేశ్ పేర్ల ప్రచారం సత్యకుమార్‌ను వ్యతిరేకించిన సంతోష్ చివరకు ఎన్టీఆర్ కుమార్తెకు చాన్సు ఎన్నికల ఏడాదిలో కీలక బాధ్యతలు తొలి నుంచీ పెద్దలతో సత్సంబంధాలు కలిసివచ్చిన అనుభవం, కుటుంబ నేపథ్యం జాతీయ కార్యవర్గంలోకి కిరణ్‌కుమార్‌రెడ్డివైసీపీతో అంటకాగి!ఉద్వాసన వీర్రాజు స్వయంకృతమే! పగ్గాలు చేపట్టాక సంస్థాగత బలోపేతం లేదు పార్టీలోకి చేరికలూ బంద్.. పైగా గిట్టనివారి సస్పెన్షన్లు ఒక్క ఉప ఎన్నికలోనూ పార్టీకి డిపాజిట్లు రాని వైనం
న్యూఢిల్లీ/అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెను నియమించినట్లు ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. పార్టీ అధిష్ఠానంతో సత్సంబంధాలు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతోపాటు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె కావడంతో ఎన్నికల ఏడాదిలో ఢిల్లీ పెద్దలు పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి వంతపాడుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజును అధిష్ఠానం తొలగించింది. గత కొద్ది రోజులుగా ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి పేర్లు గట్టిగా వినిపించాయి. రెండు మూడ్రోజులుగా ఎంపీ సీఎం రమేశ్ పేరు కూడా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రేసులో లేని పురందేశ్వరిని నియమించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షెడ్యూల్ ప్రకారం గట్టిగా పది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఎన్టీఆర్ కుమార్తెకు బీజేపీ అగ్రనాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
అంతుబట్టని వ్యూహం
గత మూడేళ్లలో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా తీసుకురాలేకపోయారని వీర్రాజుపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. పైగా సీఎం జగన్‌కు ఆయన వంతపాడుతుంటారు. రాజధాని అమరావతి విషయంలో ఆయన వైఖరి తీవ్ర విమర్శల పాలైంది. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకున్న తర్వాత గాని.. ఆయన బృందం అమరావతికి మద్దతు ప్రకటించలేదు. ఆయన్ను తొలగించాలని పలువురు పలు సందర్భాల్లో అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆయనే కొనసాగుతారని వీర్రాజు నమ్ముకున్న జాతీయ నేతలు అప్పట్లో ప్రకటనలు గుప్పించారు. అయితే పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతోపాటు వీర్రాజును కూడా మార్చుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సోము వర్గం మాత్రం ఇదంతా గిట్టని వ్యక్తుల ప్రచారమంటూ కొట్టివేసింది. అయితే జాతీయ నాయకత్వం ఎవరికీ అంతుబట్టని విధంగా నిర్ణయం తీసుకుంది. వీర్రాజుకు నడ్డా నుంచి ఫోన్ వచ్చిన విషయం తెలియగానే సత్యకుమార్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే సాయంత్రానికి పురందేశ్వరి పేరు ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన తమతో చేతులు కలిపే విషయంలో అస్పష్టత ఏర్పడడం వల్లే ఆమెను నియమించారని, దీనికితోడు సత్యకుమార్‌ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వ్యతిరేకించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నలుగురితో సఖ్యతగా ఉంటూ ఆప్యాయంగా పలుకరించే గుణంతోపాటు 2004 నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, కుటుంబ నేపథ్యం పురందేశ్వరికి కలిసొచ్చాయని విశ్లేషకుల అంచనా. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీలో ప్రాధాన్యం లభించదనే అపవాదు నుంచి బయటపడి.. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పురందేశ్వరి ద్వారా తటస్థులను పార్టీలోకి తీసుకోవచ్చని, రాష్ట్రంలోని ఓ కీలక సామాజిక వర్గానికి చేరువ కావచ్చన్నది ఢిల్లీ పెద్దల వ్యూహంగా భావిస్తున్నారు. నియామక ప్రకటన వెలువడే సమయానికి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కేదార్‌నాథ్ పర్యటనలో ఉన్నారు. నాయకత్వ నిర్ణయాన్ని భగవంతుడి దయగా ఆమె పేర్కొన్నారు. శుభాకాంక్షలు చెప్పేవారు చేసే ఫోన్లతో ఆమె ఫోను కొన్ని గంటల పాటు నిర్విరామంగా మోగినట్లు తెలిసింది.
పవన్ శుభాకాంక్షలు
బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన ఆమె.. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని కోరారు.
నన్ను తొలగించారు: వీర్రాజు
‘మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయండి’ అని తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఫోన్ చేసినట్లు సోము వీర్రాజు విలేకరులకు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్న సమయంలోనే నాయకత్వం ఆయన్ను మార్చుతున్నట్లు ప్రకటించింది. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనను పదవి నుంచి తొలగించారని ఆయన బదులిచ్చారు. అయితే దీనిపై ఎటువంటి బాధా లేదన్నారు. అధిష్ఠానానికి తనపై వెళ్లిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటి సహజమేనని చెప్పారు. ఇలాంటివి తనకు కొత్త కాదన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకం మంచి సంకేతాన్ని ఇచ్చిందని తెలిపారు.
పురందేశ్వరి జీవన విశేషాలు..
పేరు : దగ్గుబాటి పురందేశ్వరి
తండ్రి : ఎన్టీఆర్
తల్లి : బసవతారకం
జననం : 22041959(చెన్నై)
వివాహం : 09051979
భర్త : దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతానం : కుమారుడు హితేశ్
చెంచురామ్, కుమార్తె నివేదిత
విద్యార్హతలు: ప్రాథమిక విద్య, సేక్రెడ్ హార్ట్ హైస్కూల్, చెన్నై.. ఉన్నత విద్య: యతిరాజా కాలేజీ, చెన్నై.. డిప్లొమా ఇన్ జెమాలజీ, ముంబై. పద్మావతి (తిరుపతి); బీజాపూర్ (కర్ణాటక) యూనివర్సిటీల నుంచి డాక్టరేట్. వెంపటి చిన సత్యం వద్ద కూచిపూరి నాట్యంలో శిక్షణ.
భాషలు: తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం
రాజకీయ ప్రవేశం: 2004లో కాంగ్రెస్‌లో చేరిక. అదే ఏడాది బాపట్ల నుంచి లోక్‌సభకు ఎన్నిక. 2009లో విశాఖపట్నం ఎంపీగా గెలుపు.
కేంద్ర మంత్రి: 2006లో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు. 2014 వరకూ మంత్రి పదవిలోనే.
బీజేపీలో: రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా.. 2014 మార్చి 2న బీజేపీలో చేరిక. రాజంపేట నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి. 2019లో విశాఖలో పరాజయం.
పార్టీ పదవులు: మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఇన్‌చార్జి
ఉత్తమ పార్లమెంటేరియన్: పార్లమెంటులో మహిళ, విద్యా, వ్యవసాయం వంటి బిల్లులపై ప్రసంగించి ప్రశంసలు పొందారు. 200405లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందారు.
విదేశీ సదస్సులు: భారత ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి హోదాలో అమెరికా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఈజిప్టు, ఇంగ్లాండ్, నేపాల్, కెన్యా, మలేసియా తదితర దేశాల్లో పర్యటన. లారా బుష్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్‌లో అడ్వాన్సింగ్ గ్లోబల్ లిటరసీ అంశంపై ప్రసంగించిన తొలి మహిళగా రికార్డు.
పొత్తా.. ఒంటరి పోరా?
పురందేశ్వరి నియామకం ద్వారా.. రాష్ట్రంలో ఒంటరిగా బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించినట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనసేనటీడీపీతో జట్టుకట్టాలని భావించినా.. జగన్‌తో ఢిల్లీ పెద్దల సాన్నిహిత్యం కారణంగా ఆ పార్టీలు సానుకూలంగా లేకపోవడంతో ఒంటరిపోరు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న సత్యకుమార్‌ను కాకుండా మధ్యేమార్గంగా పురందేశ్వరిని ఎంచుకున్నారని బీజేపీ వర్గాలు కూడా అంటున్నాయి. బుధవారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను కలిసేందుకు జగన్ ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో ఆమె నియామకానికి ప్రాధాన్యం సంతరించుకుంది.