థియరీ కంటే ముందే ప్రాక్టికల్స్
ABN , First Publish Date - 2023-01-11T03:00:40+05:30 IST
థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్స్ నిర్వహించేలా ఇంటర్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసింది.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు
26 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): థియరీ పరీక్షల కంటే ముందే ప్రాక్టికల్స్ నిర్వహించేలా ఇంటర్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని పేర్కొంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది. తొలుత ఇచ్చిన షెడ్యూలులో థియరీ పరీక్షల అనంతరం ఏప్రిల్‌లో ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఏప్రిల్‌లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తే ఎంసెట్, జేఈఈ, ఇతర ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఉండదనే విమర్శలు వచ్చాయి. దీనిపై ‘ఎంసెట్‌కు ఎప్పుడు చదవాలి?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన ఇంటర్ విద్యామండలి దీనిపై పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఎప్పటిలాగే ప్రాక్టికల్స్‌ను ముందుకు తీసుకురావాలని నిర్ణయించి తాజా షెడ్యూలు విడుదల చేసింది.