పరిశ్రమలకు పవర్‌ కట్‌

ABN , First Publish Date - 2023-09-04T03:06:03+05:30 IST

రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. శనివారం రెండు డిస్కమ్‌ల పరిధిలో కలిపి సగటున 4.145గంటల సేపు విద్యుత్తు సరఫరాను నియంత్రించాయి.

పరిశ్రమలకు పవర్‌ కట్‌

రాష్ట్రవ్యాప్తంగా సగటున 4 గంటలు విద్యుత్తు కోత

సెప్టెంబరు తొలి వారంలోనే సరఫరాపై నియంత్రణా?

ప్రతికూల ఫలితాలే: ఇంధన రంగ నిపుణుల ఆందోళన

మార్కెట్‌ నుంచి 38.542 ఎంయూ కొనుగోలు

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. శనివారం రెండు డిస్కమ్‌ల పరిధిలో కలిపి సగటున 4.145గంటల సేపు విద్యుత్తు సరఫరాను నియంత్రించాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో పరిశ్రమలకు ప్రత్యేకంగా పవర్‌ హాలిడే ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోందని ఇంధన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్తు సరఫరా స్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించిన కథనాలకు డిస్కమ్‌లు, రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ)

స్పందించాయి. అవసరమైతే ప్రభుత్వం, ఏపీఈఆర్‌సీ ఆమోదంతో పరిశ్రమలకు సరఫరాను కుదిస్తామని వెల్లడించాయి. కానీ పరిశ్రమలకు సరఫరాలో నియంత్రణను శనివారమే మొదలుపెట్టాయని ఇంధనరంగ సంస్థలు వెబ్‌సైట్‌లో పేర్కొన్నాయి. అధికారిక సమాచారం మేరకు... శనివారం పరిశ్రమలకు ఈపీడీసీఎల్‌ పరిధిలో 4.630 గంటలు, ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో 3.660 గంటలు చొప్పున మొత్తం 8.290గంటల సేపు విద్యుత్తు సరఫరాను నియంత్రించినట్లుగా డిస్కమ్‌లు తెలిపాయి. సహజంగా పరిశ్రమలకు ఏప్రిల్‌, మే నెలల్లో పవర్‌ హాలిడే ప్రకటిస్తారు. సెప్టెంబరు తొలివారంలోనే ఈ విధానాన్ని అమలు చేయడం పారిశ్రామిక వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పరిశ్రమలకు లోడ్‌ రిలీఫ్‌ పేరిట విద్యుత్తు సరఫరాను నియంత్రిస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని ఇంధనరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడుగంటుతున్న బొగ్గు నిల్వలు

రాష్ట్రంలో శనివారం 198.260 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అందుబాటులో ఉంది. డిమాండ్‌ 240.134 మిలియన్‌ యూనిట్లు ఉంది. మార్కెట్‌ నుంచి 38.542 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేశారు. సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి ఆశించిన స్థాయిలో దాదాపు 21 మిలియన్‌ యూనిట్ల మేర అందుబాటులో ఉంటే.. పవన విద్యుత్తు మాత్రం ఘోరంగా దెబ్బతీస్తోంది. ఉత్పత్తి సామర్థ్యం 27.147 మిలియన్‌ యూనిట్లకు గాను కేవలం 4.002 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. విండ్‌ పవర్‌లోనే దాదాపు 23 మిలియన్‌ యూనిట్ల లోటు కనిపిస్తోంది. దీనికితోడు జలవిద్యుత్తు నిలిచిపోయింది. థర్మల్‌ విద్యుత్తు 72.329 మిలియన్‌ యూనిట్లకు గాను 65.806 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. వీటీపీఎ్‌సలో రోజుకు సగటున 28,500 టన్నుల బొగ్గు అవసరం. ఈ యూనిట్‌లో 73786 టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు మూడు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఆర్‌టీపీపీలో రోజుకు సగటున 21000 టన్నుల బొగ్గు అవసరం కాగా కేవలం 35,495 టన్నులు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణపట్నంలో రోజుకు 19000 టన్నుల బొగ్గు అవసరం కాగా 2,34,750 టన్నుల మేర నిల్వలు ఉన్నాయి.

ఇంధన రంగంపై శ్వేతపత్రం: రాజకీయ పక్షాలు

రాష్ట్ర ఇంధన రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎప్పడో 2014-19 మధ్య వాడుకున్న కరెంటుకు ట్రూఅప్‌ చార్జీల పేరిట దాదాపు రూ.3,200కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశారని, ఆ తర్వాత ఇంధన సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నా విద్యుత్తు సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్తున్నాయని ప్రశ్నిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ విద్యుత్తు రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఇంధన సంస్థలు తీసుకున్న రుణాల వివరాలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్‌ మీటర్ల కోసం చేసిన అప్పుల వివరాలను ఏపీఈఆర్‌సీ బహిర్గతం చేయాలని కోరుతున్నాయి.

Updated Date - 2023-09-04T03:06:03+05:30 IST