పోలవరం మరింత ఆలస్యం

ABN , First Publish Date - 2023-02-07T03:07:21+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.

పోలవరం మరింత ఆలస్యం

పార్లమెంటులో కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు

గతేడాది అక్టోబరు నాటికి ప్రాజెక్టు పనులు 78.99 శాతం పూర్తి

హెడ్‌వర్క్స్‌ 77.1 శాతం, కనెక్టివిటీ ప్యాకేజీ పనులు 68.51 శాతమయ్యాయి

ప్రధాన కాలువల పనులు.. ఎడమ 72.8, కుడి 92.75 శాతం: మంత్రి విశ్వేశ్వర్‌

న్యూఢిల్లీ, అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ప్రస్తుత కాలవ్యవధి ప్రకారం 2024 మార్చి నాటికి ప్రాజెక్టు, అదే ఏడాది జూన్‌ నాటిని డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పూర్తి కావాలని, కానీ, 2020, 2022లో గోదావరి నదికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే అవకాశముందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించిన నాటి నుంచి గతేడాది డిసెంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,035.88 కోట్లను ఖర్చు చేసిందని, అందులో రీయింబర్స్‌మెంట్‌కు అర్హమైన రూ. 13,226.04 కోట్లను విడుదల చేశామని, మిగతా రూ.2,390.27 కోట్ల బిల్లుల రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని తేలిందన్నారు. మరో రూ.548.38 కోట్ల బిల్లులు పరిశీలన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాయని తెలిపారు.

కాగా, స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యామ్‌, కాంక్రీట్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌కు చెందిన డయాఫ్రమ్‌ వాల్స్‌ పూర్తయ్యాయని, ఈసీఆర్‌ఎఫ్‌, నిర్వాసితులకు పునరావాస, పరిహార ప్యాకేజీ అందించే ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. గతేడాది అక్టోబరు నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భౌతిక పనులు 78.99 శాతం పూర్తయ్యాయని మంత్రి వివరించారు. హెడ్‌వర్క్‌ పనులు 77.1 శాతం, కనెక్టివిటీ ప్యాకేజీ పనులు 68.51 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 72.8 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 92.75 శాతం, భూసేకరణ, పునరావాసం, పరిహారం కల్పన 22.16 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2020లోనూ.. ఆ తర్వాత 2021లోనూ.. మళ్లీ 2022 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అది 2024 నాటికి పూర్తవుతుందని తాజాగా కేంద్రం పార్లమెంటులో అధికారికంగా వెల్లడించడం విశేషం.

హైడల్‌ పవర్‌ ప్రాజెక్టుకు నిధులివ్వం: షెకావత్‌

పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏపీజెన్కో సంస్థ చేపడుతున్న 960 సామర్థ్యం గల హైడల్‌ పవర్‌ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమాధానం ఇచ్చారు. పవర్‌ హౌజ్‌ ఎర్త్‌వర్క్‌ పనులు పూర్తయ్యాయని, 2026 జనవరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నామని ఏపీ జెన్కో సమాచారం ఇచ్చిందన్నారు. కాగా, 2019లో అంచనా వ్యయం రూ.4200 కోట్లలో అప్పటికే పూర్తి చేసిన పనులు పోను.. మిగిలిన రూ.3,216 కోట్లకు జగన్‌ సర్కారు రివర్స్‌ టెండరులో కాంట్రాక్టు సంస్థలను ఆహ్వానించింది. 12.6 శాతం మైన్‌సకు కోట్‌ చేసి.. రూ.2,810 కోట్లకు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ఆ కాంట్రాక్టును దక్కించుకుంది. 2024లోగా పూర్తి చేస్తామని ఒప్పందం చేసింది. అయితే, ఇది రూ.5,338 కోట్ల వ్యయంతో 2026 జనవరిలో పూర్తవుతుందని తాజాగా కేంద్రం పార్లమెంటులో స్పష్టం చేసింది. ఈ వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తేల్చిచెప్పింది. కాగా, రూ.2,810కోట్లకు పూర్తి చేస్తామని మేఘా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నందున, ఇప్పుడది రూ.5,338 కోట్లకు ఎలా ఎగబాకిందో ఏపీ జెన్కో స్పష్టం చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-02-07T03:10:55+05:30 IST