సైకో ప్రభుత్వంలో దళితులకు అన్యాయం
ABN , First Publish Date - 2023-05-26T00:08:41+05:30 IST
రాష్ట్రంలో సైకో ప్రభుత్వ పాలనలో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. తన

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్
జగనన్న కాలనీల్లో భూ కోనుగోళ్లపై విచారణ చేపట్టాలని డిమాండ్
పొన్నూరుటౌన్, మే 25: రాష్ట్రంలో సైకో ప్రభుత్వ పాలనలో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. తన భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమించు కోవడానికి పూనుకున్న తరుణంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిలుమూరి కన్నయ్యను గురువారం నరేంద్రకుమార్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం నరేంద్రకుమార్ మాట్లాడుతూ ఆరెమండ గ్రామంలో జగనన్న కాలనీలకు సేకరించిన భూమిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బాధితులు చెప్పిన విషయం ప్రకారం 18 సెంట్ల భూమి వాస్తవంగా లేకపోయినప్పటికీ డాక్యుమెంట్ల ప్రకారంగా ఉన్నట్లు చూపి గతంలో రెవెన్యూ అధికారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోందన్నారు. లేని భూమిని ఉన్నట్లుగా చూపేందుకు సమీపంలోని దళితుల భూమిని ఆక్రమించు కోవాలనుకోవడం సరి కాదన్నారు. కన్నయ్యకు చెందిన నాలుగు సెంట్ల భూమిలో రెండు సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమ పద్ధతిలో పొందాలనుకోవడం దుర్మార్గ మన్నారు. బాధితుడికి అండగా నిలుస్తామని, వారి తరఫున టీడీపీ పోరాడు తుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనతో పాటు జగనన్న కాలనీల కోసం జరిగిన భూ కొనుగోళ్లన్నింటిపై విచారణ జరపాలంటూ కలెక్టరును, ప్రభుత్వాన్ని నరేంద్రకుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బండ్లమూడి బాబూరావు, పఠాన్ అహ్మద్‌ఖాన్, గరిగంటి సాయిబాబు, పఠాన్ ఫిరోజ్‌ఖాన్, మహమ్మద్ గౌస్, షేక్ బాజీ సాహెబ్, పిన్నమనేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.