నాటకరంగాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత అందరిది
ABN , First Publish Date - 2023-05-31T00:28:52+05:30 IST
సమాజంలో రుగ్మతలను ఎత్తి చూపుతూ, దోపిడీ వ్యవస్థను రూపుమాపే శక్తి నాటకరంగానికి ఉందని అలాంటి నాటకరంగాన్ని బతికిస్తున్న పరుచూరి బ్రదర్స్ అభినందనీయులని పలువురు వక్తలు కొనియాడారు.
భట్టిప్రోలు, మే 30: సమాజంలో రుగ్మతలను ఎత్తి చూపుతూ, దోపిడీ వ్యవస్థను రూపుమాపే శక్తి నాటకరంగానికి ఉందని అలాంటి నాటకరంగాన్ని బతికిస్తున్న పరుచూరి బ్రదర్స్ అభినందనీయులని పలువురు వక్తలు కొనియాడారు. మండలంలోని పల్లెకోనలోగల నందమూరి తారకరామారావు కళా ప్రాంగణం, పరుచూరి రఘుబాబు, టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ కళా మండపంలో నిర్వహిస్తున్న డాక్టర్ డి.రామానాయుడు అఖిల భారత 31వ నాటకపోటీలు కళాభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. మూడోరోజు మంగళవారం ప్రదర్శించిన నాటకపోటీల్లో కళాకారులు పోటీపడి తమ ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కళారంగాన్ని బతికించాలన్న సంకల్పంతో గత 31 సంవత్సరాలుగా నాటక పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు రోజుల పాటు 6 నాటకాలను పరుచూరి రఘుబాబు స్మారకంగా నిర్వహిస్తున్నామన్నారు. పోటీలను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని నాటక రంగాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజాన్ని మేల్కొల్పే శక్తి నాటకరంగానికే ఉందని అలాంటి నాటక రంగం నుండి ఎందరో కళాకారులను సినిమా రంగానికి పరిచయం చేశామని వెంకటేశ్వరరావు చెప్పారు.
రాజకీయ వ్యవస్థల్ని ఎత్తిచూపిన సిరిమింగిన వెలగపండు..
ప్రజాస్వామ్యం రాజకీయం, పరిపాలన, న్యాయస్థానాలు, జర్నలిజం అనే నాలుగు వ్యవస్థల మీద నిలబడి ఉండాలని కానీ ప్రస్తుతం రాజకీయం డబ్బుకు లొంగిపోయిందని మొత్తం ప్రజాస్వామ్యాన్నే వెలగపండులా మార్చేశాయని రాజకీయ పరిణామాల్ని ఎత్తిచూపింది సిరిమింగిన వెలగపండు నాటకం. సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద సంధించిన ఒక సరికొత్త రాజకీయ వ్యంగ్య నాటకం సిరిమింగిన వెలగపండు నాటకం ఇతివృత్తం. ఈ నాటకానికి శ్రీశైలమూర్తి రచన చేయగా మోహన్ సేనాపతి దర్శకత్వం వహించారు.
కంటతడి పెట్టించిన ఇంద్రప్రస్థం...
జీవితం గొప్పగా ఎదగాలన్నా జీవన విధానం మరింత అం దంగా సాగిపోవాలన్నా చేదోడు అవసరం చేయూత అవసరం.. ఈ సృష్టిలో ప్ర తి మనిషి జీవితానికి నడక, న డత, నడవడిక నేర్పి తన అను భవాలను పాఠాలుగా బోధించి మంచి భవిష్యత్తును ఇవ్వగలిగేది ఒక్క నాన్న మాత్రమేనని కళ్ళకు కట్టినట్లు నటించారు కళాకారులు. తనదైన శైలిలో తన కఽథను తానే గొప్పగా నిర్మించుకున్న నాన్న కథ ఇది. నాన్న ఉన్న ఇల్లు అద్భుతమైన ఇంద్రప్రస్థంలా వెలుగులు వెదజల్లుతుందని తెలియజెప్పే నాటకం ఇంద్రప్రస్థం. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శిం చిన ఈ నాటకానికి శ్రీస్నిగ్ధ రచన చేయగా రవీంద్రారెడ్డి దర్శకత్వం వహించారు.
ఉచిత మెగా వైద్య శిబిరం
పల్లెకోనలో జరుగుతున్న పరుచూరి రఘుబాబు స్మారక 31వ నాటకోత్సవాలలో భాగంగా ఆడిటోరియం ప్రాంగణంలో బుధవారం ఉదయం 9 గంటల నుండి ఆంధ్ర హాస్పిటల్ విజయవాడ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారన్నారు. పల్లెకోన, సమీప గ్రామాల ప్రజలు ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు.