తన పదవిపోయినా రాజధాని నాశనం కావాలనే జగన్‌ క్రూర నాటకం

ABN , First Publish Date - 2023-05-27T00:49:23+05:30 IST

2024 తరువాత తన సీఎం పదవి పోయినా కూడా రాజధాని నాశనం కావాలనే జగన్మోహన్‌రెడ్డి క్రూర నాటకం ఆడుతున్నారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఽధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ విమర్శించారు.

తన పదవిపోయినా రాజధాని నాశనం కావాలనే జగన్‌ క్రూర నాటకం
పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు, మే 26 (ఆంధ్ర జ్యోతి): 2024 తరువాత తన సీఎం పదవి పోయినా కూడా రాజధాని నాశనం కావాలనే జగన్మోహన్‌రెడ్డి క్రూర నాటకం ఆడుతున్నారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఽధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తను లేకపోయినా అమరావతి నాశనం కావాలనే రాజధానిలో పేదల ఇళ్లస్థలాల నాటకానికి జగన్‌ తెరలేపారని ఆరోపించారు. నాడు ఎడారి అన్నవాడు ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చి 23 వేల మంది గుంటూరు, 27 వేల మంది కృష్ణా జిల్లా వాసులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే 50 వేల మంది పేదల కోసం అంటూ అమరావతిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికే సుప్రీం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా భూముల పందేరం మొదలు పెట్టారన్నారు. అధికారం వచ్చిన వెంటనే ఊసరవెల్లి మాదిరిగా రంగులు మారుస్తూ రంగుల ప్రపంచం చూపిస్తూ ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి సభలో ముఖ్యమంత్రి మూడు ఆప్షన్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో కూడా ఇలా ఆప్షన్లు ఇచ్చే లక్షలాది మంది పేదలను మోసం చేసిన సంగతి ముఖ్యమంత్రి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. రాజధాని మహిళలపై పోలీసుల వైఖరి, మాటలు హేయమన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టారు, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్‌, దామచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:49:23+05:30 IST