చందాలు వేసుకుని.. కాలువ మరమ్మతులు
ABN , First Publish Date - 2023-01-03T00:39:27+05:30 IST
సుమారు 200 మంది రైతులు.. ఒక్కొక్కరు రూ.300 చొప్పున చందాలు వేసుకున్నారు. మొత్తం రూ.70వేలతో కాల్వను జేసీబీ సాయంతో బాగుచేసుకున్నారు.
ములకలూరి మేజర్‌ను సొంతగా బాగు చేసుకుంటున్న రైతులు
ముప్పాళ్ళ, జనవరి2: సుమారు 200 మంది రైతులు.. ఒక్కొక్కరు రూ.300 చొప్పున చందాలు వేసుకున్నారు. మొత్తం రూ.70వేలతో కాల్వను జేసీబీ సాయంతో బాగుచేసుకున్నారు. మండలంలోని ములకలూరి మేజర్ పరిధిలో ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగుచేస్తున్నారు. ప్రభుత్వం మూడేళ్లుగా మేజర్‌లో ఎటువంటి పూడికతీత పనులను చేపట్ట లేదు. దీంతో కాల్వలో రెల్లుగడ్డి, తూటికాడ, గడ్డి పెద్దఎత్తున పెరిగి నీటిపారుదలకు ఆటంకంగా మారింది. దీంతో అక్కడక్కడ కాలువగట్లపై నీరు ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు, ఎరువులు, పురుగుమందులు చల్లుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పైర్లకు సకాలంలో నీరుఅందక మొక్కజొన్న బెట్టకు వచ్చింది. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీపుకెళ్ళినా ప్రయోజనం లేదని, తామే బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రూ.70వేలు వసూలుచేసుకుని రైతులు సొంతంగా కాలువలోని రెల్లుగడ్డి, తూటికాడ, గడ్డి తొలగించుకుని తమ పంటలను కాపాడుకున్నారు.