బదిలీలకు మోక్షమెన్నడు..!
ABN , First Publish Date - 2023-02-07T03:24:34+05:30 IST
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) అలసత్వానికి మారు పేరుగా మారిపోయింది. ఏ పని తలపెట్టినా కాలయాపన తప్పడం లేదు.

వైద్యుల బదిలీలు మూడు నెలలుగా పెండింగ్
ఏపీవీవీపీ కమిషనరేట్ నిర్లక్ష్యంతోనే ఇక్కట్లు
కోర్టుకు వెళ్లేందుకు వైద్యులు సిద్ధం
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) అలసత్వానికి మారు పేరుగా మారిపోయింది. ఏ పని తలపెట్టినా కాలయాపన తప్పడం లేదు. పదోన్నతులు, బదిలీలకు కూడా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. 58 మంది వైద్యులకు సంబంధించిన బదిలీల ప్రక్రియ మూడు నెలల నుంచి కొనసాగుతూనే ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. 10 నెలల క్రితం ఏపీవీవీపీ అధికారులు దాదాపు 250 మంది వైద్యులకు ఒకేసారి సీఏఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) నుంచి సీఎ్‌సఎస్ (సివిల్ సర్జన్ స్పెషలి్‌స్ట)గా పదోన్నతులు కల్పించారు. అయితే, పదోన్నతి పొందిన వైద్యులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వబోమని అడ్డగోలు నిబంధన పెట్టారు. దీంతో 165 మంది వైద్యులు మాత్రమే పదోన్నతి తీసుకోగా, మిగిలినవారు వదులుకున్నారు. అనంతరం ఏపీవీవీపీ అధికారులు మరికొంత మంది వైద్యులకు పదోన్నతులు కల్పించి లోకల్, నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోస్టింగులు ఇచ్చారు. దీంతో.. తమకు స్థానిక ఆస్పత్రుల్లో పోస్టింగ్ ఇవ్వబోమని నిబంధన పెట్టి, తమ తర్వాత పదోన్నతి పొందిన వారికి మాత్రం లోకల్ ఆస్పత్రుల్లో పోస్టింగ్ ఎలా ఇచ్చారని 165 మంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చివరికి వారికి అన్యాయం జరిగిందని భావించిన ప్రభుత్వం రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది నవంబరు 22న 165 మంది వైద్యుల బదిలీలకు ఏపీవీవీపీ కమిషనర్ నోటిఫికేషన్ జారీచేశారు. మూడ్రోజుల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తర్వాత రెండు రోజుల్లో బదిలీల జాబితా సిద్ధం చేసి వెబ్‌సైట్‌లో పొందుపరచాలని, అభ్యంతరాలకు ఒకరోజు గడువిచ్చి.. ఆ తర్వాత రెండ్రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించారు. వాస్తవంగా బదిలీల ప్రక్రియకు ఇంతకన్నా ఎక్కువ సమయం పట్టదు. కాగా, రిక్వెస్ట్ బదిలీల కోసం 104మంది దరఖాస్తు చేసుకోగా అందులో 58మందినే అధికారులు ఆమోదించారు. ఇదంతా పూర్తయి దాదాపు మూడు నెలలైనా బదిలీల ప్రక్రియ మాత్రం తుది దశకు చేరలేదు. అభ్యర్థుల అభ్యంతరాలు స్వీకరించి రెండు నెలలు, అనంతరం ఫైనల్ లిస్ట్ సిద్ధం చేసి రెండున్నర నెలలైంది. ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోవడానికి ఏపీవీవీపీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కాలయాపనచేస్తూనే ఉన్నారు.
బదిలీలు ఉంటాయా.. లేదా...?
ఏపీవీవీపీ కమిషనర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు 58 మంది బదిలీలకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవడానికి అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీవీవీపీ కమిషనర్ నుంచి ఫైల్ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడం, వారు మళ్లీ కమిషనర్‌కు పంపించడం... ఇలా నెల రోజులుగా కాలయాపన చేస్తున్నారు. మరోవైపు ఈ 58 మంది వైద్యుల బదిలీలను రెండు ఫైల్స్‌గా డివైడ్ చేశారు. 48 మందికి సంబంధించిన బదిలీల ఫైల్ ప్రభుత్వం వద్ద, 10 మందికి సంబంధించిన ఫైల్ ఆరోగ్యశాఖ కమిషనర్ జె.నివాస్ వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉంది. ఏపీవీవీపీ కమిషనరేట్ అధికారులు చేసిన తప్పిదాల వల్లే ఈ సమస్య వచ్చిందని ఆరోపిస్తున్నారు. రిక్వెస్ట్ బదిలీల ప్రక్రియపైనా కాలయాపన చేయడంతో కొంత మంది వైద్యులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.